You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Special: ‘బ్యూటీ పార్లర్‌లో పని అని చెప్పి వంట చేయిస్తున్నారు..’
- రచయిత, ప్రమీలా కృష్ణన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''నేను చనిపోతానేమోనని నాకు భయంగా ఉంది. నన్ను సౌదీ అరేబియాలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న పెద్ద ఇంట్లో బంధించారు. దయచేసి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు చెప్పి, నన్ను రక్షించండి.''
మధ్య ప్రాచ్య దేశాలలో పెద్ద జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తామనే ఉచ్చులో చిక్కుకున్న భారతదేశానికి చెందిన ఓ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఆవేదన ఇది.
ఇరవై నాలుగేళ్ల ప్రియ (ఆమె భద్రత కోసం పేరును మార్చడం జరిగింది) చేత సౌదీ అరేబియాలోని మారుమూల గ్రామం డామమ్‌లో బలవంతంగా ఇంటి పనులు చేయించుకుంటున్నారు.
ప్రియ లాగానే తమిళనాడుకు చెందిన అనేక మంది యువ మహిళా గ్రాడ్యుయేట్లను ఉద్యోగాల పేరు చెప్పి గత ఆరు నెలల కాలంలో సౌదీ అరేబియాకు తీసుకెళ్లారు. వారిలో ఇద్దరు మహిళలు తమ యజమానుల ఇళ్ల నుంచి పారిపోయి, భారత ఎంబసీని ఆశ్రయించారు. వీరిలాగే ఇంకా అనేక మంది పని మనుషులుగా బాధలు అనుభవిస్తూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
‘పాత్రలు తోమి, ఇల్లు ఊడ్చాలన్నారు..’
భారత ఎంబసీలో ఆశ్రయం పొందుతున్న సుందరి, మేఘల (పేర్లను మార్చాం) బీబీసీతో మాట్లాడినపుడు, తమకు బ్యూటీ పార్లర్లలో భారీ జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు ఏజెంట్లు తమను తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
''ఇక్కడికి వచ్చాక మూడు నెలల పాటు అరబిక్ నేర్చుకోవడానికి పని మనుషులుగా పని చేయాలని చెప్పారు. దానికి మేం అంగీకరించకపోతే, మేం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లలేమని చెప్పారు'' అని సుందరి తెలిపారు.
తనకు అప్పగించిన పని గురించి చెబుతూ, ''నేను ఎంబీయే గ్రాడ్యుయేట్‌ని. నాకు బ్యూటీ పార్లర్‌లో అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కానీ రియాద్‌లోని ఓ ఇంట్లో పాత్రలు తోమాలని, ఇల్లు ఊడ్చాలని ఆజ్ఞాపించినపుడు నాకు షాక్ తగిలింది. మొదటి రెండు నెలలు కనీసం నా కుటుంబంతో కూడా మాట్లాడనివ్వలేదు'' అని ఆమె వివరించారు.
ఇతర మహిళలను కూడా సౌదీ అరేబియాకు వచ్చేలా మంచిగా మాట్లాడాలని సుందరిని బలవంతపెట్టారు.
''నేను అబద్ధం చెప్పడానికి ఒప్పుకోకపోవడంతో నన్ను బెదిరించారు. ఇతర మహిళలతో మాట్లాడి వాళ్లు సౌదీ అరేబియా వచ్చేలా చేయకపోతే నన్ను ఎవరూ రక్షించలేరని అన్నారు. కానీ వాళ్లను మోసం చేయడానికి నాకు మనసొప్పలేదు'' అని సుందరి తెలిపారు.
ఇక మేఘల కథ ఇంకా దారుణం.
''నేను బీసీఏ గ్రాడ్యుయేట్‌ని. నేను తమిళనాడులో ఒక టీచరుగా పని చేసేదాన్ని. ఇక్కడ నేను 20 మంది ఉన్న కుటుంబంలో వంట మనిషిగా పని చేసేదాన్ని. గత ఆరు నెలలుగా నాకు ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వలేదు. పని చేసీ చేసీ, నేను నిస్సత్తువగా అయిపోయేదాన్ని. కొన్నిసార్లు రోజుల తరబడి నిద్ర ఉండేది కాదు. నేను రియాద్‌లో ఉండడం వల్ల, ట్యాక్సీ పట్టుకుని భారత ఎంబసీకి వచ్చిపడ్డాను. నా స్నేహితురాలు ప్రియ ఇంకా ప్రమాదంలోనే ఉంది. ఆమెకు ప్రాణాపాయం ఉంది. ఆమెను రక్షించాలి'' అన్నారు మేఘల.
