You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జమ్మూ కశ్మీర్: మాతా వైష్ణోదేవీ ఆలయంలో తొక్కిసలాట, 12 మంది మృతి
జమ్మూ-కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు. కొత్త సంవత్సరం ఆరంభం రోజున జరిగిన ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు.
త్రికూట కొండలపై ఉన్న ఆలయ గర్భగుడి వెలుపల ఈ ప్రమాదం జరిగింది.
''కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయ కాంప్లెక్స్‌లో 12 మంది మరణించారు. చాలా మంది గాయాల పాలయ్యారు. తెల్లవారుజామున 2:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఏదో గొడవ కారణంగా ప్రజలంతా ఒకరినొకరు తోసుకోవడం ప్రారంభించారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది'' అని జమ్మూ-కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
ఈ ఘటనలో ఆరుగురే మృతి చెందినట్లు తొలుత గుర్తించారు. ''వైష్ణోదేవీ భవన్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఆరుగురు మరణించారు. మొత్తంగా ఎంతమంది మరణించారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. చనిపోయినవారికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తాం. గాయపడిన వారిని నారాయణన్ ఆసుపత్రికి తరలిస్తున్నాం. గాయపడిన వారి సంఖ్యలో కూడా ఇంకా స్పష్టత లేదు'' అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో కట్రా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ చెప్పారు.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ''మాతా వైష్ణోదేవీ భవన్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రజలు మరణించడం చాలా విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడి, అక్కడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నా'' అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి అందజేస్తామని ఆయన ప్రకటించారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ''ఆలయంలో తొక్కిసలాట జరగడం చాలా బాధాకరం. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా'' అని ఆయన ట్వీట్ చేశారు.
మాతా వైష్ణోదేవీ మందిరంలో జరిగిన విషాదకర ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ''ఈ ఘటన గురించి జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాజీతో నేను మాట్లాడాను. గాయపడిన వారికి సరైన చికిత్స అందించే పనిలో అక్కడి యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'' అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
''దేవాలయంలో తొక్కిసలాట కారణంగా ప్రజలు మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా'' అని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడారని, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఏ రకమైన సహాయానికైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని పేర్కొంది.
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున అందజేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా తెలిపారు. క్షతగాత్రుల చికిత్స ఖర్చును ఆలయ బోర్డు భరించనుంది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నగరం 'రాత్రి ఆకాశాన్ని ఎలా మిస్సవుతోంది, కాంతి కాలుష్యం అంటే ఏమిటి? - 11 ప్రశ్నలు, జవాబులు
- జనవరి 1 నుంచి ఏమేం మారతాయి... మీరేం చేయగలరు, ఏం చేయలేరు?
- ఆస్కార్ రేసులో ఆశలు రేపుతున్న 15 సినిమాలివే...
- గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహరాజ్ ఎవరు, ఆయన గతంలో ఏం చేసేవారు
- కోవిడ్ మహమ్మారి: 2021లో నేర్చుకున్న గుణపాఠాలేంటి, మున్ముందు ఏం చేయాలి ?
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)