మిల్ఖా సింగ్: కోవిడ్‌ అనంతర సమస్యలతో చనిపోయిన ప్రఖ్యాత అథ్లెట్

ప్రఖ్యాత అథ్లెట్ మిల్ఖా సింగ్ చండీగఢ్‌లో మరణించారు. ఇటీవల కోవిడ్‌ బారిన పడిన ఆయన దాని నుంచి కోలుకున్నారు. తర్వాత మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయారు.

మే 20న కరోనా సోకిన తరువాత 91 ఏళ్ల మిల్ఖా సింగ్‌ను చండీగఢ్‌లోని పీజీఐఎంఆర్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ శుక్రవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.

శుక్రవారం రాత్రి 11.30కు మిల్ఖా సింగ్ మరణించినట్లు ఆస్పత్రి ప్రతినిధి అశోక్ కుమార్ బీబీసి జర్నలిస్ట్ రవీందర్ సింగ్ రాబిన్‌కు తెలిపారు.

మే 20 నుంచి మిల్ఖా సింగ్ కోవిడ్‌తో బాధపడుతుండగా జూన్ 3న ఆయనను ఐసీయూలో చేర్చారు. జూన్ 13 వరకు ఆయన ఐసీయూలోనే ఉంటూ కోవిడ్‌ను జయించారు.

తరువాత కోవిడ్ టెస్ట్‌లో నెగటివ్ వచ్చినప్పటికీ, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనను మళ్లీ ఐసీయూలో చేర్చవలసి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని వైద్యులు చెప్పారు.

ఐదు రోజుల క్రితం మిల్ఖా సింగ్ సహచరి నిర్మల్ మిల్ఖా సింగ్ కూడా కోవిడ్‌తో మరణించారు.

ఫ్లయింగ్ సిక్కు

ఫ్లయింగ్ సిక్కుగా పేరు గాంచిన మిల్ఖా సింగ్, ఆసియా క్రీడలతో పాటు కామన్వెల్త్ క్రీడల్లోనూ 400 మీటర్ల రేసులో స్వర్ణ పతకం సాధించిన ఏకైక భారత అథ్లెట్.

1958 టోక్యో ఆసియా క్రీడల్లో 200 మీటర్లు, 400 మీటర్లలో మిల్ఖా సింగ్ స్వర్ణ పతకాలు సాధించారు.

1962 జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీటర్లలో, 4 X 400 మీటర్ల రిలే రేసుల్లో స్వర్ణ పతకాలు సాధించారు.

1958 కార్డిఫ్ కామన్వెల్త్ క్రీడల్లో 440 యార్డ్ రేసులో స్వర్ణ పతకం సాధించారు.

1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల రేసులో కాంస్య పతకాన్ని స్వల్ప తేడాతో కోల్పోయారు. కానీ, ఈ రేసులో పాల్గొన్న తరువాత మిల్ఖా సింగ్ పేరు ప్రపంచం నలుదిక్కులా మారుమోగిపోయింది.

రోమ్ ఒలింపిక్స్‌లో మిల్ఖా సింగ్ 400 మీటర్ల రేసును 45.73 సెకన్లలో పూర్తి చేశారు. జర్మన్ అథ్లెట్ కార్ల్ కౌఫ్మన్ కన్నా సెకెండులో వందో వంతు వెనుకబడ్డారు. కానీ, ఈ టైమింగ్ మరో 40 సంవత్సరాల వరకు నేషనల్ రికార్డుగా నిలిచింది.

మిల్ఖా సింగ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. భారత క్రీడా చరిత్రలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారుడిగా మిల్ఖా సింగ్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆయన అన్నారు.

"మిల్ఖా సింగ్ మరణంతో మనం ఓ గొప్ప క్రీడాకారుడిని కోల్పోయాం. లక్షలాది మందికి ఆయన స్ఫూర్తినిచ్చారు. భారత ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన మరణానికి చింతిస్తున్నాను" అంటూ మోదీ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)