కరోనావైరస్ వ్యాక్సీన్: ప్రపంచవ్యాప్తంగా టీకాల పంపిణీ ఎలా సాగుతోంది?

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుండగా చాలామంది నుంచి ఒక ప్రశ్న వినిపిస్తోంది. 'నావంతు ఎప్పుడు' అని.

కోవిడ్‌కు వ్యాక్సీన్‌ పొందడమనేది ఇప్పుడు చాలామందికి జీవన్మరణ సమస్య. చాలా కొద్దిదేశాలు ఇప్పటికే టార్గెట్‌లు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం టీకా ప్రక్రియను నడిపిస్తుండగా, చాలా దేశాలలో ఈ ప్రణాళికలు అంత స్పష్టంగా లేవు.

నాకు వ్యాక్సీన్‌ ఎప్పుడు ఇస్తారు ?

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ఎలా కొనసాగుతుందో ఒక్కసారి చూద్దాం.

ఇప్పటి వరకు ఎన్ని వ్యాక్సీన్‌లు ఇచ్చారు?

ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలలో వివిధ కంపెనీలు తయారు చేసిన సుమారు 300 మిలియన్‌ డోసుల కరోనా వైరస్‌ను ఇప్పటి వరకు ఇచ్చారు. ఇది చరిత్రలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమంగా చెబుతున్నారు.

చైనాలోని వూహాన్‌లో కరోనా వైరస్‌ బైటపడి ఏడాది గడవక ముందే దానికి వ్యాక్సీన్‌ సిద్ధమైంది. చాలా దేశాల తమ జనాభాకు తగినట్లుగా టీకా డోసులను తెప్పించుకోగా, మరికొన్ని దేశాలకు అది ఇంకా చేరలేదు.

తొలిదశలో భాగంగా చాలా దేశాలు ఒక క్రమపద్ధతిలో వ్యాక్సీన్‌లను ఇచ్చుకుంటూ వచ్చాయి. ఆ క్రమం ఇలా ఉంది.

  • 60 ఏళ్లు పైబడిన వారు
  • ఆరోగ్య కార్యకర్తలు
  • తీవ్ర ఆరోగ్య సమస్యల్లో ఉన్నవారు

ఇప్పటికే వ్యాక్సీన్‌ కార్యక్రమం నడుస్తున్న ఇజ్రాయెల్, యూకేలాంటి దేశాలలో ఆసుపత్రులకు వచ్చే కోవిడ్‌ రోగుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. అలాగే మరణాలు, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ సంఖ్య కూడా తగ్గింది.

అయితే యూరప్‌, అమెరికా ఖండాల్లోని చాలా దేశాల్లో వ్యాక్సినేషన్‌ నడుస్తుండగా, ఆఫ్రికా ఖండంలోని చాలా కొద్దిదేశాల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఈఐయూ)కు చెందిన అగాథే డెమరైజ్‌ సమగ్ర పరిశోధన చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంత టీకా తయారవుతోంది, సరఫరాకు మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఆయా దేశాల జనాభా ఎంత, వ్యాక్సీన్‌ను కొనగల సమర్ధత ఎంత అన్న అంశాలను ఈ రీసెర్చ్‌ పరిశీలించింది.

టీకా విషయంలో పేద-ధనిక దేశాల మధ్య అంతరాలు ఉంటాయన్న ఊహాగానాలకు తగ్గట్టుగానే ఈ పరిశోధనా ఫలితాలు కూడా కనిపించాయి. యూకే, యూఎస్‌ దేశాలలో సరిపడినంత వ్యాక్సీన్ ఉంది.

ఈ రెండు దేశాలు వ్యాక్సీన్‌ తయారీ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. సహజంగానే వీరికి అగ్రభాగం దక్కింది. కెనడా, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన దేశాలు వీటి తర్వాతి స్థానంలో నిలుస్తున్నాయి.

చాలా పేద దేశాలలో ఇంకా వ్యాక్సీనేషన్‌ ప్రక్రియ మొదలే కాలేదు.

ధనిక దేశాలు టీకాను నిల్వ చేస్తున్నాయా?

దేశ జనాభాకన్నా ఐదింతలు ఎక్కువ వ్యాక్సీన్‌ను నిల్వ చేసిందని కెనడాపై విమర్శలు వచ్చాయి. అయితే వారికి అందాల్సినంత వ్యాక్సీన్‌ ఇంకా అందనేలేదు.

అమెరికా నుంచి ఎక్స్‌పోర్ట్‌పై ట్రంప్‌ బ్యాన్‌ విధిస్తారనే అనుమానంతో వ్యాక్సీన్‌ సరఫరాకు ఐరోపా దేశాలను నమ్ముకుంది కెనడా. అక్కడి ఫార్మా కంపెనీలకు ఆర్డర్‌లు ఇచ్చింది.

