You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్: మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, దిల్లీ, హరియాణాల్లో ఎక్కువగా కరోనా మరణాలు - Newsreel
దేశంలో కరోనా తీవ్రతపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దిల్లీ, హరియాణాల్లో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.
ప్రస్తుతం లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న రాష్ట్రాలు 12 ఉన్నాయని.. బెంగళూరు, చెన్నైలలో కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.
ఒక్క బెంగళూరు నగరంలోనే గత వారం రోజుల్లో 1.49 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు.
ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.5 లక్షల కంటే ఎక్కువే ఉందని లవ్ అగర్వాల్ చెప్పారు.
మనుషుల నుంచి మనుషులకే సోకుతుంది..
కోవిడ్ మనుషుల నుంచి మనుషులకే సోకుతుందని జంతువుల ద్వారా సోకడం లేదని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ చెప్పారు.
మరాఠా రిజర్వేషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్ట్, 50 శాతం దాటి ఇవ్వడానికి నిరాకరణ
మరాఠా రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల 50 శాతం పరిమితిని ఉల్లఘించి ఇవ్వడానికి నిరాకరించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్లు మంజూరు చేసినప్పుడు 50 శాతం పరిమితిని ఉల్లంఘించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు భావించింది.
మరాఠా సమాజాన్ని రిజర్వేషన్ల కిందికి తీసుకురావడానికి, విద్యాపరంగా, సామాజికంగా మరాఠీ పౌరులు వెనుకబడినట్లు ప్రకటించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
విద్య, ఉపాధి రంగాల్లో మరాఠా సమాజానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు (SEBC) రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వినిపించింది.
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లకు చట్టబద్ధత ఇవ్వడంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రిజర్వేషన్ల 50 శాతం పరిమితిని ఉల్లంఘించకూడదని తీర్పు ఇచ్చింది.
మరాఠా రిజర్వేషన్లపై తీర్పు వినిపించిన జస్టిస్ భూషణ్ "మేం ఇందిరా సాహ్నీ తీర్పును సమీక్షించడానికి ఎలాంటి కారణం లేదని గుర్తించాం. ఇందిరా సాహ్నీ ఏ తీర్పు ఇచ్చారో, దాన్నే అనుసరిస్తున్నాం. ఆర్టికల్ 342-Aని గౌరవిస్తూ, 102వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ వచ్చిన పిటిషన్లను కూడా కొట్టివేస్తున్నాం. వెనుకబడిన వర్గాల కోసం దానిని జాతీయ కమిషన్ రూపొందంచింది అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం ద్వారా మరాఠా సమాజానికి విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించింది.
రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో చివరగా మార్చి 26న విచారణ జరిగింది.
రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ కేసులో తన తీర్పును రిజర్వ్ చేసింది. చివరికి ఈరోజు తన నిర్ణయం వినిపించింది.
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్: కరోనా సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా కీలక ప్రకటనలు
కరోనా మహమ్మారి వల్ల దేశం ప్రజలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
కరోనా కాలంలో ఆర్థికవ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఆర్బీఐ చాలా ప్రకటనలు చేసింది.
గత ఏడాదితో పోలిస్తే, ఈసారీ కరోనా వ్యాప్తి తీవ్రంగా, భారీగా ఉన్నా, దానితో పోరాడి, ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి ప్రత్యేక వ్యూహం అవలంబిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు.
ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా ఉంటాయనే అంచనాలతో ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉంటాయని కూడా ఆశిస్తున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు.
ఎగుమతులతోపాటూ, విదేశీ మారక నిల్వలు కూడా పెరిగాయని, దానివల్ల భారత్ ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆయన తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడ్డానికి మద్దతు అందించేలా ఆర్బీఐ కొన్ని ప్రకటనలు కూడా చేసింది.
ఆర్బీఐ ముఖ్య ప్రకటనలు:
- వ్యాక్సీన్ తయారీకి, ఆస్పత్రుల్లో సౌకర్యాల కోసం బ్యాంకులు అదనపు రుణాలు అందిస్తాయి. కోవిడ్ లోన్ బుక్ కింద ఈ రుణాలు ఇస్తారు. ఈ సౌకర్యం వచ్చే ఏడాది వరకూ ఉంటుంది.
- హెల్త్ కేర్ కోసం ఆర్బీఐ రూ.50 వేల కోట్ల రూపాయల ఫండ్ ప్రకటించింది.
- రూ.35 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను ఆర్బీఐ మరోసారి రెండు వారాల్లో కొనుగోలు చేస్తుంది.
- రాష్ట్రాలకు ఇచ్చే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంలో ఆర్బీఐ సడలింపు ఇచ్చింది. రాష్ట్రాలకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 36 రోజుల నుంచి 50 రోజులకు పెంచారు. వరుస ఓవర్ డ్రాఫ్టుల మధ్య కాల వ్యవధిని 14 రోజుల నుంచి 21 రోజులకు పెంచారు. ఇది సెప్టెంబర్ 30 వరకూ కొనసాగుతుంది. దీనివల్ల రాష్ట్రాలకు డబ్బులు తీసుకోవడం సులభం అవుతుంది.
