మూర్ఛతో కుప్పకూలిన డ్రైవర్.. స్టీరింగ్ చేతబట్టి హాస్పిటల్ వరకు బస్సు నడిపిన గృహిణి
పుణెకు చెందిన యోగితా సతవ్ బస్సును నడుపుతున్న వీడియో ఇటీవల వైరల్ అయింది. బస్సు డ్రైవర్‌కు ఉన్నట్లుండి మూర్ఛరావడంతో అందులోనే ఉన్న యోగిత బస్సు స్టీరింగ్ చేతబట్టి, ఆయన్ను సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
తాను బస్సు నడపడం ఇదే తొలిసారని... ఎప్పుడూ శిక్షణ కూడా తీసుకోలేదని, తన తండ్రి నడుపుతుంటే చూసేదాన్నని ఇప్పుడు డ్రైవర్ హఠాత్తుగా కుప్పకూలడంతో అత్యవసరంగా బస్సు నడిపించానని యోగిత చెప్పారు.
‘‘మాకు పుణెలోని వాగోలీలో ఓ ఎక్సర్‌సైజ్ క్లబ్ ఉంది. ఆ క్లబ్ కో-ఆర్డినేటర్ తరచుగా కొన్ని ట్రిప్‌లు ఏర్పాటు చేసేవారు. ఆరోజు మేం మోరాచీ చించౌలీకి వెళ్లాం. రోజంతా సంతోషంగా గడిపాం. సాయంత్రం 5 గంటలప్పుడు గార్డెన్ నుంచి బయటికొచ్చి బస్సెక్కాం. ఐదారు నిమిషాలు ప్రయాణించిన తర్వాత బస్సు అదుపుతప్పుతున్నట్లు అనిపించింది.
నాకు డ్రైవింగ్ కొంత తెలుసు. దాంతో ఏదో సమస్య ఉందని నాకు అర్థమైంది. అనుకోకుండా నేను డ్రైవర్ వెనక సీట్లోనే కూర్చున్నాను. ఏదైనా సమస్య ఉందా అని డ్రైవర్‌ను అడిగాను.
తనకేమీ సరిగ్గా కనిపించడం లేదని చెబుతూ, ఉన్నట్లుండి బ్రేక్ వేసి, బస్సును రోడ్డుపై మధ్యలోనే ఆపేశారు. సీట్లో నుంచి లేవడానికి ప్రయత్నిస్తూ ఆయన స్పృహతప్పి పడిపోయారు. ఆయనకు మూర్ఛ వచ్చింది. గట్టిగా అరుస్తూ కింద పడిపోయారు. ఆయనకు వెంటనే వైద్య సహాయం అవసరం అనిపించింది. దీంతో మరో ఆలోచన లేకుండా నా స్నేహితుల సాయంతో ఆయన్ను డ్రైవర్ సీట్లో నుంచి బయటకు లాగి, నేను స్టీరింగ్ పట్టుకున్నాను’’ అన్నారామె.
బస్సును నడపాలని యోగిత సతవ్ నిర్ణయించుకోగానే తోటి మహిళా ప్రయాణికులకు ఆమెపై సందేహం కలిగింది.
‘‘తాను బస్సు నడపగలను అని ఆమె చెప్పారు. కానీ తనకు డ్రైవింగ్ వచ్చో లేదోనని నాకు అనుమానం కలిగింది. మా ఇద్దరికీ ఈమధ్యే పరిచయమైంది. అందుకే ఆమెకు గురించి నాకు పెద్దగా తెలియదు. పరిస్థితి క్లిష్టంగా ఉంది. డ్రైవర్ స్పృహ తప్పారు. ఆయన పరిస్థితి చూసిన తర్వాత మేమంతా యోగితపై నమ్మకం ఉంచాం. ఆమెను బస్సు నడపమని కోరాం’’ అని ఆమె స్నేహితురాలు విద్య చెప్పారు.
నిజానికి యోగిత శిక్షణ పొందిన బస్సు డ్రైవర్ కాదు. తన తండ్రి కారును నడుపుతుంటే చూసి, నేర్చుకున్నారు.
‘‘ఎవరూ నాకు డ్రైవింగ్ నేర్పించలేదు. నేనెప్పుడూ ఎలాంటి డ్రైవింగ్ శిక్షణా తీసుకోలేదు. కానీ, మా నాన్నతో కలసి ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన డ్రైవింగ్ చేస్తుంటే, కారులో ఆయన పక్క సీట్లోనే కూర్చునేదాన్ని. ఆయన ఎలా నడుపుతున్నారో గమనించేదాన్ని. ఎప్పుడు క్లచ్ తొక్కుతారో, ఎప్పుడు బ్రేక్ వేస్తారో, ఎప్పుడు, ఎలా గేర్ మారుస్తారో... ఇలా అన్నీ చూసేదాన్ని’’ అని యోగిత చెప్పారు.
సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన యోగిత... కుటుంబ బాధ్యతల కారణంగా ఎలాంటి ఉద్యోగంలోనూ చేరలేదు.
ఆమె డ్రైవింగ్ వీడియో వైరల్ కావడంతో అంతా ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో తీసిన ఆశా వాగ్‌మారేకు యోగిత ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- నాటోకు రష్యా భయపడుతుందా, యుక్రెయిన్‌ను ఎందుకు చేర్చుకోవద్దంటోంది
- బాల్ ఠాక్రే ప్రాణ భయమే శివసేనను మహారాష్ట్రకు పరిమితం చేసిందా
- ఈమెయిల్ పంపించి మహేశ్ బ్యాంక్‌లో సైబర్ దోపిడీ.. ‘3 బ్యాంకులనూ కొల్లగొట్టింది ఒక్కడే’
- కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ వ్యాపించటం ఎన్ని రోజులకు ఆగిపోతుంది?
- బీట్రూట్, వెల్లుల్లి, పుచ్చకాయ తింటే బీపీ అదుపులో ఉంటుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