బీబీసీ ఫోన్‌లో ప్రియతో మాట్లాడినపుడు, ఆమె తనను రక్షించాలని పదేపదే వేడుకుంది.
''దయచేసి నన్ను రక్షించండి. నాకు మన దేశానికి వచ్చేయాలని, మా అమ్మానాన్నలతో కలిసి ఉండాలనిపిస్తోంది. సుష్మా స్వరాజ్‌కు చెప్పి, నన్ను రక్షించే ఏర్పాటు చేయండి. నేను చాలా రోజుల నుంచి మంచి తిండి కూడా తినలేదు. ఇక్కడ నాకు ఊపిరాడనట్లు అనిపిస్తోంది. ఇక్కడ నేను చేసిన వంట పనికి కూడా నాకు రెండు నెలలుగా జీతం ఇవ్వలేదు'' అని ప్రియ చెప్పుకొచ్చింది.
సౌదీలోని సామాజిక కార్యకర్త రషీద్ ఖాన్‌కు తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనిమనుషులుగా ఉపయోగించుకుంటున్న విషయం తెలిసినపుడు, ఆయన వారిని కలిసి మాట్లాడారు.
రెండు దశాబ్దాలకు పైగా సౌదీలో ఉంటున్న రషీద్ ఖాన్ ఇప్పటివరకు అనేక మంది రక్షించి, వారిని సురక్షితంగా భారత ఎంబసీకి చేర్చినట్లు వెల్లడించారు.
''ప్రియ ఒక మారుమూల ప్రాంతమైన డామమ్‌లో ఉంటున్నారు. అందువల్ల ఆమె ఎక్కడుందో కనిపెట్టడం, అక్కడికి చేరుకోవడం కష్టం. ఆమెను రక్షించడానికి భారత ప్రభుత్వ సాయం అవసరం. ఇలా చదువుకున్న అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ పని మనుషులుగా మార్చడం చాలా దారుణం. చట్టప్రకారం 30 ఏళ్లు పైబడిన వాళ్లనే పని మనుషులుగా పెట్టుకోవాలి. వీళ్లను ఇలా మోసం చేసి తీసుకొచ్చి ఇక్కడ పని చేయిస్తున్నారు'' అని రషీద్ ఖాన్ తెలిపారు.
యువతులు తమ స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చినపుడు, తప్పించుకుపోకుండా ఉండడానికి వాళ్లను దూరం దూరంగా ఉంచుతారని, ఒకరితో ఒకరిని మాట్లాడుకోనివ్వరని రషీద్ ఖాన్ వెల్లడించారు.
‘గత ఏడాది 400 మందిని రక్షించాం..’’
సుందరి, మేఘల వివరాల కోసం బీబీసీ ప్రతినిధి రియాద్‌లోని భారత ఎంబసీని సంప్రదించినపుడు, దౌత్యపరమైన లాంఛనాలు పూర్తయ్యాక వారిని స్వస్థలాలకు పంపిస్తామని తెలిపారు.
''ప్రతి సంవత్సరం ఇలా మోసపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. పోయిన ఒక్క ఏడాదిలోనే మేం 400 మందికి పైగా రక్షించి భారతదేశానికి పంపాం'' అని భారత ఎంబసీలోని కౌన్సెలర్ అనిల్ నౌతియాల్ తెలిపారు.
అనేక మందిని సౌదీ అరేబియాకు తరలించడంలో కీలకపాత్ర పోషించిన ఏజెంట్ ఆనంద్ కోసం గాలిస్తున్నామని తిరుచ్చి జిల్లా ఎస్పీ జియా ఉల్ హక్ వెల్లడించారు.
''ఇంకా చాలా మంది యువతుల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ మాకు ఫిర్యాదు చేయడం లేదని భావిస్తున్నాం. ఏజెంట్ల గురించి మరింత సమాచారం అందితే, ఈ రాకెట్‌ను ఛేదిస్తాం'' అని ఆయన బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)