భారతదేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడుతోందా? వీ-డెమ్ నివేదిక ఏం చెబుతోంది?

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని స్వీడన్‌కు చెందిన వీ-డెమ్ ఇన్‌స్టిట్యూట్ ఒక నివేదికలో పేర్కొంది.

భారత్‌తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని ఈ నివేదిక చెప్తోంది.

స్వీడన్‌లోని గూటెన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వీ-డెమ్ ఇన్‌స్టిట్యూట్ పనిచేస్తోంది. 'ఉదారవాద ప్రజాస్వామ్య సూచీ' (లిబరల్ డెమొక్రసీ ఇండెక్స్) పేరుతో మొత్తం 179 దేశాలకు ఈ సంస్థ ర్యాంకులు ఇచ్చింది.

ఇందులో భారత్ 90వ స్థానంలో నిలవగా, డెన్మార్క్ మొదటి స్థానం పొందింది. భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక 70వ స్థానంలో, నేపాల్ 72వ స్థానంలో, పాకిస్తాన్ 126 స్థానంలో, బంగ్లాదేశ్ 154వ స్థానంలో నిలిచాయి.

మోదీ ప్రభుత్వ పాలనలో మీడియా, పౌర సమాజం, ప్రతిపక్షాలకు స్థానం సన్నగిల్లుతుండటంతో భారతదేశం ప్రజాస్వామ్య హోదాను కోల్పోయే దిశలో ఉందని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రపంచస్థాయి ప్రమాణాలను, స్థానిక సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని దీన్ని తయారుచేసినట్లు వీ-డెమ్ ప్రతినిధులు తెలిపారు. సంక్లిష్టమైన డాటా ఆధారంగా ఈ రిపోర్ట్ తయారుచేశామని, అందువల్ల ఇది, మిగతా రిపోర్టుల కన్నా భిన్నమైందని తెలిపారు.

వీ-డెమ్ సంస్థను 2014లో స్థాపించారు. 2017 నుంచీ వివిధ దేశాల్లో ప్రజాస్వామ్య స్థితిని తెలియజేసే సూచీతో ఏటా ఈ సంస్థ నివేదిక విడుదల చేస్తోంది.

పరిస్థితి ఎలా ఉంది?

"భారత్, ఇతర దేశాల్లోని ప్రజాస్వామ్యం గురించి మేమేమీ పాశ్యాత్య దేశాల్లో కూర్చుని మాట్లాడట్లేదు. మాకు 3000లకు పైగా నిపుణుల నెట్‌వర్క్ ఉంది. వీరిలో భారతదేశంలోని మేధావులు కూడా ఉన్నారు. వీరందరికీ భారత్‌లోని పౌర సమాజం, మీడియా, రాజకీయ పరిస్థితుల గురించి క్షుణ్ణంగా తెలుసు" అని వీ-డెమ్ డైరెక్టర్ స్టాఫన్ లిండ్బర్గ్ బీబీసీతో అన్నారు.

"ఏ దేశంలోనైనా 400 రకాల ఇండికేటర్లు తీసుకుని అక్కడి ప్రజాస్వామ్య స్థితిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాం. వీటిల్లో ముఖ్యమైనవి... భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియాకున్న స్వాతంత్ర్యం, పౌర సమాజానికున్న స్వేచ్ఛ, ఎన్నికలు జరిగే విధానం, నాణ్యత, మీడియాలో భినాభిప్రాయలకున్న స్థానం, విద్యలో స్వేచ్ఛ. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు. భారతదేశంలో ఇవన్నీ బలహీనపడుతున్నాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రెండేళ్ల ముందు నుంచీ కొన్ని సూచికలు బలహీనపడుతూ వచ్చాయి కానీ, మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటైనప్పటి నుంచి వీటి క్షీణత గణనీయంగా ఉంది" లిండ్బర్గ్ తెలిపారు.

"గత ఐదు నుంచీ ఎనిమిదేళ్లల్లో పరిస్థితి మరింత దిగజారింది. భారతదేశం ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ లేని దేశాల జాబితాలో చేరడానికి చాలా దగ్గరగా ఉంది. మా నివేదికను పరిశీలిస్తే దేశంలో మీడియా స్వేచ్ఛ బాగా తగ్గిపోయినట్టు అర్థమవుతుంది. ప్రభుత్వం తరపున జర్నలిస్టులను వేధించడం, మీడియాను సెన్సార్ చేసే ప్రయత్నాలు, జర్నలిస్టులను అరెస్టులు, మీడియా తరపునుంచీ సెల్ఫ్ సెన్సార్షిప్ చేసుకోవడంలాంటివన్నీ పెరుగుతూ వస్తున్నాయి" అని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యం అంటే...

