"నిజాలు మాట్లాడేవారందరిపైనా ‘యాంటీ-నేషనల్’ ముద్ర వేస్తున్నారు" - మెహబూబా ముఫ్తీ

    • రచయిత, ఆమీర్ పీర్జాదా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నన్ను చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నప్పుడు, కొన్ని రోజుల్లో వదిలేస్తారని భావించాను. ఇక మీదట ఆర్టికల్ 370 గురించి, జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడనని ఒక బాండ్ కాగితంమీద సంతకం చెయ్యమన్నారు. కానీ, నేను ప్రతిఘటించాను" అని జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

2019 ఆగస్ట్ 5న జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ, రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయన్ని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షులు మెహబూబా ముఫ్తీ తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటినుంచీ దాదాపు 14 నెలలపాటూ ముఫ్తీ నిర్బంధంలో ఉన్నారు.

"ఆర్టికల్ 370, 35ఏ చట్టాలు రాష్ట్ర ప్రత్యేక గుర్తింపును సంరక్షిస్తాయి. భారతదేశంలో విలీనం అయినప్పుడు జమ్మూ-కశ్మీర్‌కు అవి రాజ్యాంగపరమైన భద్రతను, హామీని చేకూర్చిపెట్టాయి. అధిక ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రమైనప్పటికీ జమ్ము-కశ్మీర్..రెండు దేశాల సిద్ధాంతాన్ని కాదని, కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు, షరతులపై లౌకికవాద, ప్రజాస్వామ్య భారతదేశంలో విలీనమయ్యింది. ఈ నిబంధనలను ఉల్లంఘించడమంటే విలీనం ముఖ్యోద్దేశం కోల్పోయినట్టే" అని ముఫ్తీ బీబీసీకి రాసిన ఈమెయిల్‌లో తెలిపారు.

ముఫ్తీని నిర్బంధంలోకి తీసుకున్న తరువాత మొదట కొన్నాళ్లు శ్రీనగర్‌లోని హరి నివాస్‌లో ఉంచారు. 1990లలో హరి నివాస్ ఒక విచారణ కేంద్రంగా ఉండేది. తరువాత దాన్ని రాష్ట్ర అతిధి గృహంగా మార్చారు.

"మొదటి మూడు వారాలు చాలా కష్టంగా గడిచాయి...నా కుటుంబంతో కూడా సంబంధాలు తెగిపోయాయి. బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో అస్సలు తెలిసేది కాదు. సమయం మొత్తం పుస్తకాలు చదువుతూ గడిపేదాన్ని" అని ఆమె తెలిపారు.

ఫిబ్రవరి మొదటివారంలో ముఫ్తీపై కఠినమైన ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద కేసు నమోదు చేసారు. ఈ చట్టం ప్రకారం, ఎవరినైనా సరే ఎటువంటి విచారణ లేకుండా రెండేళ్ల వరకు జైల్లో నిర్బంధించవచ్చు.

"కుయుక్తలతో ప్రత్యర్థులను హతమార్చి అధికారంలోకి వచ్చిన మధ్యయుగానికి చెందిన కశ్మీర్ రాణితో పోలుస్తూ "డాడీస్ గర్ల్" అనీ, "కోటా రాణి" అని ప్రజలచే పిలవబడే ఈ వ్యక్తిని (ముఫ్తీని)...ప్రమాదకరమైన కుట్రలు, కుతంత్రాలు చేసే వ్యక్తిగా, దురాక్రమణలకు పాల్పడే వ్యక్తిగా పరిగణిస్తున్నారు" అని ఆ పీఎస్ఏ వివరణ పత్రంలో రాసి ఉంది. పీఎస్ఏ పత్రం గందరగోళంగానూ, వినోదభరితంగానూ కూడా ఉందని ముఫ్తీ అన్నారు.

"నేను నా తండ్రితో చాలా సన్నిహితంగా ఉండేదాన్ని కాబట్టి డాడీస్ గర్ల్ అని రాస్తూ అదేదో అపఖ్యాతిలాగ ప్రస్తావించారు. నిజంగా, దీన్ని ఎవరో హిందీ సినిమా స్క్రిప్ట్‌రైటర్ రాసుంటారని అనుకున్నాను. కుట్రలు, కుయుక్తులు అంటూ వ్యక్తిగత దూషణలు చెయ్యడం, కోటా రాణితో పోల్చడం చాలా అసంబద్ధమైన విషయాలు" అని ముఫ్తీ అభిప్రాయపడ్డారు.

గత ఆగస్ట్‌లో ముఫ్తీని నిర్బంధించకముందు ఆవిడ ఒక ట్వీట్ చేసారు. "ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది విలీనం ఉద్దేశాన్ని నిరర్థకం చెయ్యడమే కాకుండా ఇండియా స్థానాన్ని జమ్ము-కశ్మీర్ ఆక్రమణదారు స్థాయికి కుదించేస్తుంది" అని ఆవిడ సోషల్ మీడియాలో రాసారు.

