కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?

    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

కంభం చెరువు నిండితేనే మూడు మండలాల రైతుల ఆశలు పండుతాయి. ప్రజల కడుపు నిండుతుంది. కానీ గడిచిన కొన్ని దశాబ్దాల్లో కంభం చెరువు పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో నిండిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.

అయితే, ఆయా సందర్భాల్లో కంభం ప్రాంతంలో రైతుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సీజన్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా మరోసారి కంభం చెరువు పూర్తిగా నిండి, పొంగి పొర్లుతోంది.

అదే సమయంలో కంభం చెరువుని ప్రపంచ చారిత్రక వారసత్వ సాగునీటి నిర్మాణాల జాబితాలో చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజే (ఐసీఐడీ) సంస్థ అధికారికంగా ప్రకటించింది. కంభం చెరువును ఆధునికీకరించి, పర్యటక అవకాశాలపై శ్రద్ధ పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

పేరుకే చెరువు గానీ.. చూడడానికి అదో డ్యామ్

కంభం చెరువు చూసేందుకు ఓ మేజర్ ఆనకట్టని తలపిస్తుంది. ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతంలో ఇది ప్రధాన నీటి వనరు. 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుందంటే ఎంత విస్తారంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది మొత్తంగా 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. కానీ ఇటీవల పూడిక కారణంగా అది 2 టీఎంసీలకే పరిమితం అవుతోంది.

అయినప్పటికీ చెరువు పూర్తి నీటి సామర్థ్యంతో ఉంటే చుట్టు పక్కల కంభం, బెస్తవారి పేట, అర్థవీడు మండలాల్లో అధికారికంగా 19 గ్రామాల్లోని 6,944 ఎకరాలకు సాగునీరు చేరుతుంది. అనధికారికంగా అది 10వేలకు పైనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

అంతేకాకుండా, 2 లక్షల జనాభా తాగునీటి సమస్య తీరుస్తుంది. ముఖ్యంగా చెరువులో నీటి నిల్వ చేరితే భూగర్భ జలాల లభ్యత పెరిగిన మూలంగా ఈ ప్రాంత వాసులకు అనేక విధాల లబ్ధి చేకూరుతోంది.

సుదీర్ఘ చరిత్ర ఈ చెరువు సొంతం..

కంభం చెరువుకు ఆరు శతాబ్దాల చరిత్ర ఉంది. 15వ శతాబ్దం చివరిలో ఈ చెరువు నిర్మాణం జరిగింది. మానవ నిర్మిత చెరువులలో ఆసియాలోనే అతి పెద్ద వాటిలో కంభం చెరువు ఒకటి. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ఈ చెరువు నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయులు భార్య అన్నపూర్ణమ్మ సహాయంతో ఈ చెరువు నిర్మించినట్టు కంభం ప్రాంతానికి చెందిన పులి శ్రీనివాస ప్రసాద్ తన రచనల్లో పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగా శ్రీకృష్ణదేవరాయులు, అన్నపూర్ణమ్మ వారి విగ్రహాలను చెరువు కట్ట మీద ఏర్పాటు చేశారు. కంభం గ్రామానికి ఎగువన రెండు కొండల మధ్య ఎత్తైన కట్టడం ద్వారా నీటిని నిల్వ ఉంచేందుకు ఏర్పాట్లు చేయడంతో ఈ చెరువు రూపకల్పన జరిగింది.

గుండ్లకమ్మ, జంపలేరు వాగుల నుంచి వస్తున్న వరద ముప్పు నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరడంతో ఈ నిర్మాణానికి పూనుకున్నట్టు ప్రచారంలో ఉంది. సాంకేతికంగా పెద్దగా వనరులు లేని సమయంలో సీసం కరిగింది జిగురుతనం కోసం సున్నం తదితరాలను మిశ్రమంగా చేసి నిర్మాణం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఏనుగులతో తొక్కించి చెరువు కట్ట నిర్మించడంతో చెక్కు చెదరకుండా ఉందని అభిప్రాయపడుతుంటారు.

పూర్తిగా నిండేది అప్పుడప్పుడు మాత్రమే..

సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ కంభం చెరువు పూర్తిగా నిండింది మాత్రం చాలా తక్కువ సార్లు మాత్రమే. అధికారిక సమాచారం ప్రకారం గత శతాబ్దాంలో కేవలం 9 సార్లు మాత్రమే కంభం చెరువులో పూర్తి నీటి నిల్వ నమోదయ్యింది. అది కూడా 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996లో జరిగింది. ఇక గడిచిన 20 ఏళ్లలో చూస్తే కేవలం 2005లో పూర్తిగా నిండగా, ఆ తర్వాత ఈ ఏడాది కంభం చెరువు నిండి పొంగి పొర్లుతోంది. దాంతో స్థానికుల ఆనందానికి హద్దులు లేవనే చెప్పవచ్చు. అలుగు వద్ద కంభం చెరువు నుంచి పొంగి పొర్లుతున్న నీటిలో స్థానికులు ఆనందంగా జలకాలాడుతూ గుడపుతున్నారు.

ఇలాంటి పరిస్థితి చాలా ఏళ్ల తర్వాత రావడంతో ఆనందంగా ఉందని స్థానిక మహిళ రజియా బీబీసీకి తెలిపారు. ‘‘చాలాకాలం తర్వాత ఇలా నిండింది. పిల్లా పాపలతో ఇక్కడికి వచ్చాం. ఇలా ఉంటే మా ప్రాంత వాసుల కరువు తీరుతుంది. మాకు కష్టాలు తీరతాయి"అని ఆమె అన్నారు.

తాగునీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు..

కంభం చెరువులో నీళ్లు లేనిపక్షంలో కంభం ప్రాంతంలో తీవ్రమైన సమస్యలు తప్పవు. సాగునీటి అవస్థలతో పాటుగా తాగునీటి కొరత కూడా తీవ్రంగా మారుతుంది. భూగర్భ జలాలు అడుగంటిన సమయాల్లో బోర్లు కూడా పనికిరాకుండా పోవడంతో నీటి సరఫరాకి పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. అటువంటి సమయాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. దాని కోసం అధిక భారం పడుతుందని కంభం ప్రత్యేక అధికారి పి శివారెడ్డి అన్నారు.

"ఇటీవల కాలంలో 2018లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. ట్యాంకర్లతో అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాల్సి వచ్చింది. దాని కోసం రోజుకి రూ.1.5 లక్షలు చొప్పున ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ప్రభుత్వానికి అది భారమే. ఈ ఏడాది అలాంటి సమస్య రాకపోవడంతో పెద్ద మొత్తంలో ఆదా అవుతున్నట్టే భావించాలి. భవిష్యత్తులో కంభం చెరువుకి వెలిగొండ ప్రాజెక్టు నుంచి కేటాయింపులు ఉండడంతో నీటి నిల్వకు ఢోకా ఉండదు. తద్వారా ప్రజలకు తాగునీటి అవసరాలతో పాటుగా కంభం చెరువు ఆయకట్టుకి సాగునీరు కూడా సకాలంలో అందడానికి అవకాశం ఏర్పడుతుంది" అంటూ శివారెడ్డి వివరించారు.

అంతర్జాతీయ గుర్తింపుతో అభివృద్ధి జరుగుతుందా

సుదీర్ఘ చరిత్ర కలిగిన కంభం చెరువుకి ఎట్టకేలకు గుర్తింపు దక్కింది. మానవ నిర్మిత సాగునీటి కట్టడాల్లో ప్రపంచంలో గుర్తించిన 14 కట్టడాల్లో కంభం చెరువుకి కూడా చోటు దక్కింది. 1950లో స్థాపించిన ఐసీఐడీ సంస్థ ఆమేరకు గుర్తించిన వాటిలో దేశీయ కట్టడాలు 4 ఉండగా, అందులో ఏపీకే చెందిన మూడున్నాయి. కంభం చెరువుతో పాటు పోరుమామిళ్ల చెరువు, కే సీ కెనాల్‌లకు కూడా అందులో చోటు దక్కింది.

