You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్ తమ దేశంలో పడిన భారత మిసైల్‌ను రివర్స్ ఇంజనీరింగ్‌తో కాపీ కొడుతుందా?
- రచయిత, సారా అతీక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''అఫ్గానిస్తాన్ మీద అమెరికా వేసిన టోమహాక్ క్షిపణులలో కొన్ని మా బలూచిస్తాన్ భూభాగంలో పడ్డాయి. మా దగ్గరున్న రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా మేం బాబర్ మిసైల్‌ను తయారు చేసుకున్నాం'' అని 2020 అక్టోబర్ 20న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ లండన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు.
1998లో అల్‌ఖైదా కెన్యా, టాంజానియాలలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు చేసింది. ఆగ్రహించిన అమెరికా అఫ్గానిస్తాన్‌లోని అల్‌ఖైదా స్థావరాలపై టోమహాక్ క్షిపణులతో విరుచుకు పడింది. ఈ సందర్భంగా కొన్ని క్షిపణులు పాకిస్తాన్ భూభాగంలో పడ్డాయి. దీనిపై ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి తన నిరసన తెలియజేశారు.
ఈ సంఘటన తర్వాత, పాకిస్తాన్ టోమహాక్ క్షిపణులను అధ్యయనం చేస్తోందని, రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా సొంతంగా అలాంటి క్రూయిజ్ క్షిపణులను తయారు చేయగలదని అప్పట్లో అమెరికన్ పత్రికలు రాశాయి.
రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి?
రివర్స్ ఇంజనీరింగ్ అనేది యంత్రంలోని అన్ని భాగాలను వేరు చేసి, దాని నిర్మాణాన్ని అర్థం చేసుకుని, ఆపై దానిని కాపీ చేసే పద్ధతి.
తన క్షిపణి శిథిలాలను తిరిగి ఇవ్వాలని పాకిస్తాన్‌పై అమెరికా అప్పట్లో చాలా ఒత్తిడి తెచ్చిందని భారత్‌లో పాక్ రాయబారిగా పని చేసిన అబ్దుల్ వాసిత్ ఒక సందర్భంలో రాశారు.
ఆ సమయంలో పాకిస్తాన్ ఈ క్షిపణిని రివర్స్ ఇంజినీరింగ్ చేయలేదని నమ్మేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ, ఆగస్టు11, 2005న పాకిస్తాన్ తన క్రూయిజ్ క్షిపణి బాబర్ ను విజయవంతంగా పరీక్షించింది.
ఆ సమయంలో, క్రూయిజ్ క్షిపణి సాంకేతికత పాకిస్తాన్‌తో సహా ప్రపంచంలో చాలా కొద్ది దేశాల వద్ద మాత్రమే ఉంది.
ఇటీవల భారతదేశపు సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి పాకిస్తాన్ లోని చన్నూ ప్రాంతంలో పడి పోయింది. అది బ్రహ్మోస్ క్షిపణి అని వార్తలు వస్తున్నాయి. ఈ క్షిపణి ధ్వని కంటే మూడురెట్లు ఎక్కువ వేగంతో దూసుకుపోతుంది.
పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పినదాని ప్రకారం, మార్చి 9న పాకిస్తాన్‌లో పడిపోయిన ఈ క్షిపణి భారతదేశం నుండి వచ్చింది. ఈ ఘటన పై భారత్‌లో ఉన్నత స్థాయి విచారణ జరుగుతోంది.
మరోవైపు, ఈ ఘటనపై సంయుక్త దర్యాప్తు జరపాలని పాక్ డిమాండ్ చేసింది. ఏకపక్ష దర్యాప్తు సరిపోదని పేర్కొంది. అయితే, భారతదేశం దీనిని ఇంకా అంగీకరించలేదు.
ఈ క్షిపణిని వార్‌హెడ్‌లో లోడ్ చేయలేదు. సరిహద్దుకు ఇరువైపులా ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. కాగా, రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా పాకిస్తాన్ ఈ క్షిపణి సాంకేతికతను అందిపుచ్చుకోగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది.