దాని గురించి ఇప్పుడు ఆవిడ వివరణ ఇస్తూ... "భారతదేశంలో ఏ ప్రముఖ న్యాయవాదినైనా అడిగి చూడండి...ఆర్టికల్ 370ను అన్యాయంగా రద్దు చెయ్యడం వలన రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా జమ్మూ-కశ్మీర్, ఇండియాల మధ్య సంబంధం ప్రశ్నార్థకం అయ్యిందనే చెప్తారు. నేను చెప్పినదాన్లో చట్టబద్ధమైన వాస్తవాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు నిజాలు మాట్లాడేవారందరిపైనా ‘యాంటీ-నేషనల్’ అనే ముద్ర వేస్తున్నారు" అని చెప్పారు.

ఆర్టికల్ 370ను కాపాడతామని జమ్మూ-కశ్మీర్‌లోని వివిధ రాజకీయ ప్రతిపక్ష పార్టీలు వాగ్దానం చేసాయి. కానీ, ఇప్పుడు అది రద్దయిన తరువాత, ఈ పార్టీలన్నీ కశ్మీర్‌లో తమ ప్రాసంగికత (రిలవెన్స్) కోల్పోయాయని నిపుణులు అంటున్నారు.

“నా గురించి చెప్పాలంటే, నన్ను 14 నెలలు నిర్బంధంలో ఉంచిన తరువాత కూడా, నా గొంతును అణచివేయడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు" అని ముఫ్తీ తెలిపారు.

పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అజెండా ఎప్పుడూ కశ్మీర్‌లో స్వయం పాలనకే మద్దతిస్తూ వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత కూడా వారి అజెండాలో ఏ మార్పూ లేదని ముఫ్తీ తెలిపారు.

"బీజేపీ రాజ్యాగాన్ని ధ్వసం చేసే పద్ధతిలో నడుచుకుంటోంది కాబట్టి మా అజెండా, దృష్టి తప్పైపోవు, మారిపోవు. జమూ-కశ్మీర్ సమస్యకు గౌరవమైన, శాశ్వతమైన పరిష్కారం ఒక్కటే...స్వయం పాలన, సంవాదం, సయోధ్య. ఇది తప్ప మరో మార్గం లేదు" అని ముఫ్తీ స్పష్టం చేసారు.

ప్రస్తుతం కశ్మీర్‌లో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ డెవెలప్‌మెంట్ కౌన్సిల్స్ (డీడీసీ) ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో, కేంద్ర ప్రభుత్వం..కశ్మీర్‌లోని 20 జిల్లాల్లోనూ డీడీసీలను ఏర్పాటు చేయడానికి అనుకూలంగా జమ్మూ-కశ్మీర్ పంచాయత్ రాజ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా గత ఏడాది ఆగస్ట్‌నుంచీ స్తంభించిపోయిన రాజకీయ ప్రక్రియను పునరుద్ధరించే ప్రయత్నాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కానీ ముఫ్తీ అలా అనుకోవట్లేదు. "జమ్మూ-కశ్మీర్‌లో అనేకమార్లు ఎన్నికలు జరిగాయి. ఇదేం కొత్త కాదు. అసలైన విషయాలనుంచీ జమ్మూ-కశ్మీర్ ప్రజల దృష్టి మరల్చడానికే ఈ డీడీసీని ఏర్పాటు చేసారు" అని ముఫ్తీ పేర్కొన్నారు.

అయితే, తొలిసారిగా కశ్మీర్‌లో ఏడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) అనే కూటమిని స్థాపించి డీడీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ముఫ్తీ పార్టీ కూడా ఇందులో భాగమే. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తిరిగి తీసుకురావడమే ఈ కూటమి ముఖ్య లక్ష్యం.

"శాంతియుతంగా అసమ్మతి తెలియజేసే అనేక సంస్థలు, పార్టీలు స్థాణువులైపోయిన సమయంలో, పీఏజీడీ ఒక్కటే భారత ప్రభుత్వంతో పోరాడడానికి ధైర్యంగా ముందుకు వచ్చింది. బీజేపీ, దాని అనుబంధ పార్టీలను దూరంగా ఉంచడానికే మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం" అని ఆవిడ తెలిపారు.

ముఫ్తీ పార్టీ కార్యకర్తలు అనేకమార్లు నిరసన ప్రదర్శనలు చేపట్టే ప్రయత్నాలు చేసారు. జమ్మూ-కశ్మీర్ ప్రతేక హోదాను రద్దు చేసి ఏడాదైన సందర్భంగా, గుజ్జార్-బకర్వాల్ కమ్యూనిటీని అడవులనుంచీ తరిమేసినప్పుడు...ఇలా పలు సందర్భాలలో నిరసనలు చేపట్టే ప్రయత్నాలు చేసారు. కానీ, పోలీసులు, అధికారులు వారిని చెదరగొట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)