ISWOTY: వికీపీడియాలో 50 భారత మహిళా క్రీడాకారుల ప్రొఫైల్స్ చేర్చిన విద్యార్థులు

భారతదేశంలో ఆరు భాషలకు చెందిన విద్యార్ధులతో కలిసి ఈ 50 మంది విజయవంతమైన, వర్ధమాన క్రీడాకారిణుల జీవిత కథలను వికీపీడియాలో చేర్చేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఈ క్రీడాకారిణులలో చాలామందికి సరైన గుర్తింపు, ప్రాధాన్యం రాలేదు. వారికి సరైన గుర్తింపు దక్కేందుకు చేసిన ప్రయత్నం ఇది.

ఈ క్రీడాకారిణులలో చాలామంది అంతర్జాతీయ పతకాలు సాధించారు. జాతీయ రికార్డులను బద్ధలు కొట్టారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. అయినా వారికి సరైన గుర్తింపు రాలేదు. వికీపీడియాలో వారికి చోటు దక్కలేదు. ఈ 50 మంది మహిళా క్రీడాకారులపై కొన్ని నెలలుగా పరిశోధన చేసి, వారితో ఇంటర్వ్యూలు నిర్వహించి, ప్రొఫైళ్లను సిద్ధం చేసి వికీపీడియాలో చేర్చాం.

వీరిలో చాలామంది క్రీడాకారిణులు ప్రముఖుల గురించి సమాచారం అందించే వెబ్ పోర్టల్ వికీపీడియాలోని స్థానిక భాషల విభాగంలో స్థానం సంపాదించలేకపోయారని బీబీసీ గుర్తించింది.

దేశవ్యాప్తంగా 12 సంస్థలు, 300 మందికి పైగా జర్నలిజం విద్యార్ధులు వికీపీడియాలోకి వెళ్లి అందులో చోటుదక్కని ఈ 50 మంది భారతీయ మహిళా క్రీడాకారిణుల సమాచారాన్ని తెలుగు, హిందీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, ఇంగ్లీషు భాషలలో వచ్చేలా చేశారు.

ఈ 50 మంది క్రీడాకారిణులను ఎలా గుర్తించాం?

40 మందికి పైగా ప్రముఖులు ఉన్న జ్యూరీ సహాయంతో ఈ 50 మంది భారతీయ మహిళా క్రీడాకారులను బీబీసీ ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు, రచయితలు ఈ జ్యూరీలో సభ్యులు. 2019, 2020 సంవత్సరాలలో మహిళా క్రీడాకారిణుల ఆట తీరును పరిశీలించడం ద్వారా జ్యూరీ ఈ 50 మంది క్రీడాకారిణుల పేర్లను సూచించింది. క్రీడాకారిణుల పేర్లను ఆంగ్ల అక్షర క్రమంలో పొందుపర్చాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)