పాకిస్తాన్ పరిధిలో 3నిమిషాల 44 సెకన్లు
పాక్ ఆర్మీకి చెందిన పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ ఇఫ్తికార్ బాబర్ మీడియాకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. ఇది ఉపరితలం నుండి ఉపరితలంపైకి ప్రయోగించే సూపర్‌సోనిక్ క్షిపణి అని తెలిపారు. అదే సమయంలో, ఈ క్షిపణి శిథిలాలను స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్తాన్ వైమానిక దళం ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే, పాకిస్తాన్‌లో పొరపాటున పడిపోయిన క్షిపణి పేరు ఏంటో భారత్ ఇంకా వెల్లడించ లేదు. మరోవైపు ఈ క్షిపణి పాకిస్తాన్ సరిహద్దులో 3 నిమిషాల 44 సెకన్ల పాటు ఉందని, ఇది సరిహద్దు నుంచి 124 కి.మీ. దూరం ప్రయాణించిందని పాకిస్తాన్ ప్రకటనలో తెలిపింది.
ఈ క్షిపణి పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ వైమానిక దళం పర్యవేక్షణలో ఉందని ఆ దేశపు సైనిక వర్గాలు పేర్కొన్నాయి.
సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను రాడార్ ద్వారా ట్రాకింగ్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే అవి ఉపరితలానికి చాలా దగ్గరగా, చాలా తక్కువ ఎత్తులో ఎగురుతాయి.
భారత్, పాక్‌ల దగ్గర ఏయే క్షిపణులు ఉన్నాయి
క్రూయిజ్ క్షిపణులు మూడు రకాలు. మొదటిది సబ్‌సోనిక్ అంటే సౌండ్ కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. రెండోది ధ్వని కంటే మూడురెట్లు వేగంగా ప్రయాణించే సూపర్‌సోనిక్. మూడోది ధ్వని కంటే ఐదురెట్లు వేగంగా ఉండే హైపర్ సోనిక్ క్షిపణి.
పాకిస్తాన్ దగ్గర బాబర్, రాడ్ అనే సబ్‌సోనిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి ఉపరితలం నుండి ఉపరితలం మీదకు ప్రయోగించవచ్చు.
అయితే, భారత్ దగ్గర రష్యా సహాయంతో తయారు చేసిన అత్యంత అధునాతన సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. 2024 నాటికి సిద్ధం కాగల హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్-2ను కూడా భారత్ తయారు చేస్తోంది.
బ్రహ్మోస్ క్షిపణుల్లో కూడా నాలుగు రకాలున్నాయి. వీటిలో ఉపరితలం నుండి ఉపరితలం, ఆకాశం నుండి ఉపరితలం, సముద్రం నుండి ఉపరితలం, నీటి అడుగు నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించగలవి.
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఇది భూమి నుండి తక్కువ ఎత్తులో చాలా ఎక్కువ వేగంతో ఎగురుతుంది. దీని కారణంగా యాంటీ మిస్సైల్ సిస్టమ్‌తో దాన్ని పట్టుకోవడం అంత సులభం కాదు. ఈ క్షిపణులు తక్కువ సమయంలో ఎక్కువ దూరాలకు అణ్వాయుధాలను మోసుకెళ్లగలవు.
బ్రహ్మోస్ క్షిపణిని పాకిస్తాన్ రివర్స్ ఇంజినీరింగ్ చేయగలదా?
పాకిస్తాన్ దగ్గర సూపర్‌సోనిక్ లేదా హైపర్‌సోనిక్ క్షిపణి సాంకేతికత లేదు. మరి భారతదేశం నుంచి ఈ క్షిపణి సాంకేతికతను పొందే అవకాశంగా ఉంటుందా?
క్షిపణి క్రాష్ అయినందున, ఇప్పుడున్న రూపంలో దాన్ని రివర్స్ చేయడం కష్టమని సెంటర్ ఫర్ ఏరోస్పేస్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ సయ్యద్ మహ్మద్ అలీ తెలిపారు.
"ఈ రకమైన సాంకేతికతకు చాలా మౌలిక సదుపాయాలు కావాలి. దీన్ని రివర్స్ ఇంజినీరింగ్ చేయడం కష్టం'' అని ఆయన చెప్పారు.
ఆయుధం లేదా క్షిపణి దాని ఒరిజినల్ స్థితిలో దొరికినా, దానిని చూసి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా కొత్తది తయారు చేయడం అసాధ్యమని మహ్మద్ అలీ అన్నారు.
అదే సమయంలో ఈ క్షిపణిని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం పాకిస్తాన్‌కు అంత సులభం కాదని, అయితే భారతదేశ సాంకేతికతను కచ్చితంగా విశ్లేషించగలదని ఐక్యరాజ్యసమితిలో పని చేస్తున్న అణు భద్రత నిపుణుడు మహ్మద్ ఖలీద్ అభిప్రాయపడ్డారు.