"ప్రజాస్వామ్యానికి ఎనిమిది లక్షణాలు ఉండాలి. అవి... భావ ప్రకటన స్వేచ్ఛ, లౌకికవాదం (సెక్యులరిజం), మత జోక్యం లేని ప్రభుత్వం, గణతంత్ర వ్యవస్థ, చట్టం ముందు అందరికీ సమానత్వం, ప్రాథమిక హక్కులు, ఓటు హక్కు’’ ఉండాలని ప్రసార భారతి మాజీ ఛైర్మన్ ఎ.సూర్య ప్రకాశ్ అన్నారు.

ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుందని ఆయన అన్నారు.

వీ-డెమ్ నివేదిక తమ సూచీలో మొదటి స్థానం ఇచ్చిన డెన్మార్క్ గురించి కూడా సూర్య ప్రకాశ్ మాట్లాడారు.

"బైబిల్ ఆధారంగా ఏర్పడిన ఇవాంజెలికల్ లూథరియన్ చర్చి డెన్మార్క్‌లో ప్రామాణికమైన చర్చిగా పరిగణించాలని, దీనికి ప్రభుత్వ మద్దతు ఉండాలని డెన్మార్క్ రాజ్యాంగం చెబుతోంది. మనదేశ రాజ్యాంగంలో మాత్రం ఉపోద్ఘాతంలోనే లౌకికవాదం ఉంది. మనకూ, వారికీ పోలికే లేదు" అని అన్నారు.

అయితే, వీ-డెమ్ నివేదికపై తనకు సందేహాలున్నాయని సూర్య ప్రకాశ్ అన్నారు.

"ప్రతి దేశంలోనూ ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. మొత్తం తప్పును మోదీ ప్రభుత్వంపై మోపుతున్నారంటే, వాళ్లకి మన రాజ్యాంగం అర్థం కాలేదనే అనుకోవాలి. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాల్లో సగం వాటిలో వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో 42 పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కూటమే! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సహా పలు దేశాల నేతలు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశంసిస్తున్నారు" సూర్య ప్రకాశ్ అన్నారు.

"భారత్‌లో తగ్గిపోతున్న ప్రజాస్వామ్య విలువలు, ముఖ్యంగా ఉదారవాదం క్షీణిస్తున్న పరిస్థితిని చాలావరకూ వీ-డెమ్ నివేదిక తెలియజేస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వతంత్రకు ముప్పు, భిన్నాభిప్రాయాలను అణచివేయడం లాంటి విషయాల్లో ప్రభుత్వ అసహనం కనిపిస్తోంది" అని అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్‌ ప్రజాస్వామ్య నిపుణులు నిరంజన్ సాహూ అన్నారు.

"భార‌త్‌లో మీడియాకు స్థానం తగ్గిపోతోందని ఈ నివేదికలో తెలిపారు. గత ఎనిమిది, పదేళ్లల్లో మన దేశంలో ఏం జరిగిందనే వీళ్లకు తెలీదు. 'రిజిస్టార్ ఆఫ్ న్యూస్ పేపర్స్' ప్రతి సంవత్సరమూ కొన్ని గణాంకాలను విడుదల చేస్తుంది. వీటి ప్రకారం 2014లో దినపత్రికల సర్క్యులేషన్ 14 కోట్లు ఉండగా, 2018కి అది 24 కోట్లకు పెరిగింది. దేశంలో ఉన్న 800 టీవీ ఛానళ్లలో 200 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఐదేళ్లల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు 15 కోట్ల నుంచీ 57 కోట్లకు పెరిగాయి. నియంతృత్వమే ఉంటే మీడియా ఇంతలా ఎలా విస్తరిస్తుంది? రోజూ టీవీ ఛానళ్లల్లో అనేకరకాల చర్చలు జరుగుతుంటాయి. ఒకరోజంతా సోషల్ మీడియాలో మోదీని దూషిస్తూ ఉన్న హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడం గమనించాను. మీడియా స్వేచ్ఛ లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి?" అని సూర్య ప్రకాశ్ అన్నారు.

"పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రవంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ట్వీట్ల ఆధారంగా అరెస్టులు జరిగాయి. కానీ దానికి మోదీ బాధ్యులు ఎలా అవుతారు? రాష్ట్రాల్లో న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని తెలీదా?" అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపమా?

