You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వెనెజులా: అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రతిపక్షాలపై మదురో నిషేధం
వెనెజులా.. ఈ పేరు వినగానే దివి నుంచి భువికి దూకే ఏంజెల్ జలపాతం గుర్తుకొస్తుంది.
కురులు జార విడిచినట్లుగా అంత ఎత్తు నుంచి దుముకుతున్న జలధారలు కనుల ముందు కదులుతాయి.
ప్రపంచంలో ఎత్తైన జలపాతమే కాదు ఎందరో మిస్ వరల్డ్‌లకు నిలయమైన వెనెజులా నేడు ఉడికి పోతోంది.
పాలక, ప్రతిపక్షాల మధ్య గడ్డి వేస్తే భగ్గుమంటోంది.
ప్రతిపక్షాలపై నిషేధం
వచ్చే ఏడాది వెనెజులా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రతిపక్షాలను నిషేధించినట్లు వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించారు.
ఆదివారం (10 డిసెంబరు 2017) జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్న పార్టీలు మాత్రమే వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేయొచ్చని మదురో వెల్లడించారు.
రాజ్యాంగాన్ని సవరించేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ (నేషనల్ కాన్‌స్టిట్యూయెంట్ అసెంబ్లీ) నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పారదర్శకత లేనందునే
ఎన్నికలు జరిపే తీరులో పారదర్శకత లేనందున వాటిని బహిష్కరించినట్లు జస్టిస్ ఫస్ట్, పాపుల్ విల్, డెమోక్రటిక్ యాక్షన్ వంటి ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి.
నేషనల్ కాన్‌స్టిట్యూయెంట్ అసెంబ్లీని ప్రతిపక్షాలు గుర్తించడం లేదు.
వెనెజులాలో దాదాపు 300 నగరాలు, పట్టణాలలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.
ఇంతకూ ఈ నేషనల్ కాన్‌స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏమిటి? ఎందుకు రాజ్యంగాన్ని సవరించాలనుకుంటున్నారు? ప్రతిపక్షాలు ఎందుకు దీన్ని గుర్తించడం లేదు? ఈ కథా కమామీషు తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్లాలి.
- దాదాపు 18 సంవత్సరాల నుంచి వెనెజులాలోయునైటెడ్ సోషలిస్ట్ పార్టీ అధికారంలో ఉంది.
- సోషలిస్ట్ పార్టీకి చెందిన తిరుగులేని నేత, వెనెజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ 2013లో మరణించారు.
- ఆ తరువాత నికోలస్ మదురో అధ్యక్షుడు అయ్యారు.
- వెనెజులా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
- చమురు నిక్షేపాలకు ఈ దేశం పెట్టింది పేరు.
- ఈ దేశం ఎగుమతుల్లో 95 శాతం వాటా చమురుదే.
- ఈ ఆదాయం ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలను వెనెజులా అమలు చేస్తోంది.
- గత కొద్ది సంవత్సరాలుగా ముడి చమురు ధరలు క్షీణించాయి. దీంతో ఆదాయం తగ్గిపోయింది.
- తగిన నిధులు లేక ప్రభుత్వం క్రమంగా సంక్షేమ పథకాలను తగ్గిస్తూ వస్తోంది.
- ఈ చర్యల ఫలితం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.
- ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించాయి.
ఈ నేపథ్యంలో తిరిగి శాంతిని నెలకొల్పేందుకు అంటూ మదురో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
నిరసనలు అణచివేసేందుకు ప్రతిపక్షాలకు చెందిన ప్రధాన నాయకులను నిర్భందించడం ప్రారంభించింది.
ప్రతిపక్ష నేత లియోపోల్డో లోపేజ్‌కు 14 ఏళ్లు జైలు శిక్ష విధించారు.
ప్రతిపక్షాలు కోరుతున్నట్లుగా ముందస్తు ఎన్నికలు జరపడానికి బదులు నేషనల్ కాన్‌స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది.
దేశంలో శాంతిని తిరిగి నెలకొల్పేందుకు రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేసినట్లు మదురో చెబుతున్నారు.
తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్షాలు కుట్రపన్నుతున్నట్లు ఆయన ఆరోపిస్తున్నారు.
నియంతగా మారుతున్నారు
అయితే ప్రతిపక్షాల మాట వేరేలా ఉంది.
తన అధికారాన్ని శాశ్వతం చేసుకునేలా రాజ్యాంగాన్ని సవరించేందుకు మదురో సిద్ధమవుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
నేషనల్ అసెంబ్లీ అధికారాలను రాజ్యాంగ అసెంబ్లీ మరింత బలహీన పరిచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
"వెనెజులా ప్రజలను మభ్యపెట్టి తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు మదురో ప్రయత్నిస్తున్నారు" అని ప్రతిపక్షానికి చెందిన జూలియో బార్జెస్ ఆరోపించారు.
ప్రతిపక్షాల డిమాండ్లు
- వెనెజులా నేషనల్ అసెంబ్లీని గతంలో రద్దు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించాలి.
- ఈ ఏడాదే సాధారణ ఎన్నికలు జరపాలి.
- వైద్య పరికరాలు, మందులకు తీవ్ర కొరత ఉన్నందున వాటిని దిగుమతి చేసుకోవాలి.
- రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి.
మా ఇతర కథనాలు
- ట్రంప్-పుతిన్ సమర్పించు రాజకీయ డ్రామా!
- సమంత నన్ను బాగా ఏడిపించింది: రోజా
- ఎడిటర్స్ కామెంట్ : కెసిఆర్‌కు రేవంత్ రెడ్డి చెక్ పెట్టగలరా!
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు నేలపై అక్టోబర్ విప్లవం
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు
- అనుపమా పరమేశ్వరన్ : కాలేజీ రోజుల్లో నన్నూ వేధించారు
- ‘టాలీవుడ్లో హీరోయిన్లకు వేధింపులు ఇలా ఉంటాయ్!‘
- భారత్ గురించి చేగువేరా ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)