You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కర్ణాటకలో తెలుగువాళ్లు ఏమనుకుంటున్నారు?
- రచయిత, దీప్తి బత్తిని/బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ కింద పెద్ద సంఖ్యలో తెలుగు వారున్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా వివాదం నేపథ్యంలో కర్ణాటకలోని తెలుగు ఓటర్లు ఎటు వైపు ఉన్నారనే ఆసక్తి మొదలైంది. తాతల నాడు అక్కడకు వెళ్లి స్థిరపడ్డ తెలుగు వారు సరే.. మరి అక్కడే పుట్టి పెరిగిన తెలుగు యువత సంగతేంటి? వారికి తెలుగునేలతో ఉన్న అనుబంధం ఏంటి? తెలుగు రాజకీయాల ప్రభావం వారిపై ఉంటుందా?
ఇక్కడి తెలుగు వారు తమ భాష, యాసలను విడువలేదు. వారు తెలుగు రాజకీయాలను నిశితంగా గమనిస్తారు. ఆంధ్ర - తెలంగాణల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు.
ఇప్పుడున్న కొత్త తరానికి ఆంధ్రతో అనుబంధం కాస్త తక్కువ. వీరిలో చాలా మంది ఇప్పుడు ఆంధ్రకు జరిగింది అన్యాయమే అని బలంగా నమ్ముతున్నారు. కానీ ఆ విషయం ఆధారంగా తాము ఓటు వేసే అవకాశం లేదని చెబుతున్నారు.
మొదటితరం కన్నడనాట స్థిరపడ్డ వారు తాము చురుగ్గా ఉన్నంత కాలం ఆంధ్రతో అనుబంధం కొనసాగించారు. ఆంధ్రలో ఉన్న బంధువుల ఇంటికి అప్పుడప్పుడు రాకపోకలు సాగించేవారు. కానీ తరం మారే కొద్దీ ఆ అనుబంధం కాస్త తగ్గింది.
పైగా అక్కడున్న తెలుగు వారి మధ్యే పెళ్ళిళ్లు జరగడంతో బంధువర్గం మొత్తం కర్ణాటకలోనే ఉన్నట్టయింది. దీంతో వారికి మంచి చెడులకు ఆంధ్రకు రావల్సిన అవసరం బాగా తగ్గిపోయింది.
మరో ముఖ్య విషయం, కన్నడ స్కూళ్లల్లో చదవడంతో తెలుగు వారు కూడా అక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటుపడిపోయారు. అక్కడే పుట్టి పెరగడంతో అదే తమ సొంత ఊరు అనే భావనను కూడా బలపరుచుకున్నారు. వారిలో గమనించదగ్గ ఒక్క ప్రత్యేక విషయం ఏమిటంటే, కన్నడ మీడియంలో చదివినా, కర్ణాటకలో పుట్టి పెరిగినా తెలుగును మాత్రం మర్చిపోలేదు.
"నేను కన్నడ మీడియంలో చదివా. ఇక్కడే అలవాటు అయిపోయింది. ఆంధ్రా మన స్టేట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇల్లు, పొలాలు ఇక్కడే ఉన్నాయి. అక్కడి వార్తలు చూస్తాం. కానీ స్టేటస్ ప్రభావం ఇక్కడ ఏమీ ఉండదు. అక్కడదక్కడే.. ఇక్కడదిక్కడే.. నా స్నేహితులంతా కన్నడిగులే. తాత ఆంధ్రాలో పుట్టారు. నేను కర్ణాటకలో పుట్టా." అంటూ అచ్చమైన గోదావరి జిల్లాల యాసలో చెప్పారు గంగావతిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన శ్రీరామ్ అనే యువకుడు.
కర్ణాటక తెలుగు కుటుంబంలో పుట్టి, హైదరాబాద్ లో చదువుకున్న అజయ్ అనే 23 ఏళ్ల యువకుడి అభిప్రాయం కూడా ఇదే. తమకు కర్ణాటకలోనే వ్యాపార, ఉపాధి అవకాశాలున్నాయనీ అదే తమ సొంత ఊరు అనీ అతను చెప్పుకొచ్చాడు. కర్ణాటక సమస్యలపైనే తన దృష్టి ఎక్కువగా ఉందని చెప్పాడు.
కర్ణాటకలోని తెలుగు యువతను ఎవరిని కదిలించినా దాదాపు ఇదే సమాధానం వస్తుంది.
"తెలుగుపై తమ మాతృ భాష అన్న ప్రేమ ఉంటుంది. అందరూ తెలుగు మీడియాను ఫాలో అవుతారు. అక్కడ అన్యాయం జరిగిందనే భావన సహజంగానే ఉంటుంది. కానీ కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలు మాకు చాలా ముఖ్యం" అన్నారు నెక్కంటి సూరిబాబు అనే మధ్య వయస్కుడు. "నేను తెలుగు వాడిని! నాది కర్ణాటక!" అంటారాయన.
కర్ణాటకలో స్థిరపడ్డ మొదటితరం తెలుగు వారికి, మొదట్లో భాష కాస్త సమస్యగా ఉండేది. మిగిలిన కన్నడ సమాజంతో సంబంధాలు కొనసాగించినా, వారితో మమేకమైపోయారని చెప్పలేం. కానీ ఇప్పుడున్న తెలుగు యువతరం అలా కాదు. వారు అక్కడే పుట్టి పెరగడం వల్ల కన్నడ భాష కూడా అత్యంత సహజంగా, స్థానికుల్లాగే మాట్లాడతారు. పైగా అక్కడే పెరగడం, చదువుకోవడం వల్ల మిగిలిన కన్నడ సమాజంలోనూ కలగలసిపోయారు.