కానీ కెనడా ఆలోచన ఫలించ లేదు. ఆ దేశానికి అవసరమైన వ్యాక్సీన్‌ను అందించడంలో ఫార్మా కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి.

చిత్రంగా అమెరికాకన్నా యూరోపియన్‌ యూనియన్‌ దేశాలే వ్యాక్సీన్‌ ఎగుమతులపై నిషేధాలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు టీకా ఎగుమతిని ఇటలీ ఇప్పటికే బ్యాన్‌ విధించింది.

కొన్నిదేశాల్లో ఉధృతంగా వ్యాక్సినేషన్‌

యూరోపియన్‌ యూనియన్‌లోని సైబీరియా తమ దేశంలో ఎక్కువమందికి ఇప్పటికే టీకాను ఇవ్వగలిగింది. అయితే ఇది ఆ దేశపు సమర్ధత అనడంకన్నా వ్యాక్సీన్‌ డిప్లొమసీ కారణంగా పొందిన లబ్ధి అనవచ్చు.

తూర్పు ఐరోపా దేశాలకు వ్యాక్సీన్‌ సరఫరా చేయడంలో రష్యా, చైనాలు పోటీపడ్డాయి. సైబీరియాకు చైనా నుంచి సినోఫామ్‌, రష్యా నుంచి స్ఫుత్నిక్‌-వి, జర్మనీ, అమెరికాల నుంచి ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌ నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌లు అందాయి. అయితే ఎక్కువమంది చైనా తయారీ సినోఫామ్‌ టీకానే పొందారు.

వ్యాక్సీన్‌ దౌత్యం అంటే ఏంటి?

చైనా ఎప్పటిలాగా తన వ్యాక్సీన్‌ను మార్కెట్‌ చేసుకోవడంలో ముందుంది. ఆ దేశం నుంచి మొదటి రెండు టీకాలను పొందిన దేశాలు భవిష్యత్‌లో అవసరమైతే బూస్టర్‌ వ్యాక్సీన్‌లను కూడా అక్కడి నుంచే పొందనున్నాయి.

సినోఫామ్‌ టీకాను సౌదీ అరేబియా తమ దేశంలోని 80%శాతం మందికి ఇవ్వడమే కాకుండా, అక్కడ కంపెనీ స్థాపనకు చైనాకు అనుమతినిచ్చింది.

"చైనా తమ ఫార్మా కంపెనీలను స్థాపించడం, మానవ వనరులను సమకూర్చడానికి కూడా ముందుకు వస్తుండటంతో దీని ప్రభావం దీర్ఘకాలం ఉండే అవకాశం ఉంది" అని అగాథే డెమరైజ్‌ అన్నారు.

"భవిష్యత్తులో చైనాను ఎవరూ కాదనలేని పరిస్థితి ఏర్పడుతుంది" అని ఆమె అన్నారు.

ప్రపంచంలో అత్యధిక వ్యాక్సీన్‌ను తయారు చేసిన దేశం తమ దేశంలో అందరికీ ముందుగానే టీకా ఇవ్వగలుగుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు.

ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సీన్‌ను ఉత్పత్తి చేస్తున్న భారత, చైనాలు తమ తమ దేశాలలో వ్యాక్సీనేషన్‌ను 2022నాటికిగానీ పూర్తి చేయలేవని ఈఐయూ పరిశోధన వెల్లడించింది.

ఈ రెండు దేశాలో ఎక్కువ జనాభా, తక్కువ వైద్య సిబ్బంది ఉండటమే దీనికి కారణం.

ఎదురయ్యే సవాళ్లు?

వ్యాక్సీన్‌ తయారీ విషయంలో భారత దేశపు విజయమంతా ఒక వ్యక్తి మీదే ఆధారపడింది. ఆయన పేరే అడార్‌ పూనావాలా. ఆయన నడుపుతున్న సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సీన్‌ తయారీ కంపెనీ.

వ్యాక్సీన్‌లు అసలు పని చేస్తాయో లేదో తెలియని సమయంలో ఆయన తన సొంత డబ్బును పెద్ద ఎత్తున పెట్టుబడిగా పెట్టారు. ఈ వ్యవహారంలో ఆయన కుటుంబం కూడా ఆందోళన చెందింది.

అయితే ఈ ఏడాది జనవరినాటికి ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సీన్‌ను ఆయన భారత ప్రభుత్వానికి అందించగలిగారు. ప్రస్తుతం ఆయన కంపెనీ రోజుకు 2.4 మిలియన్‌ డోసుల టీకాను తయారు చేస్తోంది.

