డెల్టాక్రాన్: ఈ కొత్త కోవిడ్-19 వేరియంట్‌తో ఫోర్త్ వేవ్ వస్తుందా?

    • రచయిత, ఆండ్రూ బియెర్నాథ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శాస్త్రవేత్తలు కొత్త కోవిడ్-19 వేరియంట్‌ను గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 9న ప్రకటించింది.

డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు కలిసి ఏర్పడిన ఈ వేరియంట్‌ను అనధికారికంగా 'డెల్టాక్రాన్' అంటున్నారు.

డబ్ల్యుహెచ్ఓ మాత్రం దీనిని అధికారికంగా AY.4/BA.1 వేరియంట్‌గా చెబుతోంది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపించేంత ఆందోళనకరమైన వేరియంటా కాదా అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.

డెల్టాక్రాన్ కేసులు యూరప్, అమెరికా, దక్షిణ అమెరికాలో బయటపడ్డాయి.

అయితే, ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించిన కీలక అంశాలు, ముఖ్యంగా ఇది వేగంగా వ్యాపిస్తుందా, టీకాలను తట్టుకోగలదా, లక్షణాలు తీవ్రంగా ఉంటాయా అనేవి శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులకు అంతుపట్టడం లేదు.

అయితే ఇప్పటివరకూ దీని గురించి మనకేం తెలుసు?

డెల్టాక్రాన్ మూలం, వ్యాప్తి

డెల్టాక్రాన్ మొదటి కేసు 2022 జనవరిలో ఫ్రాన్స్‌లో ధ్రువీకరించారని, ఆ తర్వాత బెల్జియం, జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్స్‌లో కూడా ఈ కేసులు కనిపించాయని ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కరోనావైరస్ జన్యు సమాచారాన్ని పంచుకునే ఆన్‌లైన్ ప్లాట్ ఫాం జిసెడ్(GISAID) చెప్పింది.

బ్రిటన్‌, అమెరికా, బ్రెజిల్‌లో కూడా ఇటీవల డెల్టాక్రాన్ కేసులు బయటపడ్డాయి. అయితే, ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులు ఇప్పటికీ చాలా తక్కువగానే ఉన్నాయి.

మార్చి 15 వరకూ AY.4/BA.1 వేరియంట్‌కు సంబంధించి జిసెడ్‌కు 47 శాంపిళ్లు మాత్రమే వచ్చాయి. వీటిలో 36 శాంపిళ్లు ఫ్రాన్స్‌ నుంచి వచ్చినవి.

అయితే, తుది సమాచారం కాకపోయినా, డెల్టాక్రాన్ కేసులు జనవరి నుంచి మార్చి వరకూ అంత విపరీతంగా పెరగలేదనేది వాస్తవం. అందుకే, ఇదే వంశానికి చెందిన డెల్టా, ఒమిక్రాన్‌ కంటే ఇది అంత ఎక్కువగా వ్యాపించే వేరియంట్ కాదనడానికి ఒక ప్రాథమిక సంకేతంగా భావించవచ్చు.

బ్రిటన్‌లోని ప్రైవేటు జెనెటిక్ సీక్వెన్సింగ్ హెలిక్స్ పరిశోధకులు ఇంకా ప్రచురించాల్సిన ఒక అధ్యయనంలో కనిపిస్తున్న గణాంకాలు దీనిని మరింత ధ్రువీకరించేలా ఉన్నాయి.

అమెరికాలో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కేసులు తీవ్రంగా నమోదవుతున్న సమయంలో 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య దీనిలోని శాస్త్రవేత్తలు 29 వేలకు పైగా కోవిడ్-19 పాజిటివ్ శాంపిళ్లపై పరిశోధనలు చేశారు.

కానీ, ఈ మొత్తం పాజిటివ్ కేసుల్లో డెల్టాక్రాన్‌కు సంబంధించిన రెండు కేసులే కనిపించాయి.

ఆ సమయంలో ఇవి అరుదుగా ఉన్నాయని, డెల్టా, ఒమిక్రాన్ స్ట్రెయిన్స్‌తో పోలిస్తే ఆ రెండింటి కాంబినేషన్ అయిన ఇది తీవ్రంగా వ్యాపిస్తుంది అనడానికి అధారాలేవి లభించలేదని శాస్త్రవేత్తలు నిర్ధరించారు.

ఈ వేరియంట్స్ ఎలా కలిశాయి

"ఒక కొత్త స్ట్రెయిన్ ఏర్పడ్డానికి వేరియంట్లు కవలడం అరుదైన, అనూహ్యమైన విషయం కాదు. ఇది ఇప్పటికే ఎన్నో మిగతా స్ట్రెయిన్లతో ఎన్నోసార్లు జరిగుండే అవకాశం ఉంది. కానీ, కరోనావైరస్ వేరియంట్లు ఒకదానికొకటి భిన్నంగా లేకపోవడంతో, అలాంటి వాటిని గుర్తించడం మరింత కష్టంగా మారింది" అని బ్రెజిల్‌లోని ప్రముఖ పబ్లిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌ ఫియోక్రజ్‌ వైరాలజిస్ట్ ఫెలిపే నవేకా చెప్పారు.

