You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తోలుబొమ్మలాట: ‘‘నాటకాలు, నాటికలు ఇక్కడి నుంచే పుట్టాయి’’
- రచయిత, పద్మ మీనాక్షి, పీఎన్ అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
తోలుబొమ్మలాట.. భారతదేశంలోని ఒక ప్రాచీన జానపద కళారూపం.
తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు బాగా ప్రసిద్ధి చెందింది.
మానవుడు నాటక దశలోకి ప్రవేశించే పరిణామక్రమంలో తోలుబొమ్మలాట ఎంతో క్రియాశీల పాత్ర పోషించింది. పురాణాలు, కావ్యాల్లోని ఘట్టాలు, సాంఘిక కథలు ఈ కళారూపానికి ప్రధాన ఇతివృత్తాలు.
ప్రాణంలేని బొమ్మలకు జీవం పోసే అద్భుతమైన కళ ఇది.
కాలం గడచిన కొద్దీ ఈ కళకు ఆదరణ తగ్గిపోతోంది. ఇప్పుడు దాదాపు అంతరించే దశకు చేరుకుంది.
ఇలాంటి జానపద కళారూపాలను కాపాడుకోవడంలో భాగంగా ఇటీవల దిల్లీలో 'స్టోరీ టెల్లింగ్' ఫెస్టివల్ జరిగింది.
అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన 'ఛాయా నాటక బృందం' ఇందులో పాల్గొంది. ఈ నాటక బృందానికి చెందిన చిందబర రావు తోలుబొమ్మలాట గురించి బీబీసీకి చెప్పారు. ఆయన మాటల్లోనే...
సినిమా పుట్టింది ఇక్కడి నుంచే
తోలుబొమ్మలాట ఎంతో ప్రాచీనమైంది. హరికథలు, నాటకాలు, నాటికలు, సినిమాలు అన్నీ ఇక్కడి నుంచే వచ్చాయి.
ఒకప్పుడు తోలుబొమ్మలాటకు ఎంతో ఆదరణ ఉండేది. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాలు, పురాణాలు ఈ కళ ద్వారా ప్రదర్శిస్తారు.
కథ.. కదలిక..
తోలుబొమ్మలాటలో కథ, బొమ్మలు, తెర, నీడ ప్రధాన పాత్ర పోషిస్తాయి.
పొడవాటి గుంజలపై తెల్లటి వస్త్రాన్ని కడతారు. తెర కొంచెం ఏటవాలుగా ఉండేలా చూస్తారు. తోలుబొమ్మల నీడలు తెరపై పడేలా ఏర్పాట్లు ఉంటాయి.
పూర్వం ఇందుకు కాగడాలు ఉపయోగించేవారు. ప్రస్తుతం విద్యుత్ దీపాలు వాడుతున్నారు.
మేక తోలుతో
తోలుబొమ్మలాటలో ఉపయోగించే బొమ్మలను కళాకారులే తయారు చేసుకుంటారు.
మేక తోలును వేడి నీళ్లలో ఉంచుతారు. ఆ తర్వాత దానిని శుభ్రం చేస్తారు. రెండు రోజులపాటు ఎండలో ఆరబెడతారు.
బాగా ఎండిన తర్వాత సూదితో బొమ్మ డిజైన్ వేస్తారు. ఆ డిజైన్ ప్రకారం దానిని కత్తిరిస్తారు. ఆ తర్వాత వాటికి రంగులు అద్దుతారు.
ఇందుకు అవసరమయ్యే రంగులు ఎవరికివారే తయారు చేసుకుంటారు.
కనీసం రెండేళ్లు
తోలుబొమ్మలాట బయటకు కనిపించినంత సులభంగా ఉండదు.
ఒక బృందాన్ని తయారు చేయాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. కనీసం ఏడుగురు ఉంటేకానీ ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇందులో అనేక భాగాలు ఉంటాయి.
బొమ్మ తయారీ, చర్మం శుద్ధి, రంగుల తయారీ, హార్మోనియం నేర్పడం, తాళం వేయడం, మృదంగం వాయించడం, ఇతిహాసాలు చెప్పడం, రాగం తీయడం వంటివి అనేకం.
పిల్లలకు ఇవన్నీ నేర్పాలంటే చాలా సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అందువల్ల జీవనోపాధి కూడా ఇబ్బంది అవుతోంది.
ఇద్దరు.. ముగ్గురు.. భార్యలు
తోలుబొమ్మలాటను ప్రదర్శించడానికి ఎక్కువ మంది అవసరమవుతారు. అందువల్లే మా తాతలు ఇద్దరు, ముగ్గురిని పెళ్లి చేసుకునేవారు.
ఎందుకంటే మొత్తం కుటుంబం అంతా ఈ కళా ప్రదర్శనలో భాగంగా ఉంటారు.
వేరే కుటుంబం వారిని భాగస్వాములుగా చేసుకుంటే పంపకాల వద్ద గొడవలు వస్తాయి. అందువల్ల వాళ్లే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొని ఎక్కువ మంది పిల్లలను కనేవారు.
అయినా ఆ రోజుల్లో పోషణ కష్టమయ్యేది కాదు.
నేను దాదాపు 50 ఏళ్ల నుంచి తోలుబొమ్మలాటలో ఉన్నాను.
ఏడేళ్ల వయసు నుంచి నేను మా అమ్మనాన్నల వద్ద ఈ కళను నేర్చుకోవడం ప్రారంభించాను. కానీ ఇప్పుడు ఒకరు ఇద్దరు పిల్లల్ని సాకడమే కష్టమవుతోంది.
ప్రోత్సాహం కావాలి
మా తరవాత తరం వారికి తోలుబొమ్మలాటపై ఆసక్తి తగ్గుతోంది.
ఈ కళ అంతరించి పోకూడదనే ఉద్దేశంతో ఎంత ప్రోత్సహించినా వారు అంతగా ముందుకు రావడం లేదు.
జీవితానికి భరోసా ఇవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే నగరాల్లో ఎక్కువ ప్రదర్శనలు ఇస్తుంటే వారికి ఈ కళపై కొంచెం నమ్మకం ఏర్పడుతోంది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)