- ప్రజల బ్యాంకింగ్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఆర్బీఐ చాలా రకాల వీడియో ఆధారిత కేవైసీ ఏర్పాటు చేసింది.
- ఆర్బీఐ చిన్న పరిశ్రమల కోసం విడిగా రుణాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసింది. ఇంతకు ముందు రుణాలు తీసుకోని పరిశ్రమలకు వీటిని ఇస్తారు. వ్యక్తులు, చిన్న పరిశ్రమలు తమ రుణాల చెల్లింపుల వ్యవధిని ఒకసారి మార్చుకోవచ్చు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కడ్ ఆమెతో ప్రమాణం చేయించారు.
మమతా బెనర్జీ ప్రస్తుతం దేశంలో ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా నిలిచారు. .
కరోనా దృష్ట్యా మమత ప్రమాణ స్వీకార వేడుకకు చాలా తక్కువ మంది హాజరయ్యారు.
మరోవైపు, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన బీజేపీ పశ్చిమ బెంగాల్లో తమ కార్యకర్తలపై హింసకు నిరసనగా దేశవ్యాప్తంగా ధర్నాలు ప్రారంభించింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
తృణమూల్ 48 శాతం ఓట్లతో మొత్తంగా 213 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 38 శాతం ఓట్లతో 77 స్థానాలకు పరిమితమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే కర్ఫ్యూ ... నిబంధనలు, మినహాయింపులు
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అన్ని వ్యాపారాలు, షాపులకు అనుమతి. అప్పుడు కూడా జనం గుంపులుగా తిరగకూడదు, గుమి గూడకూడదు. ఆ తరువాత అంటే మధ్యాహ్నం 12 నుంచి మరునాడు ఉదయం 6 వరకూ అన్నీ మూసేయాలి. మే 18వ తేదీ వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.
ఈ జాబితాలో ఉన్నవాటికి కర్ఫ్యూ వర్తించదు:
- ఆసుపత్రులు, వైద్య పరీక్ష ల్యాబులు, మందుల షాపులు
- మీడియా
- టెలికాం, ఇంటర్నెట్, ఐటి ఆధారిత సేవలు
- పెట్రోల్, గ్యాస్ పంపులు, గ్యాస్ డిపోలు
- కరెంటు స్టేషన్లు
- నీటి సరఫరా, పారిశుద్ధ్యం
- కోల్డ్ స్టోరేజీలు, గోదాములు
- ప్రైవేటు సెక్యూరిటీ సేవలు
అన్ని తయారీ రంగ పరిశ్రమలూ నడుపుకోవచ్చు. పరిశ్రమల శాఖ చెప్పినట్టుగా కోవిడ్ నిబంధనలు పాటించాలి.అన్ని వ్యవసాయ పనులూ చేసుకోవచ్చు. వ్యవసాయ శాఖ చెప్పినట్టుగా కోవిడ్ నిబంధనలు పాటించాలి.
మధ్యాహ్నం 12 తరువాత ఉదయం 6 లోపు అన్ని రకాల వాహనాలూ, ప్రయాణాలు నిషిద్ధం.
ఈ కింది వాటికి మినహాయింపు:
- ప్రభుత్వ, కోర్టుల, స్థానిక సంస్థల అధికారులు, సిబ్బంది - వీరు కూడా ఐడి కార్డ్, డ్యూటీ పాస్ చూపించాలి.
- డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు సేవలు అందించేవారు తిరగవచ్చు - ఐడికార్డు చూపించాలి.
- గర్భిణులు, ఇతర వ్యాధిగ్రస్తులు చికిత్స కోసం వెళ్లవచ్చు. వారి వాహనాల్లో తిరగవచ్చు.
- కోవిడ్ వ్యాక్సీన్ కోసం వెళ్లేవారు
- ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు, వెళ్లే వారు వెళ్లవచ్చు. కానీ వారు టికెట్ చూపించాలి. స్థానికంగా అధికారులు వాటికి ఏర్పాట్లు చేయాలి.
- రాష్ట్రంలోపల, రాష్ట్రాల మధ్య అన్ని రకాల సరకు రవాణాకు అనుమతి.
ఆటోలు, టాక్సీలు, సిటీ బస్సులు వంటి స్థానిక రవాణా సేవలు 6-12 మధ్యే తిరగాలి. అప్పుడు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలి.
జిల్లా లోపల, జిల్లాల మధ్య ప్రజా రవాణా అనుమతించరు. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు కూడా 12-6 వరకూ నిషేధం.పెళ్లిళ్లు వంటివి తేదీలు మార్చకూడదు. గరిష్టంగా 20 మందితో చేసుకోవాలి. దానికి స్థానికంగా అనుమతి తీసుకోవాలి. కోవిడ్ నిబంధనలు పాటించాలి.
ఆయా కేటగిరీల వారికి ఉన్నతాధికారులు పాసులు జారీ చేయాలి.
ఇవన్నీ మే 5 నుంచి రెండు వారాలు అమల్లో ఉంటాయి.
6-12 మధ్య కూడా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా కలెక్టర్లు సెక్షన్ 144 విధించాలి.
వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపిసి సెక్షన్ 188, విపత్తు నివారణ చట్టం సెక్షన్ 51 నుంచి 60, ఇతర చట్టాల కింద కేసులు పెడతారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు...
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)