"భయాలు, ఒత్తిళ్లన్నీ తొలగిపోయాయి. వ్యాక్సీన్‌ను తయారు చేయగలిగాం. కానీ అందరినీ సంతృప్తిపరచడం అసలైన సవాలు" అన్నారు అడార్‌ పూనావాలా.

మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేసుకోవడం ఆయన సక్సెస్‌లో ప్రధాన భూమిక పోషించాయి. వ్యాక్సీన్‌ తయారీ సందర్భంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఏదో ఒకటి ఏ క్షణంలోనైనా ఎదురు కావచ్చు.వాటికి సిద్ధపడి ఉండాలి.

"దీన్ని సైన్సు అనడంకన్నా ఒక కళ అనడం సరిగ్గా సరిపోతుంది" అన్నారు పూనావాలా. టీకాతోపాటు అవసరమైతే కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు బూస్టర్‌లను కూడా తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

కోవాక్స్‌ స్కీమ్‌తో వ్యాక్సినేషన్‌ వేగవంతమవుతుందా?

కోవాక్స్‌ ఫెసిలిటీ అనే స్కీమ్‌ ద్వారా కోవాక్స్‌ టీకాను ముందు భారత్‌కు, ఆ తర్వాత ఆఫ్రికాకు సరఫరా చేసేందుకు తాము కట్టబడి ఉన్నామని పూనావాలా చెప్పారు.

కోవాక్స్‌ టీకా కోసం చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి. ప్రపంచమంతటికీ ఈ వ్యాక్సీన్‌ అందేలా ఒక ప్రత్యేక వ్యవస్థ పని చేస్తోంది.

ఐక్య రాజ్య సమితి, గ్లోబల్‌ వ్యాక్సీన్‌ అలయన్స్‌(గావి), కోయిలిషన్‌ ఫర్‌ ఎపిడిమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ (సెపి) అనే మూడు సంస్థలు సంయుక్తంగా ఈ స్కీమ్‌ను ప్రకటించాయి.

ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలలోని 20% మందికి వ్యాక్సీన్ అందేలా చూడటమే తమ లక్ష్యమని ఈ స్కీమ్‌ ప్రకటించింది. ఈ కోవాక్స్‌ స్కీమ్‌ ద్వారా లబ్ధి పొందిన తొలిదేశం ఘనా.

ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను అందించాలని ఈ స్కీమ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే చాలా దేశాలు స్వయంగా ఒప్పందాలకు దిగుతుండటంతో ఈ ప్రయత్నానికి పెద్దగా గుర్తింపు రావడం లేదు.

సొంతంగా వ్యాక్సీన్‌ పొందడానికి ప్రయత్నిస్తున్న పలు ఆఫ్రికన్‌ దేశాలు అడార్‌ పూనావాలాను నిత్యం సంప్రదిస్తున్నాయి. అయితే ఏం జరిగినా కోవాక్స్‌ స్కీమ్‌ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలున్నాయని అగాథే డెమరైజ్‌ అన్నారు.

అంతా సవ్యంగా జరిగితే ఈ స్కీమ్‌ ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో 20-27శాతం జనాభాకు వ్యాక్సీన్‌ను అందించే అవకాశం ఉంది.

"ఇది చరిత్ర సృష్టించే అంశం కాకపోవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం కచ్చితంగా ఉంటుంది" అని అగాథే అన్నారు. ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ అంచనా ప్రకారం ప్రపంచంలోని పలు పేదదేశాలు 2023నాటి వరకు లేదంటే అసలే టీకాను అందుకోలేని పరిస్థితి కూడా ఉండొచ్చు.

టీకా కావాలని అన్ని దేశాలు కోరుకోవడం లేదు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఉన్న కొన్ని దేశాలలో కోవిడ్‌ పెద్దగా ప్రభావం చూపలేదు. అలాంటి దేశాలు టీకా కోసం తొందర పడటం లేదు.

అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, టీకాను వద్దంటున్న దేశాలలో కోవిడ్‌ ఎక్కువకాలం మనుగడ సాగిస్తూ కొత్త రూపంలో మిగతా ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. వ్యాక్సీన్‌ తట్టుకునే కొత్త వైరస్‌లు వృద్ధి చెందవచ్చు.

అయితే ఈ వ్యాక్సీన్‌ను అందరికీ ఇవ్వడం అసాధ్యమేమీ కాదు. ప్రస్తుత ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లకు పైగా ఉంది. ఇంత పెద్ద స్థాయిలో టీకాల తయారీ, పంపిణీ చేసిన సందర్భాలు గతంలో లేవు.

వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రభుత్వాలు నిజాయితీగా వ్యవహరించాలని అగాథే అంటున్నారు. 'మేం టీకా ఇవ్వలేము' అని ప్రభుత్వాలు ప్రకటించే పరిస్థితి లేదని అగాథే అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)