అంతర్జాతీయ గుర్తింపు రావడం సంతృప్తికరంగా ఉందని కంభం చెరువు ఆయకట్టు రైతు వెంకటయ్య బీబీసీకి తెలిపారు. ‘‘ఇప్పటికైనా చెరువు అభివృద్ధి మీద దృష్టి సారించాలి. సుదీర్ఘకాలంగా కంభం చెరువు అభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రభుత్వాల నుంచి స్పందన రాలేదు. ఇప్పుడైనా ఈ చారిత్రక కట్టడాన్ని కాపాడుకోవాలి. దానికి అనుగుణంగా కంభం చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించాలి. గతంలో ప్రపంచ బ్యాంకు నిధులతో కొద్ది పాటి పనులు చేసినా పూర్తిగా ఉపయోగపడడం లేదు. ఈసారి అంతర్జాతీయ గుర్తింపు తర్వాత కంభం చెరువు మీద దృష్టి పెడితే మా ప్రాంత రైతులు సిరులు పండిస్తారు" అంటూ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కంభం చెరువు ఆయకట్టు పరిధిలో అరటి, పసుపు, శనగ, వరి వంటి పంటలు విరివిగా పండిస్తున్నారు. సాగునీటి కొరత తీరితే విలువైన పంటల పండించడానికి వీలుపడుతుందని ఆశిస్తున్నారు.

పర్యటకంగా అవకాశాలు

కంభం చెరువు నీటితో ఉంటే కనుల విందుగా కనిపిస్తుంది. ముఖ్యంగా చెరువు మధ్యలో ఉన్న కొండలు ఆకర్షిస్తాయి. మొత్తం 7 కొండలు ఉండడతో కొన్నేళ్ల క్రితం బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చెరువు పదే పదే ఎండిపోవడంతో బోటింగ్ విరమించుకున్నారు. ఇక చెరువు ఎండిపోయిన సమయంలో విస్తారంగా పంటలు పండించుకుంటూ, నిండిన సమయంలో ఆ నీటితో దిగువన సాగు చేసుకుంటూ ఉంటామని కంభం చెరువు పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగేంద్రుడు బీబీసీతో అన్నారు.

"కంభం చెరువు పరిరక్షణ కోసం అనేక పోరాటాలు చేశాం. పలువురు మంత్రులు, అధికారులను కలిశాం. కానీ పెద్దగా ఫలితం రాలేదు. వెలిగొండ పూర్తయితే మా సమస్య తీరుతుందని ఎదరుచూస్తున్నాం. ప్రస్తుతం అది ఆశాజనకంగా ఉండడంతో వచ్చే సీజన్ నుంచి వెలిగొండ నుంచి వచ్చే నీటితో కంభం చెరువు కళకళలాడుతుందని అనుకుంటున్నాం. పర్యటకాభివృద్ధికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. బోటింగ్ సహా అన్ని ఏర్పాట్లు చేస్తే అనేక మంది దూర ప్రాంతాల నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది"అని ఆయన వివరించారు.

ఏపీలో అటు నైరుతి, ఇటు ఈశాన్య రుతుపవనాల ప్రభావం కూడా అతి స్వల్పంగా ఉండే జిల్లా ప్రకాశం. అందులోనూ మెట్ట ప్రాంతం కావడంతో కంభం చెరువు సుదీర్ఘకాలంగా కళ తప్పినట్టు కనిపించేది. పైగా కొన్ని ఆక్రమణలు కూడా జరుగుతున్నట్టు స్థానికులు వాపోతున్నారు. కంభం చెరువుని వెలిగొండ ప్రాజెక్ట్ నీటి నిల్వ కోసం వాడుకోవాలనే ప్రతిపాదనలుండడంతో మళ్లీ ఈ చెరువుకు పూర్వ వైభవం వస్తుందని నీటిపారుదల రంగ నిపుణుడు శివ రాచర్ల అభిప్రాయపడుతున్నారు.

"వచ్చే సీజన్ నాటికి వెలిగొండ నుంచి నీటిని తరలించే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అది జరిగితే కంభం చెరువు ఆయకట్టు ప్రాంతం, సమీప గ్రామాల తాగునీటి వసతికి లోటు ఉండదు. పైగా పర్యాటకాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి రాబోయే కాలం ఆశాజనకంగా ఉండవచ్చని"అని ఆయన అన్నారు.

ఒకనాడు వరదల నుంచి కాపాడేందుకు నిర్మించిన కంభం ప్రస్తుతం పూర్తిగా సాగు, తాగు నీటి వనరుగా మారింది. వెలిగొండ మూలంగా మళ్లీ కంభం చెరువు కళకళలాడితే ఆ ప్రాంత వాసులకు కూడా అనేక సమస్యలు తీరినట్టే అవుతుంది. తాజాగా లభించిన గుర్తింపు కారణంగా ప్రభుత్వాలు మరింత చొరవ చూపాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)