You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒమిక్రాన్: భారత్‌లో కేసుల పెరుగుదల, థర్డ్ వేవ్ సంకేతమా?
భారత్‌లో గత వారం రోజులుగా ఒమిక్రాన్ వల్ల కరోనా కేసులు వేగంగా పెరిగిపోవడంతో అందరిలో థర్డ్‌వేవ్ భయాలు నెలకొన్నాయి.
శుక్రవారం, 24 గంటల వ్యవధిలో భారత్‌లో మొత్తం 16,764 కొత్త కేసులు నమోదు కాగా, 220 మరణాలు సంభవించాయి.
అక్టోబర్ తర్వాత ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్యలో ఇదే గరిష్టం.
దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధానిగా పరిగణించే ముంబైతో పాటు కోల్‌కతాలో ఈ వృద్ధి మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
శుక్రవారం ముంబైలో 3,671 కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారంతో పోల్చితే ఇది 46 శాతం అధికం. ఢిల్లీలో 42 శాతం పెరుగుదల కనిపించింది. ఇక్కడ 1,313 కేసులు వచ్చాయి. కోల్‌కతాలో గడిచిన 48 గంటల్లో కేసుల వృద్ధి 102 శాతం పెరిగి 1,090కి చేరుకుంది.
ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో విలయతాండవం చేసింది. కరోనా సెకండ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరినప్పుడు రోజూ సగటున 4 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కేసుల సంఖ్య తగ్గిపోయింది. చాలా నెలలుగా భారత్‌లో రోజుకు 10 వేల కంటే తక్కువ మందే కరోనా బారిన పడుతున్నారు.
అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న తాజా ఒమిక్రాన్ వేరియంట్, కరోనా థర్డ్ వేవ్ దిశగా బాటలు పరుస్తోందని అధికారులు, నిపుణులు భయపడుతున్నారు.
శుక్రవారం 309 మందికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270కి చేరింది. ఇప్పటివరకు మహారాష్ట్రంలో అత్యధికంగా 450 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో ఈ సంఖ్య 320గా ఉంది.
నవంబర్ నెలలో దక్షిణాఫ్రికాలో తొలిసారిగా ఈ వైరస్‌ను కనుగొన్నారు. అప్పటి నుంచి ఇది వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ వేరియంట్‌ను ఆందోళనకారిగా పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో సహా పలు దేశాలు ప్రయాణ ఆంక్షలను విధించాయి.
మిగతా వేరియంట్ల కంటే ఒమిక్రాన్ బారిన పడినవారిలో కొంతమందికే ఆసుపత్రి చికిత్స అవసరమవుతుందని యూకే, దక్షిణాఫ్రికాల్లో ప్రచురితమైన అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఈ వేరియంట్‌కు వేగంగా వ్యాప్తించే లక్షణం ఉన్నందున కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి, ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
''సెకండ్ వేవ్ తరహాలో భారత్‌లో ఇప్పుడు ఐసీయూలు కిటకిటలాడటం ఉండకపోవచ్చు. కానీ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరగొచ్చు'' అని ఎర్నాకులం మెడికల్ కాలేజీలోని పల్మనరీ, క్రిటికల్ కేర్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఎ. ఫతాహుదీన్ అన్నారు.
ఆందోళన కలిగించే మూడు అంశాలను ఆయన నొక్కి చెప్పారు. ఇంకా టీకాలు తీసుకోని భారతీయుల సంఖ్య, దీర్ఘకాలిక వ్యాధులను కలిగినవారు, దేశ జనాభాలోని వృద్ధుల నిష్పత్తి గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్‌లో ఇప్పటివరకు టీకా తీసుకునేందుకు అర్హులైన వారిలో దాదాపు 90 శాతం మందికి పాక్షికంగా వ్యాక్సినేషన్ జరిగింది. అయితే ఇప్పటికీ సింగిల్ డోస్ వ్యాక్సీన్ కూడా తీసుకోని వయోజనులు భారత్‌లో దాదాపు 10 కోట్ల వరకు ఉన్నారు.
లక్షలాది మంది భారతీయులకు డయాబెటిస్, అధిక రక్త పోటు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. ఒకవేళ కరోనా సోకినట్లయితే వీరు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు.
సెకండ్ వేవ్ సమయంలో కేసులు వేగంగా పెరగడంతో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ఆసుపత్రుల్లో పడకల కొరత, ఔషధాలు లేమి, మెడికల్ ఆక్సీజన్ కొరత ఏర్పడ్డాయి. రోగుల బంధువులు ఆక్సీజన్ కోసం బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా తమకు సహాయం చేయాలని విజ్ఞప్తులు చేశారు.
సెకండ్ వేవ్ తరహా నష్టాన్ని ఈసారి దేశం ఎదుర్కొనే అవకాశం లేదని పబ్లిక్ పాలసీ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ లహరియా పేర్కొన్నారు.
''అప్పటి పరిస్థితులు వచ్చే అవకాశం చాలా పరిమితంగానే ఉంది. కానీ ప్రజలు, కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటించడం తప్పనిసరి'' అని ఆయన బీబీసీతో అన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలోనే భారత్‌లోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేసులు పెరుగుతున్నప్పటికీ, ఎన్నికలు వాయిదా పడకపోవచ్చని ఈ వారం ప్రారంభంలో ఎన్నికల సంఘం సూచించింది.
భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం, రాజకీయంగా కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచార ర్యాలీల్లో, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేలాది మంది ఈ కార్యక్రమాలకు హాజరు కాగా, చాలామంది మాస్క్‌లు లేకుండానే ఇందులో పాల్గొన్నారు.
ఎన్నికలు లేదా మతపరమైన సామాజిక సమావేశాలు, ఒమిక్రాన్ వ్యాప్తిని మరింతగా పెంచుతాయని డాక్టర్ ఫతాహుదీన్ హెచ్చరించారు.
''ఒమిక్రాన్‌ను ఒక దయ్యంలాగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు. అలాగే అదొక చిన్న విషయంగా కూడా పరిగణించకూడదు'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భీమా కోరేగావ్: హింసాత్మక ఘర్షణలకు నేటితో నాలుగేళ్లు.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది?
- జమ్మూ కశ్మీర్: మాతా వైష్ణోదేవీ ఆలయంలో తొక్కిసలాట, 12 మంది మృతి
- కోవిడ్-19: 2021 చివరికల్లా 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని భారత్ ఎందుకు సాధించలేకపోయింది?
- చైనా: షియాన్ నగరంలో కఠిన లాక్డౌన్.. ఆహారం అందక ప్రజల ఆకలి కేకలు
- జార్ఖండ్: లీటరు పెట్రోలుకు రూ.25 తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. సబ్సిడీ నిబంధనలు ఏంటంటే..
- 2021 వైరల్ వీడియోలు: సోషల్ మీడియాను కదిలించిన 5 వీడియోలను ఇక్కడ చూసేయండి...
- పిల్లలకు కోవిడ్19 వ్యాక్సీన్: టీకా ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - 7 ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)