You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
“పిల్లల్ని కనడం తప్పనిసరి కాదు.. అది నా ఇష్టం”
- రచయిత, ఇమ్రాన్ అబ్బాసి
- హోదా, వాషింగ్టన్ డీసీ బీబీసీ ప్రతినిధి
మహిళకు మాతృత్వం తప్పనిసరా? పిల్లలు కనడంపై వారి ఇష్టానికి విలువలేదా?
పెద్దలు చెప్పినట్లు, ఆడవాళ్లు యంత్రాల్లా పిల్లల్ని కనాల్సిందేనా?
ఇలాంటి విషయాలపై ప్రపంచవ్యాప్తంగా సునిశిత చర్చ జరగాలంటున్నారు.. వాషింగ్టన్ డీసీలో స్థిరపడిన పాకిస్తాన్ యువతి జైనాబ్ అమిన్.
జైనాబ్‌లాగే అమెరికాలోని చాలామంది దక్షిణాసియా యువతులు ఇలాగే అభిప్రాయ పడుతున్నారు.
పిల్లల్ని కనడమే కాదు.. వారి పెంపకం పట్ల కూడా వారు ఆసక్తి చూపించడం లేదు.
ఒక అధ్యయనం ప్రకారం ప్రస్తుతం అక్కడ ప్రతీ ఐదుగురిలో ఒకరు పిల్లల్ని కనేందుకు ఇష్ట పడటం లేదు.
"పిల్లల్ని కనాలా వద్దా అనేది ఆ యువతి ఇష్టం. తప్పనిసరిగా కనాల్సిందే అనే కట్టుబాటు ఉండకూడదు" అని వారు చెబుతున్నారు.
పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నారు?
ఇంతకీ పిల్లలు వద్దని వాళ్లు ఎందుకు అనుకుంటున్నారు? వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వాషింగ్టన్ డీసీలో ఉంటున్న దక్షిణాసియా యువతులతో బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ అబ్బాసి మాట్లాడారు.
అందులో ఒకరు జైనాబ్ అమిన్. ఆమె స్వస్థలం పాకిస్తాన్‌లోని లాహోర్. ఏడేళ్ల క్రితం అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. ఒక అంతర్జాతీయ సంస్థలో ఆమె మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్నారు.
పిల్లల విషయంలో ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో జైనాబ్ మాటల్లోనే చూద్దాం.
గర్భాశయం, అండాశయం ఉందని పిల్లల్ని కనేయాలా? తల్లి కావడం అనేది యువతి ఇష్టం. ఆమెకు ఇష్టం ఉంటే కంటుంది..లేదంటే లేదు. ఆమె పిల్లల్ని కనాల్సిందే అని ఒత్తిడి తెచ్చే అధికారం ఎవ్వరికీ లేదు.
తల్లి కావడమే ఒక మహిళ పనా? ఆ ఒక్క అంశం ఆధారంగానే ఆమెను అంచనా వేయవద్దు. దాన్ని మించిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి.
నేను సంతోషంగా ఉండాలంటే తప్పనిసరిగా భర్త, పిల్లలు ఉండాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నా.
కేవలం భర్త, పిల్లలు ఉంటే ఆ ఇల్లు అందమైన నందనవనం అవుతుందా? ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయా?
లేదంటే నేను ఎక్కడైతే / ఎలాగైతే ఆనందంగా ఉంటానో అదే నా ఇల్లు అనుకోవాలా?
స్వార్థం కోసమే పిల్లల్ని కంటున్నారు!
ప్రజలు తమ స్వార్థం కోసం పిల్లల్ని కంటున్నారు. సొంత ఆనందం కోసం మరో ఆలోచన లేకుండా పిల్లల్ని కని పడేస్తున్నారు.
పిల్లల్ని కనడమే కాదు..వాళ్లను పెంచడం కూడా చాలా పెద్ద బాధ్యత.
పిల్లల్ని కంటే చాలు వాళ్లంత వాళ్లే పెరుగుతారని మా సమాజంలో అనుకుంటారు. పిల్లల మానసిక, శారీరక పరిస్థితి గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఒక బాధ్యత గల పౌరులుగా వారిని తీర్చిదిద్దడంపై ఎవరూ దృష్టి పెట్టారు.
నా వరకైతే పిల్లల్ని కని పెంచడం చాలా పెద్ద బాధ్యత. నేనా బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా లేను.
సంతానం లేకుండా జీవితం ఎలా?
నాకు స్వేచ్ఛ ఉంది. స్వాతంత్ర్యం ఉంది. ఎలాంటి బాధ్యతలు లేవు. నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను. మరెవరికో నచ్చేలా ఉండాల్సిన పనిలేదు. మరొకరి అంచనాలకు తగ్గట్టుగా నా ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం లేదు.
నా తల్లిదండ్రులు కూడా నన్ను అర్థం చేసుకుంటారు. ఒకవేళ వారు మరోలా ఆలోచించినా.. వాళ్ల అభిప్రాయాలు నాపై రుద్దరు. వాళ్లకు నచ్చినట్లు ఉండాలని నాపై ఒత్తిడి తీసుకురారు.
పిల్లలు వద్దనుకుంటే నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరని నా స్నేహితులు నన్ను హెచ్చరిస్తూ ఉంటారు. చివరికి నీకు మగతోడు కూడా దొరకదని చెప్పారు. కానీ వారితో నేను విబేధిస్తాను.
కేవలం సెక్స్, పిల్లల్ని కనడం కోసమే నేను కావాలనుకునే వ్యక్తిని నేను అస్సలు పెళ్లే చేసుకోను. నన్ను నన్నుగా ఇష్టపడాలి అన్నారు.. జైనాబ్ అమిన్.
పిల్లలు వద్దనుకునే మహిళల సంఖ్య రెట్టింపు!
పిల్లలు వద్దనుకునే అమెరికా మహిళల సంఖ్య 1976తో పోలిస్తే రెట్టింపు అయిందని 2010లో పీఈడబ్ల్యూ కేంద్రం చేసిన అధ్యయనంలో తేలింది.
ప్రస్తుతం ప్రతీ ఐదుగురిలో ఒకరు పిల్లల్ని కనాలనుకోవడం లేదు.
దీనికి వారు వివిధ కారణాలు చెబుతున్నారు. వాటిలో ప్రధానమైనవి ఇవి.
- తమ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడం.
- సొంత లక్ష్యాలు, కోరికలు నెరవేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం.
- జీవితంలో ఏదైనా సాధించాలంటే పిల్లలు ఉంటే సాధ్యం కాదనే భావన.
- పిల్లల్ని పెంచడమనే అతిపెద్ద బాధ్యతను మోయడం ఇష్టంలేకపోవడం
- సంతానం ఉంటే భార్యా-భర్తల మధ్య ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోతాయనుకోవడం.
పెళ్లి చేసుకుంటే తప్పనిసరిగా పిల్లల్ని కనాలనే రూలేం లేదు అని జైనాబ్ లాంటి వాళ్లు చెబుతున్నారు. ఈ విషయంలో అమ్మాయిలకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని చెబుతున్నారు. పిల్లల్ని కనాలా వద్దా అనేది వారి వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)