"వైరస్‌లు నిరంతరం పరిణామం చెందుతూ, కొత్త వేరియంట్లుగా ఆవిర్భవించడం వల్ల ఎప్పుడూ చెడుగానే ఉంటుందనేం లేదు. మహమ్మారిపై ఈ కొత్త వేరియంట్ చూపబోయే ప్రభావాన్ని ఇప్పుడు మనం అంచనా వేసి, అర్థం చేసుకోవాల్సుంటుంది" అన్నారు.

ఈ కలయిక ఎలా జరుగుతుంది

గత కొన్ని నెలలుగా కరోనావైరస్ డెల్టా, ఒమిక్రాన్ వెర్షన్లు తీవ్రంగా వ్యాపించాయనే విషయం మనం మొదట గుర్తు చేసుకోవాలి. ఆ సమయంలో ఒక వ్యక్తి బార్లో లేదంటే ప్రజా రవాణాలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులతో కాంటాక్ట్ అయినప్పుడు అతడికి ఒకేసారి ఈ రెండు వెర్షన్లకూ సంబంధించిన వ్యాధి కారకాలూ సోకవచ్చు.

ఒక కణాన్ని రెండు వేరియంట్లూ ఏకకాలంలో ఇన్ఫెక్ట్ చేయగలవు. ఫలితంగా డెల్టా, ఒమిక్రాన్ రెండింటి జన్యు లక్షణాలతో కొత్త కాపీలు ఆవిర్భవిస్తాయి..

ఇక డెల్టాక్రాన్ విషయానికి వస్తే ఇందులో ఒమిక్రాన్ స్పైక్, డెల్టా బాడీ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు.

అయితే కరోనావైరస్‌కు సంబంధించిన ఈ రెండు ముఖ్యమైన స్ట్రెయిన్స్ కలవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందా, ఆస్పత్రిలో చేరాల్సిన ప్రమాదం, మరణాలు లాంటివి పెరుగుతాయా అనేది ఇంకా స్పష్టంగా తెలీడం లేదు.

ఈ కొత్త వేరియంట్ ఇంతకు ముందు కరోనా ఇన్ఫెక్షన్ నుంచి లేదా టీకా వేసుకోవడం వల్ల మనలో ఉన్న రోగనిరోధకతను కూడా తప్పించుకోగలదా అనే సమాచారం కూడా అందుబాటులో లేదు.

ఈ వేరియంట్ ఆందోళనకరమా

జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మాత్రం ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి ప్రశాంతంగా ఉండాలని చెబుతున్నాయి.

డబ్ల్యుహెచ్ఓ, అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) రెండూ, డెల్టాక్రాన్‌ను ఇప్పటివరకూ ఆందోళనకరమైన వేరియంట్‌గా చెప్పలేదు.

డబ్ల్యుహెచ్ఓ ప్రస్తుతం దీనిని పరిశీలనలో ఉన్న వేరియంట్‌గా చెప్పింది.

ఈ వేరియంట్‌కు సంబంధించి జరిగిన అధ్యయనాల్లో వ్యాధి తీవ్రతకు సంబంధించి ఎలాంటి మార్పులనూ తాము గమనించలేదని కోవిడ్-19 డబ్ల్యుహెచ్ఓ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ మార్చి 9న ఒక మీడియా సమావేశంలో చెప్పారు.

"వ్యాధి కారకాలు కాలంతోపాటూ కచ్చితంగా మారుతుంటాయి కాబట్టి, దురదృష్టవశాత్తూ మనం ఇలాంటి కలిసే వైరస్‌లను మరిన్ని చూడవచ్చనే అనుకుంటున్నాం"అంటారామె.

ఈ కొత్త వేరియంట్ ఆవిర్భావం శాస్త్రవేత్తల జెనెటిక్‌ సర్వేలెన్స్ ప్రాధాన్యాన్ని మరింత బలంగా చెప్పిందని,

దీని వల్ల ఏదైనా ప్రభావం ఉంటుందా అనేది తెలుసుకోడానికి శాంపిళ్లను మరింత సీక్వెన్సింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఫెలిపే నవేకా చెప్పారు.

అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నవేకా అభిప్రాయపడుతున్నారు.

"వ్యక్తిగత జాగ్రత్తల విషయానికి వస్తే, రెకమండ్ చేసిన డోసులతో వాక్సినేషన్ షెడ్యూల్ పూర్తి చేయడం చాలా ముఖ్యం. చేతులు కడుక్కోవడం, మాస్క్ వేసుకోవడం లాంటివి కొనసాగించడం వల్ల కరోనా వైరస్ ఏ వేరియంట్ అయినా రాకుండా ఉంటుంది" అంటారు ఈ వైరాజలిస్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)