చైనాలో హిమలోకపు అందాలు చూసొద్దాం రండి!

బ్యాంకాక్‌లో ఉండాల్సిన బుద్ధుడు, రష్యాలోని మాస్కో రెడ్ స్క్వేర్, బీజింగ్‌లోని సుప్రసిద్ధ దేవాలయం... ఇలా అన్నీ ఒకేచోట ఉన్నాయి. అదెలా సాధ్యం అనకండి.. ఉన్నాయంతే! చల్లగా ఉన్నాయంతే..

చైనాలో ప్రతి ఏటా జరిగే ‘ఐస్ ఫెస్టివల్’లో ఈ నిర్మాణాలన్నీ కొలువుదీరాయి.

ఈశాన్య చైనాలోని హార్బిన్ నగరంలో ఈ ఐస్ ఫెస్టివల్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తారు. మంచుతో అందమైన కళాకృతులను తయారు చేసి అక్కడ ప్రదర్శిస్తారు.

ప్రపంచంలో జరిగే ఇలాంటి ఉత్సవాల్లో ఇదే పెద్దది. హార్బిన్ నగరం.. చైనాలోనే ఎక్కువ చల్లగా ఉండే ప్రాంతం. ఇక చలికాలంలో చెప్పనక్కర్లేదు.. అందుకే ఈ నగరాన్ని 'ఐస్ సిటీ' అని కూడా పిలుస్తారు.

1983లో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సంవత్సరం జనవరి 5న ప్రారంభమైన ఈ ఉత్సవాలు నెల రోజులపాటు జరుగుతాయి.

వాతావరణం అనుకూలించేవరకూ మంచు బొమ్మలను ప్రదర్శిస్తారు.

హార్బిన్‌లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. జనవరి నెలలో మైనస్ 18, ఫిబ్రవరి నెలలో మైనస్ 14డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి.

కాబట్టి మంచు శిల్పాలు కరగడానికి ఆస్కారం ఉండదు.

ఈ ఉత్సవాలకోసం సమీపంలో ఉన్న నది నుంచి పెద్ద పెద్ద మంచు ముద్దలను సేకరిస్తారు.

ఈ హిమలోకాన్ని సృష్టించడానికి 10వేల మంది కష్టపడ్డారు. 6లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇది డిస్నీల్యాండ్ కంటే చాలా పెద్దది.

ఈ ఉత్సవాల్లో.. మాస్కో రెడ్ స్క్వేర్, బీజింగ్‌లోని సుప్రసిద్ధ దేవాలయం, బ్యాంకాక్‌లోని ఎమరాల్డ్ బుద్ధుడి' నమూనాలను మంచుతో మలిచారు.

2017 జనవరిలో జరిగిన ఉత్సవాల్లో పది లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సారి అంతకుమించి.. రోజుకు దాదాపు లక్ష మందికి పైగా వస్తారని కొందరు అంచనా వేస్తున్నారు.

రాత్రిపూట.. రంగు రంగుల ఎల్ఈడీ వెలుగుల్లో ఈ మంచు శిల్పాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి.

ఆ ప్రాతంలోని చల్లదనమే.. ఈ శిల్పాలకు ఆయుష్షు. వాతావరణం కాస్త వేడెక్కితే ఈ శిల్పాలు కరిగిపోతాయి.. నెమ్మది నెమ్మదిగా ఈ హిమలోకమూ.. మాయమవుతుంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)