You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కొరియా సదస్సు: అణు నిరాయుధీకరణ ఒప్పందంపై కిమ్ సంతకం
ఉత్తర కొరియా - దక్షిణ కొరియాల మధ్య శుక్రవారంనాడు జరిగిన చరిత్రాత్మక సదస్సు ముగిసింది.
కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్రాలు లేని ప్రాంతంగా మార్చడానికి ఉభయ కొరియా నేతల మధ్య ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించిన పత్రంపై రెండు కొరియా దేశాల నేతలు సంతకం చేశారు.
దక్షిణ కొరియా సరిహద్దులో ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్‌కూ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌కూ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ ప్రకటన చేశారు.
అయితే అణు నిరాయుధీకరణ ఎలా జరుగుతుందనే వివరాలు ఈ ప్రకటనలో లేవు.
గతంలో చోటుచేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా తామిద్దరం పరస్పర సమన్వయంతో పనిచేయడానికి అంగీకరించినట్లు సదస్సు అనంతరం కిమ్ జోంగ్-ఉన్ ప్రకటించారు.
‘ఎదురుదెబ్బలు, కష్టాలు, నిరాశా నిస్పృహలు ఉంటాయి. కానీ నొప్పి లేకుండా విజయం దక్కదు’ అని కిమ్ వ్యాఖ్యానించారు.
ఉత్తర-దక్షిణ కొరియా నేతల మధ్య కుదిరిన ఒప్పందం, ముఖ్యంగా వారు సంతకం చేసిన ఓ పత్రం.. కిమ్-డొనాల్డ్ ట్రంప్‌ల భేటీకి మార్గాన్ని సుగమం చేస్తుందని సోల్‌లోని కొరియన్ పెనిన్సులా ఫ్యూచర్ ఫోరమ్ నిపుణురాలు డుయోన్ కిమ్ బీబీసీతో చెప్పారు.
‘‘ఒప్పందంలో ‘సంపూర్ణ అణు నిరాయుధీకరణ’ అనే వాక్యాన్ని చేర్చడం ద్వారా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ఓ విధంగా పై చేయి సాధించారు. ఈ విషయాన్ని ఆయన నేరుగా అమెరికా దృష్టికి తీసుకెళ్లడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌ల భేటీకి వీలు కల్పించొచ్చు’’ అని డుయోన్ కిమ్ పేర్కొన్నారు.
‘కానీ ఉత్తర కొరియా కదలికల్ని చాలా నిశితంగా గమనించాలి. వాళ్లు తమ వాగ్దానాలను చాలాసార్లు నిలబెట్టుకోలేదు. ఒప్పందాలపై వాళ్లు వెనక్కు తగ్గొచ్చు. రకరకాల కుయుక్తుల ద్వారా వాళ్లు ఒప్పందం నుంచి బయటకు వచ్చి మళ్లీ అణు పరీక్షలను ముందుకు తీసుకెళ్లొచ్చు. గతాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఈ విషయంలో నేను వాళ్ల నుంచి ఎక్కువ ఆశించట్లేదు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇద్దరు కొరియ నేతలు సంయుక్త ప్రకటనలో అంగీకరించిన ముఖ్యమైన అంశాలు:
- రెండు దేశాల మధ్య ‘కవ్వింపు చర్యల’కు ముగింపు పలకడం.
- రెండు దేశాలనూ విభజించే డిమిలిటరైజ్డ్ జోన్‌ను ‘పీస్ జోన్’గా మార్చడం.
- ఉద్రిక్త పరిస్థితులను తొలగించేందుకు ఆయుధాలను తగ్గించడం.
- అమెరికా, చైనా దేశాలను కూడా చర్చల్లో భాగం చేసే దిశగా అడుగేయడం.
- యుద్ధం కారణంగా విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకునేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం.
- సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైల్వే వ్యవస్థను అనుసంధానించడంతో పాటు ఆధునికీకరించడం.
- ఈ ఏడాది జరగబోయే ఆసియన్ గేమ్స్‌తో సహా రానున్న రోజుల్లో జరిగే క్రీడా పోటీల్లో సంయుక్తంగా పాల్గొనడం.
ఇవి కూడా చదవండి:
- BBC EXCLUSIVE: సివిల్స్ టాపర్.. తెలుగబ్బాయి అనుదీప్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
- ఉత్తర కొరియా: రైలులో కిమ్ చైనా యాత్ర... జిన్‌పింగ్‌తో భేటీ
- చైనా ఎందుకు ఏటా 600 కోట్ల బొద్దింకలను ఉత్పత్తి చేస్తోంది?
- ఉత్తర కొరియా ఇకపై అణు, క్షిపణి పరీక్షలు నిర్వహించదు: కిమ్ జోంగ్- ఉన్
- దక్షిణకొరియా సరిహద్దుల్లో మూగబోయిన లౌడ్ స్పీకర్లు!
- ఉత్తర - దక్షిణ కొరియాలు ఎలా మాట్లాడుకుంటాయో ఊహించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)