You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాయల్ వెడ్డింగ్: వధువు తండ్రి రావట్లేదు, మరి 'కన్యాదానం' చేసేది ఎవరు?
ఈ నెల 19న జరగనున్న బ్రిటన్ యువరాజు హ్యారీ, నటి మేఘన్ మార్కెల్‌ల వివాహానికి సర్వం సిద్ధమైంది. అయితే, తమ వివాహానికి తన తండ్రి థామస్ మార్కెల్ హాజరు కావడంలేదని వధువు మేఘన్ తెలిపారు.
"మా నాన్నను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను. ఆయన ఆరోగ్యం మీద దృష్టిపెట్టాల్సిన అవసరం వచ్చింది" అని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.
థామస్ తన కుమార్తె మేఘన్ వివాహానికి హాజరవుతారా? లేదా? అంటూ ఇటీవల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
బుధవారం ఆయన గుండెకు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉందని తెలిసింది.
ఈ వారంలో యువరాజు హ్యారీతో పాటు, బ్రిటన్ రాణి, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్‌లను కూడా థామస్ కలవాల్సి ఉంది.
మెక్సికోలో ఉంటున్న ఆయన ఇటీవల ఓ సెలబ్రెటీ ఫొటోగ్రాఫర్‌తో కలిసి ఫొటోలో కనిపించడం వివాదాస్పదమైంది.
అయితే థామస్‌కు తెలియకుండా ఎవరో ఆ ఫొటో తీసి ఉంటారని దాన్ని చూస్తే అర్థమవుతోంది.
ఆ వివాదం నేపథ్యంలో తన కుమార్తెను ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనతో తాను ఆమె వివాహానికి వెళ్లడంలేదని ఆయన చెప్పినట్టు అమెరికన్ సెలబ్రెటీ న్యూస్ వెబ్‌సైట్ టీబీజెడ్ సోమవారం ఓ కథనంలో పేర్కొంది.
తర్వాత అదే వెబ్‌సైట్ పెళ్లికి ఆయన హాజరవుతారని రాసింది. తాజాగా గుండెకు ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉన్నందున ఆయన వెళ్లలేకపోతున్నారని పేర్కొంది.
ఇప్పుడు మేఘన్ ప్రకటనతో స్పష్టత వచ్చింది.
థామస్ గౌర్హాజరవుతుండటంతో పెళ్లిలో వధువుని ఎవరు నడిపించుకెళ్తారు? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
మేఘన్ తల్లి డోరియా రగ్లాండ్ బుధవారమే బ్రిటన్ చేరుకున్నారు.
మేఘన్‌కి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లి డోరియా రగ్లాండ్, తండ్రి థామస్ మార్కెల్ విడాకులు తీసుకున్నారు.
యూకేలోని విండ్సర్ క్యాజిల్‌లో యువరాజు హ్యారీ, నటి మేఘన్ మార్కెల్‌ల వివాహం జరుగుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాని థెరిసా మేలతో సహా రాజకీయ నాయకులెవరికీ ఈ పెళ్లి ఆహ్వానం అందలేదు.
రాచకుటుంబీకులు, ఇతర సెలెబ్రిటీలతో పాటు 1200మంది సమాజ సేవకులు మాత్రమే ఈ వివాహానికి హాజరవుతారు.
ఈ వేడుక నేపథ్యంలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)