కరోనావైరస్: హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా హైదరాబాద్.. 54 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నాయన్న సీసీఎంబీ: Newsreel

హైదరాబాద్‌లో 54 శాతం మంది ప్రజలలో కోవిడ్‌ యాంటీబాడీలు ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) వెల్లడించింది.

హైదరాబాద్ నగరవాసుల్లో 56 శాతం మంది మహిళలు, 53 శాతం మంది పురుషుల్లో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది.

మొత్తం 9 వేల మంది నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా ఈ సర్వే చేశారు. ఒక్కో వార్డు నుంచి 300 మంది చొప్పున 30 వార్డులకు చెందినవారికి యాంటీబాడీలను గుర్తించే పరీక్షలు చేశారు.

సర్వేలో పాల్గొన్నవారంతా 10 నుంచి 90 ఏళ్ల మధ్య వయస్కులు.

70 ఏళ్లు దాటినవారిలో 49 శాతం మందిలో యాంటీబాడీలు కనిపించాయి.

జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్), భారత్ బయోటెక్, సీఎస్ఐఆర్, ఐసీఎంఆర్‌తో కలిసి సీసీఎంబీ ఈ సర్వే చేసింది.

హైదరాబాద్ ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా పయనిస్తోందని.. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సీనేషన్ వల్ల ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సీసీఎంబీకి చెందిన డాక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు.

రైతుల ఆందోళన: ఎండాకాలం కోసం ప్రత్యేక ఏర్పాట్లు- దిల్లీ సరిహద్దులకు పెద్ద ఎత్తున ఫ్రిజ్ లు, ఏసీలు

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళన మార్చి 6 నాటికి వంద రోజులు పూర్తి చేసుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.మరోవైపు ఎండలు ముదురుతుండటంతో వాటిని తట్టుకునేందుకు ఆందోళన చేస్తున్న రైతులు సిద్ధమవుతున్నారని, ఎయిర్ కూలర్లు, ఫ్రిజ్‌లు, బోర్ వెల్స్ ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

దిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని తిక్రీ బోర్డర్ వద్ద పెద్ద ఎత్తున ఎయిర్ కూలర్లు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లను చేర్చారని ఏఎన్ఐ వెల్లడించింది. నీటికి ఇబ్బంది రాకుండా బోర్ వెల్ కూడా వేయించారని,వెదురు కర్రలతో ఇళ్లు నిర్మిస్తున్నారని కూడా ఏఎన్ఐ పేర్కొంది. ట్రక్కుల ట్రాలీలపై టార్పాలిన్ పట్టాలు కప్పి చలికాలం నుంచి తప్పించుకున్న రైతులు, ఎండాకాలంలో వాటిని తొలగించి ఆరు బయట పడుకునేందుకు సిద్ధమవుతున్నారు. అమృత్‌సర్ నుంచి దోమ తెరలు, దోమలను చంపే ఎలక్ట్రిక్ బ్యాట్ లను రైతు సంఘాల నాయకులు ట్రాక్టర్లలో పెద్ద ఎత్తున తెప్పించారని ఏఎన్ఐ వెల్లడించింది. మూడు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనను విరమించేది లేదని యూపీ- దిల్లీ సరిహద్దుల్లోని గాజీపూర్ వద్ద ఆందోళనలో పాల్గొంటున్న కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికైత్ స్పష్టం చేశారు.

అయోధ్య రామమందిరం కోసం మరికొంత భూమి కొనుగోలు చేసిన తీర్థ్ క్షేత్ర ట్రస్ట్

ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రామమందిరం నిర్మించబోయే భూమికి సమీపంలో రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ మరో 7,285 చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేసింది.

రామ మందిరం ప్రాంగణాన్ని 70 ఎకరాల నుంచి 107 ఎకరాలకు విస్తరించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భావిస్తోందని పీటీఐ చెప్పింది.

సుప్రీంకోర్టు 2019 సెప్టెంబర్‌లో తన తీర్పులో రామమందిర నిర్మాణం కోసం ట్రస్టుకు 70 ఎకరాల భూమి ఇచ్చింది.

ట్రస్ట్ కొత్తగా 7,285 చదరపు అడుగుల భూమిని దీప్ నారాయణ్ అనే స్థానికుడి నుంచి కొనుగోలు చేసిందని, ఆయనకు ఒక చదరపు అడుగుకు 1,373 రూపాయల చొప్పున కోటి రూపాయలు చెల్లించిందని స్థానిక వార్తా పత్రికలు రాశాయి.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రతిపాదిత భూమి సమీపంలో మరిన్ని భూములు కొనాల్సిన అవసరం ఉందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చెప్పింది.

ఈ భూమి కొనుగోలు తర్వాత మిగతా భూముల కోసం కూడా ప్రయత్నాలు జరుగుతాయని భావిస్తున్నారు.

ప్రధాన ఆలయం నిర్మాణానికి దాదాపు ఐదు ఎకరాల భూమి కావాలి. దాదాపు వంద ఎకరాల భూమిలో మ్యూజియం, లైబ్రరీ, యోగ శాల, ఫొటో గ్యాలరీ లాంటివి నిర్మిస్తామని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు ఒకరు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది.

రామ మందిర ప్రతిపాదిత భూమి దగ్గర ఎవరికైతే స్థలాలు ఉన్నాయో, వారితో తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం చర్చలు జరుపుతోందని పత్రిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)