You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సిరియా: కుర్దు మిలిటెంట్ల ఆకస్మిక దాడులు.. 8 మంది టర్కీ సైనికుల మృతి
సిరియా పోరాటంలో గురువారం ఎనిమిది మంది టర్కీ సైనికులు చనిపోయారు. మరో 13 మంది గాయపడ్డారు. ఉత్తర సిరియాలోని అఫ్రిన్‌లో ఈ ఘటన జరిగింది.
అఫ్రిన్‌లో కుర్దు ఫైటర్లు లక్ష్యంగా జనవరిలో టర్కీ బలగాలు భారీ స్థాయిలో దాడులు మొదలుపెట్టిన తర్వాత ఇంత మంది సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి.
అఫ్రిన్ ప్రాంతంలోని కెల్‌టెపే జిల్లాలో సొరంగాలను ఉపయోగించుకొని టర్కీ ప్రత్యేక బలగాలపై కుర్దు ఫైటర్లు ఆకస్మిక దాడులు జరిపినట్లు డోగన్ వార్తాసంస్థ తెలిపింది. క్షతగాత్రులను కాపాడేందుకు వెళ్లిన టర్కీ హెలికాప్టర్‌నూ కుర్దు ఫైటర్లు లక్ష్యంగా చేసుకోవడంతో హెలికాప్టర్ వెనుదిరగాల్సి వచ్చింది.
అఫ్రిన్‌లో టర్కీ దాడులు ముమ్మరమైనప్పటి నుంచి వేల మంది ప్రజలు ప్రాణభయంతో ఇళ్లు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
అప్పటి నుంచి అఫ్రిన్‌లో దాడులు, ప్రతిదాడుల్లో 141 మందికి పైగా పౌరులు చనిపోయారని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే 'సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్' చెబుతోంది. దీనిని టర్కీ తోసిపుచ్చుతోంది. తాము కుర్దు ఫైటర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకొన్నామని పేర్కొంటోంది.
సిరియాలోని వైపీజీ మిలీషియాను అంతమొందించేందుకు టర్కీ ప్రయత్నిస్తోంది. వైపీజీ మూలాలు.. టర్కీలో కుర్దుల ప్రాబల్య ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కోసం పోరాడిన 'కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే)'లో ఉన్నాయని ఆరోపిస్తోంది. ఈ ఆరోపణను వైపీజీ తోసిపుచ్చుతోంది. పీకేకేతో తమకు సంస్థాగత సంబంధాలేవీ లేవని చెబుతోంది.
ఐరాస మానవ హక్కుల మండలిలో చర్చ
సిరియా రాజధాని డమాస్కస్‌కు సమీపంలోని తూర్పు ఘూటాలో దాడులు, ప్రస్థుత పరిస్థితిపై జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి శుక్రవారం(మార్చి 2) సమావేశమై, చర్చించనుంది. బ్రిటన్ పిలుపు మేరకు ఈ సమావేశం ఏర్పాటైంది.
తూర్పు ఘూటా తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. దీనిని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకొనేందుకు బషర్ అల్-అసద్ ప్రభుత్వం ఫిబ్రవరి 18న దాడులను తీవ్రతరం చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తూర్పూ ఘూటాలో 580 మందికి పైగా చనిపోయారు.
తూర్పూ ఘూటాలో దాదాపు 3.93 లక్షల మంది ప్రజలు చిక్కుకుపోయారు. అక్కడ ఆహార కొరత తీవ్రంగా ఉంది. ఔషధాలు, వైద్యసేవలు కూడా సరిగా అందడం లేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)