తమది ఆంధ్రా అనే భావం వారిలో కనిపించదు. వారు తమ మూలాలు మర్చిపోలేదు. కానీ వర్తమాన వాస్తవాలను విడిచిపెట్టలేదు.
ఇంతకీ తెలుగోళ్ళు అక్కడికి ఎలా వెళ్లారంటే...
1953లో తుంగభద్ర డ్యామ్ పూర్తయింది. ఇది బళ్లారి జిల్లాలోని హోస్పేట దగ్గర ఉంది. డ్యామ్ పూర్తయ్యాక గోదావరి జిల్లాలకు చెందిన రైతు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం వెళ్లి భూములు కొని, వ్యవసాయం చేశాయి.
అప్పట్లో గోదావరి జిల్లాల భూముల ధరల కంటే అక్కడి భూముల ధరలు చాలా తక్కువ. వీరిలో అత్యధికులు కమ్మ వర్గానికి చెందిన వారు. ఇలా తెలుగు వారు స్థిరపడ్డ ప్రాంతాలను క్యాంపులుగా పిలుస్తారు.
కర్ణాటకలోని గంగావతి, కొప్పల్, యాద్గిర్, బళ్లారి, సింధనూర్, కనకగిరి, రాయచూర్ ప్రాంతాల్లో ఈ క్యాంపులు ఎక్కువ.
తుంగభద్ర కేంద్రంగా దాదాపు వెయ్యి వరకూ తెలుగు క్యాంపులు ఉంటాయి. ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి నుంచి 20 వేల వరకూ తెలుగువారి జనాభా ఉంటుంది.
ఇక్కడ స్థానిక జనాభాతో పోలిస్తే తెలుగు వారి సంఖ్య తక్కువే అయినా, వ్యవసాయ - వ్యాపారలలో వారి పాత్ర పెద్దదనే చెప్పాలి. 1950లలో వచ్చిన తెలుగు వారు వ్యవసాయానికే పరిమితం అయ్యారు.
80ల తరువాత రైస్ మిల్లులు ప్రారంభించారు. క్రమంగా ఇతర వ్యాపారాల్లోకి వెళ్లారు. 90ల తరువాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభం అయింది.
ఇక్కడ ప్రతి క్యాంపుకీ ఒక రామాలయం ఉంది. మొన్నటి వరకూ తెలుగు స్కూళ్లు చాలా ఉండేవి. క్రమంగా తెలుగు మీడియం తగ్గి కన్నడకు ప్రాధాన్యం పెరిగింది. పెళ్లిళ్లు ఇక్కడ తెలుగు వాళ్ల మధ్యే చేసుకుంటారు.
పెళ్లిళ్ళ సందర్భంలో తెలుగులో ఫ్లెక్సీలు పెడతారు. హోటెళ్లు, స్వీటు షాపుల పేర్లు, క్యాంపుల బోర్డులు తెలుగు - కన్నడ భాషల్లో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొద్దిగా తెలుగు మాట్లాడతారు.
"తణుకు దగ్గర ఉనికిలి నుంచి 1979లో, నాకు 28 ఏళ్లున్నప్పుడు వచ్చాను. కూలీ పని చేసుకుంటూ ఉన్న పావు ఎకరం భూమితో పిల్లల్ని పెంచలేక వాళ్లను తీసుకుని వచ్చేశా. ఆ పావు ఎకరం అమ్మి పదివేలుతో వచ్చా. ఆ డబ్బుతో ఇక్కడ నాలుగు ఎకరాలు బీడు కొని చెట్లు కొట్టి చదును చేసి, నేను మా ఆవిడ పొలంలో పనిచేసి చాలా కష్టపడి ఇప్పుడు 30 ఎకరాలు చేశాం. మొదటి సంవత్సరం భాష రాక చాలా ఇబ్బంది పడ్డాను. తరువాత ఇబ్బందేం లేదు. కౌలు చేస్తూ వ్యవసాయం పెంచుకున్నాను. ఇప్పుడంతా బాగానే ఉంది. ఇద్దరు అబ్బాయిలు, ఒకమ్మాయి - ముగ్గురికీ పదేసి ఎకరాల చొప్పున ఇచ్చేశా." అన్నారు వెంకట్రావు అనే పెద్దాయన.
"పిల్లల్ని మొదట్లో తెలుగు మీడియం చదివించాం. ఇప్పుడు తెలుగుకు విలువ లేదు. కన్నడ మీడియం చదవాలి. ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో కన్నడ ఒక సబ్జెక్టుగా చదువుతున్నారు" అంటూ భాష ప్రభావం వివరించారు.
"గతంలో ఇక్కడి వారికి మామీద చాలా అభిమానం ఉండేది. కష్టపడతారు అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఈ మధ్య యువతలో కొంత అసూయ పెరిగింది" అన్నారు వెంకట్రావు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనుల కోసం వెళ్లినప్పుడు కన్నడిగుల కంటే తెలుగు వారి దగ్గర ఎక్కువ లంచం తీసుకుంటారని చెప్పారు మరో రైతు.
కర్ణాటకకు వెళ్లిన మొదటితరంలా కాకుండా, ప్రస్తుత యువత స్థానిక సంస్కృతితో చాలా మమేకమైంది. కర్ణాటక అవతరణ ఉత్సవాల్లో పాల్గొనడం, కర్ణాటక సాహిత్య సమ్మేళనాలకు ఆర్థిక సహకారం ఇవ్వడం, మిగిలిన కన్నడిగుల్లానే ఆ రాష్ట్ర జెండా మోయడం వంటివి ఎంతో ఉత్సాహంగా చేస్తారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)