విమానంలో పెళ్లి చేసుకున్న మదురై జంట.. విచారణకు డీజీసీఏ ఆదేశాలు

తమిళనాడులో ఓ జంట విమానంలో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో దీనిపై చర్చ జరుగుతోంది.

మరోవైపు ఈ పెళ్లి విషయంలో విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వివాదంలో చిక్కుకుంది.

ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. వివాహ సమయంలో విమానంలో పనిచేసిన సిబ్బందిని స్పైస్‌జెట్ విధుల నుంచి తప్పించింది.

అసలు ఏం జరిగింది?

మదురై నుంచి బయలుదేరిన విమానంలో ఒక జంట పెళ్లి చేసుకుంది.

ఈ విమానంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతరుతోపాటు వారి బంధువులు కూడా ఉన్నారు.

మదురైకు చెందిన పెళ్లి కొడుకు మే 23న స్పైస్‌జెట్ చార్టర్ ఫ్లైట్‌ను బుక్ చేసుకున్నారు.

అయితే విమానంలో పెళ్లి జరిపించేందుకు దాన్ని బుక్ చేసుకున్నట్లు తమకు ముందుగా తెలియదని విమాన యాన సంస్థ వెల్లడించింది.

‘‘స్పైస్‌జెట్ విమానాన్ని వారు ముందుగా బుక్ చేసుకోవడం నిజమే. కానీ పెళ్లి కోసమే బుక్ చేసుకుంటున్నట్లు వారు చెప్పలేదు’’అని మదురై ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సెంథిల్ వలవన్ చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.

విచారణకు ఆదేశించిన డీజీసీఏ

కోవిడ్ నిబంధనలు పాటించకపోయినా, మాస్కులు సరిగా పెట్టుకోకపోయినా.. ఆ ప్రయాణికులను విమానాల్లో ఎక్కించుకోవద్దని డీజీసీఏ ఇటీవల ఆదేశాలు జారీచేసింది.

మదురై ఘటనపై విమానయాన సంస్థ నుంచి డీజీసీఏ నివేదిక కోరింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

మరోవైపు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన సదరు ప్రయాణికులపై విమానయాన సంస్థ ఫిర్యాదు నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)