"ప్రతి క్షిపణి ఒకరకమైన కమాండ్, కంట్రోల్ సిస్టమ్‌తో అనుసంధానించి ఉంటుంది. దీని కోసం వివిధ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లు ఉపయోగిస్తారు. వాటిని కాపీ చేయడం సాధ్యం కాకపోయినా, వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు" అని ఖలీద్ అన్నారు.
పాకిస్తాన్‌కు సొంతంగా క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయని చెప్పారు. అయితే భారత క్షిపణి శకలాలను జాగ్రత్తగా పరీక్షించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదని అమెరికా లోని మిడిల్‌బరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జెఫ్రీ లూయిస్ అన్నారు.
అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.
రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా మిలిటరీ, నాన్ మిలిటరీ టెక్నాలజీని కాపీ కొట్టినట్లు ఇంతకు ముందు కూడా అనేక దేశాలు ఆరోపించాయి. ఇటీవల, అమెరికాకు చెందిన అత్యంత అధునాతన ఎఫ్-35 యుద్ధ విమానం దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయినప్పుడు, వాటి శిథిలాలను సంపాదించడానికి అమెరికా చైనాలు పోటీ పడ్డాయి.
అమెరికా సాంకేతికతను చైనా తెలుసుకోవాలనుకుంది. కానీ, అమెరికా తన విమాన శకలాలను గుర్తించడంతో అవి చైనాకు దొరకలేదు.
1958 లో తైవాన్ యుద్ధ విమానం అమెరికా క్షిపణి 'సైడ్ వండర్'ను ప్రయోగించినా అది పేలలేదు. చైనా ఈ క్షిపణిని స్వాధీనం చేసుకుని సోవియట్ యూనియన్‌కు అప్పగించింది. కె-13 అనే క్షిపణిని రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా తయారు చేశారు.
మిస్సైల్ టెక్నాలజీని కనుగొనడం కష్టం- దొంగిలించడం సులభం
అణ్వాయుధాలు, క్షిపణి సాంకేతికత వ్యాప్తిని నిరోధించడానికి ఎంటీసీఆర్ అనే వ్యవస్థ ఉంది. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, భారత్ సహా 35 దేశాలు ఇందులో భాగంగా ఉన్నాయి. అయితే అందులో పాకిస్తాన్ సభ్యదేశం కాదు.
ఈ ఏర్పాటు ప్రకారం, ఈ వ్యవస్థలో భాగమైన దేశాలు క్షిపణి సాంకేతికతను పరస్పరం పంచుకోవచ్చు. కానీ దాని గురించి సభ్యులందరికీ తెలియజేయడం అవసరం. ఈ సాంకేతికత ఏ సభ్యత్వం లేని దేశం చేతికి చేరకుండా మాత్రమే ఈ ఏర్పాటు.
సయ్యద్ మహ్మద్ అలీ ప్రకారం, ప్రపంచంలో క్షిపణుల వ్యాప్తిని ఆపడం దీని ఉద్దేశాలలో ఒకటి. అయితే ప్రతి దేశం తన వద్ద ఉన్న సాంకేతికత మరే దేశానికీ ఉండకూడదని కోరుకుంటుంది. అందువల్ల ఇవి అత్యంత రహస్యంగా ఉంటాయి. కాబట్టి మిగిలిన దేశాలు అటువంటి సాంకేతికతను యాక్సెస్ చేయడం కష్టం.
"కానీ అన్ని దేశాలు ఒకరి సాంకేతికతను ఇంకొకరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాయి. తద్వారా మరింత మెరుగైన సాంకేతికతను సృష్టించడానికి ప్రయత్నిస్తాయనడంలో సందేహం లేదు"
ఇవి కూడా చదవండి:
- డెల్టాక్రాన్: ఈ కొత్త కోవిడ్-19 వేరియంట్‌తో ఫోర్త్ వేవ్ వస్తుందా?
- కాంగ్రెస్ పార్టీ దారెటు?
- జంగారెడ్డిగూడెంలో 18 మంది మృతి: ఇవి నాటుసారా కల్తీ మరణాలా? సహజ మరణాలా?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తే ఏమవుతుంది? స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారు
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
- ‘అనుభవం ఉందా’ అని అడిగే కంపెనీలకు ఆన్సర్ NATS
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)