You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనా ఎందుకు ఏటా 600 కోట్ల బొద్దింకలను ఉత్పత్తి చేస్తోంది?
చాలా మందికి బొద్దింకల పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. కానీ చైనాకు మాత్రం అవి ఒక పెద్ద మార్కెట్.
బొద్దింకలను ఆహారంగా తీసుకోవడమనేది చైనా, తదితర ఆసియా దేశాలలో చాలా ఏళ్లుగా ఉన్నదే. కానీ చైనాలో ఇప్పుడు ఔషధ అవసరాల నిమిత్తం వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు.
చైనాలో ఓ ఫార్మాష్యూటికల్ కంపెనీ ఏటా సుమారు 600 కోట్ల బొద్దింకలను ఉత్పత్తి చేస్తోంది.
ఈ కంపెనీ దేశంలోని నైరుతి ప్రాంతంలోని షీజాంగ్ నగరంలో ఉంది.
కృత్రిమ మేధ
'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' కథనం ప్రకారం.. దాదాపు రెండు క్రీడా ప్రాంగణాలంత విశాలమైన హేచరీలలో వీటిని పెంచుతున్నారు.
ఈ హేచరీలలో వరుసగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలో ఆహారాన్ని, నీళ్లను ఏర్పాటు చేసి బొద్దింకలను పెంచుతున్నారు.
ఇక్కడ బొద్దింకలు బాగా పెరిగేందుకు అవసరమైన వెచ్చని, తేమతో కూడిన, చీకటిగా ఉండే వాతావరణం ఉంటుంది.
ఈ కంటెయినర్లలో బొద్దింకలు స్వేచ్ఛగా సంచరించే వీలుంది.
ఒక కృత్రిమ మేధో వ్యవస్థ ఈ మొత్తం బొద్దింకల ఉత్పత్తి కేంద్రంలోని ఉష్ణోగ్రతలను, వెలుతురును, వాటికి అవసరమైన ఆహారాన్ని నియంత్రిస్తుంటుంది.
బొద్దింకలు వీలైనంత వేగంగా పెరిగేలా చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యం.
వైద్యపరమైన ప్రయోజనాలు
బొద్దింకలు పెరిగి పెద్దవయ్యాక, వాటిని చూర్ణంగా చేసి, చైనా సంప్రదాయ ఔషధాలలో ఉపయోగించే కషాయాన్ని తయారు చేస్తారు.
ఈ కషాయాన్ని జీర్ణాశయ వ్యాధులు, ఆంత్రమూల సంబంధిత అల్సర్లు, శ్వాసకోశ సమస్యలు తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
''ఇవి చాలా వ్యాధుల చికిత్సలో పని చేస్తాయి. అంతే కాకుండా, ఇతర ఔషధాలకన్నా వేగంగా కూడా పని చేస్తాయి'' అని షాన్ డాంగ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లియు యుషెంగ్ తెలిపారు.
'చవకైన' ప్రత్యామ్నాయం
''చైనాలో వయసు పైబడిన వారి సంఖ్య పెరుగుతోంది. వీళ్ల కోసం మేం కొత్త ఔషధాలను తయారు చేస్తున్నాం. పాశ్చాత్య ఔషధాలతో పోలిస్తే సంప్రదాయ ఔషధాల ధర చాలా తక్కువ'' అని లీ వెల్లడించారు.
అయితే ఇలాంటి ఔషధాలపై సందేహాలు వ్యక్తం చేసేవారూ ఉన్నారు.
''ఈ ఔషధాలు సర్వరోగ నివారిణి కాదు. అవి అన్ని రోగాలను నయం చేయలేవు'' అని బీజింగ్‌లోని చైనీస్ అకాడెమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పేరు వెల్లడించడానికి ఇష్టపడని పరిశోధకుడు ఒక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌కు తెలిపారు.
ఒక నిర్బంధ వాతావరణంలో ఇలా బొద్దింకలను పెంచడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల అవన్నీ బైటికి వస్తే వాటి వల్ల పెను ఉపద్రవం కలిగే అవకాశం ఉందని ఇదే సంస్థకు చెందిన ప్రొఫెసర్ జు చావోడాంగ్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)