You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫ్లోరిడా హైస్కూల్‌లో కాల్పులు: ఎవరీ నికొలస్ క్రూజ్?
పేరు : నికొలస్ క్రూజ్
వయసు : 19 ఏళ్లు
ప్రాంతం : అమెరికాలోని ఫ్లోరిడా
ఫ్లోరిడాలోని స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్‌లో కాల్పులు జరిపింది నికొలస్ క్రూజేనని పోలీసులు చెబుతున్నారు.
ఏఆర్-15 రైఫిల్‌తో అతను కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు.
నికొలస్ ముందుగా స్కూల్ ఫైర్ అలారం మోగించారు. దాంతో విద్యార్థులు అందరూ తరగతి గదుల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇదే సమయంలో ఏఆర్-15 రైఫిల్‌తో నికొలస్ కాల్పులు జరిపారని స్థానిక పోలీసులు చెప్పారు.
ఈ కాల్పుల్లో 17 మంది చనిపోయారు. క్రూజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నికొలస్ క్రూజ్ ప్రవర్తన సరిగా ఉండేది కాదు!
క్రూజ్ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్ పూర్వ విద్యార్థి. ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇటీవలే అతన్ని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు.
నికొలస్ క్రూజ్ ప్రవర్తన కాస్త తేడాగా ఉండేదని అతని గురించి తెలిసిన స్కూల్ విద్యార్థులు చెబుతున్నారు.
తరచూ ఇతరులను బెదిరించే వాడని వివరించారు.
'ఈ కాల్పుల ఘటన అందరూ ఊహించిందే' అని ఒక విద్యార్థి స్థానిక మీడియాకు వివరించారు.
నికొలస్‌కు ఆయుధాలు అంటే విపరీతమైన ఇష్టమని చాద్ విలియమ్స్ అనే 18ఏళ్ల విద్యార్థి రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.
తరచూ స్కూల్ ఫైర్ అలారం మోగించే వాడని తెలిపారు.
నికొలస్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదని, అతనికి స్నేహితులు కూడా ఎక్కువ మంది లేరని విలియమ్స్ వివరించారు.
గతేడాది విద్యార్థులను బెదిరించడంతో అతన్ని క్యాంపస్ ఖాళీ చేయాలని స్కూల్ యాజమాన్యం ఆదేశించిందని గణితం ఉపాధ్యాయుడు జిమ్ గార్డ్ మియామీ హెరాల్డ్‌కు తెలిపారు.
'సోషల్ మీడియాలో ఆయుధాల ఫొటోలు పెట్టేవాడు'
సోషల్ మీడియాలో క్రూజ్ ఆయుధాల ఫొటోలు పెట్టేవాడని మాథ్యూ వాకర్ అనే విద్యార్థి ఏబీసీ న్యూస్‌కి చెప్పారు.
క్రూజ్ ఏ పోస్టు పెట్టినా.. అందులో ఆయుధాలకు సంబంధించిన విషయమే ఉంటుందని వాకర్ వివరించారు.
అతనికి సంబంధించిన రెండు అకౌంట్లలో తుపాకులు, కత్తులకు సంబంధించిన ఫొటోలు ఎక్కువగా ఉండేవని గుర్తుచేసుకున్నారు.
ముసుగు ధరించిన ఒక వ్యక్తి పొడవాటి కత్తులు పట్టుకుని ఫోజులు ఇచ్చిన ఫొటోలు కూడా వాటిలో ఉన్నాయి.
నికొలస్ సోషల్ మీడియా ఖాతాలు చాలా అభ్యంతరకరంగా, కలతపెట్టేలా ఉన్నాయని రొవార్డ్ కంట్రీ షరీఫ్ స్కాట్ ఇజ్రాయెల్ అభిప్రాయపడ్డారు.
నికొలస్ చదువుతున్న స్కూల్‌లో విద్యార్థులు 3వేల మంది కంటే ఎక్కువే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.