"ఒకప్పుడు భారతదేశంలో ప్రభుత్వ ఒత్తిడికి లొంగని న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం ఉండేవి. వీటి పనితీరు ప్రపంచ దేశాల ప్రశంసలు పొందింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ సంస్థలన్నిటినీ ప్రభుత్వానికి అనుగుణంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్యకర్తలను, ప్రతిపక్ష నాయకులను నెలల తరబడి, బెయిల్ కూడా ఇవ్వకుండా నిర్బంధంలో ఉంచుతున్నారు. వీటన్నింటినీ చూస్తూ న్యాయ వ్యవస్థ ముఖం తిప్పుకుంటోంది. ఇలాంటి చర్యలకు జవాబుదారీతనం ఉండేలా చూసే యంత్రాంగం మాయమైపోయింది" అని నిరజంన్ సాహూ అన్నారు.

"మత రాజకీయలకు పెద్ద పీట వేశారు. సోషల్ మీడియా ద్వారా మత రాజకీయలు ఎక్కువగా నడుస్తున్నాయి. దీనివల్ల పాలక వర్గం రాజకీయ లబ్ధి పొందుతోంది. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛకు ప్రతికూలత ఏర్పడుతోంది. దేశంలో రాజకీయ వాతావరణం విషపూరితం అవుతోంది. మైనారిటీలను, ప్రతిపక్ష నాయకులను విలన్లుగానూ, దేశ ద్రోహులుగానూ చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితిపై ఇంతకుమునుపు కూడా కొన్ని నివేదికలు వచ్చాయి. వీ-డెమ్ ఒక్కటే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మరి కొన్ని సంస్థలు కూడా ఇలాంటి నివేదికలను సమర్పించాయి.

అమెరికాకు చెందిన 'ఫ్రీడం హౌస్' సంస్థ 2019 ఘటనల ఆధారంగా విడుదల చేసిన నివేదిక... ‘‘మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య విలువలు తగ్గిపోతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, భిన్నత్వానికి భంగం కలుగుతోంది. ఇలా అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కువకాలం మనుగడ సాగించలేదు’’ అని పేర్కొంది.

2017లో సివికస్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో.... ‘‘భారతదేశంలో పౌర సమాజం స్థానం క్షీణిస్తోంది. 2014లో మోదీ ప్రభుత్వం పాలనలోకి వచ్చినప్పటినుంచీ ప్రజాస్వామ్యం నాణ్యత తగ్గుతోంది. ప్రతిపక్షాల స్థానం సన్నగిల్లుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తినవారిని లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయి’’ అని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఇలాగే ఉందా?

జీ-20లోని అన్ని ప్రధాన దేశాలూ, అన్ని రంగాల్లోనూ నియంతృత్వ పోకడలను కనబరుస్తున్నాయని.. భారత్, అమెరికా, టర్కీ, బ్రెజిల్‌ వంటి దేశాలలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని వీ-డెమ్ నివేదికలో పేర్కొన్నారు.

"భారతదేశంలో కనిపిస్తున్న నియంతృత్వం, ప్రపంచంలో కొనసాగుతున్న నియంతృత్వంలో భాగమే. ప్రపంచ మార్గాన్నే భారతదేశం కూడా అనుసరిస్తోంది. ఈ ధోరణి కొనసాగితే ప్రపంచంలో 80 శాతం దేశాలు నితంతృత్వ దేశాలుగా మారే అవకాశాలున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం" అని వీ డెమ్ అధ్యక్షులు స్టాఫన్ లిండ్బర్గ్ అభిప్రాయపడ్డారు.

"దీనికి కారణం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే లోపాలున్నాయని అనుకునే అవకాశం ఉంది. అది మరింత ప్రమాదకరం. పోలాండ్, టర్కీ, భారత్, బ్రెజిల్, హంగేరీ, అమెరికా వంటి దేశాలలో నియంతృత్వ పోకడలు పెరుగుతున్నాయన్న విషయంలో సందేహం లేదు. అయితే ఈ ధోరణి గత దశాబ్దాలలో కూడా ఉందనే చెప్పాలి" అని నిరంజన్ సాహూ అభిప్రాయపడ్డారు.

‘‘నియంతలు రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యంలోని అన్ని నిబంధనలను ఉపయోగించి అధికారంలోకి వస్తారు. అధికారంలో ఎక్కువకాలం కొనసాగడానికి చట్టాన్ని దుర్వినియోగం చేస్తారు’’ అని లిండ్బర్గ్ అన్నారు.

ఇందుకు టర్కీని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్ పార్లమెంటును ఉపయోగించి రెండుసార్లు రాజ్యంగాన్ని మార్చివేశారు.

"కరోనా మహమ్మారి కాలంలో భారతదేశంలో కొన్ని ప్రజాస్వామిక విలువలు దెబ్బతిన్నాయన్నది వాస్తవమే. కొన్ని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ తప్పుదారి పట్టింది. కొన్ని అకారణ అరెస్టులు జరిగాయి. అయితే, ప్రజాస్వామ్య మూలాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేయలేదు’’ అని సూర్య ప్రకాశ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)