మహబూబాబాద్ కిడ్నాప్-హత్య: 'నా బిడ్డను కనీసం ఆఖరి చూపు చూసుకోకుండా చేశారు' -దీక్షిత్ తల్లి
మహబూబాబాద్ కి చెందిన కుసుమ రంజిత్ రెడ్డి, వసంతల పెద్ద కుమారుడు, 9 ఏళ్ళ దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి, గంటల వ్యవధిలోనే హత్య చేశారు.
ఆదివారం సాయంత్రం కిడ్నాప్ చేసి, అదే రోజు రాత్రి రంజిత్ కుటుంబ సభ్యులను 45 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. కానీ అప్పటికే బాబును చంపేశారు. ఆ విషయం దాచారు.
కిడ్నాపర్లు మామూలు ఫోన్ల నుంచి కాకుండా ఇంటర్నెట్ కాల్స్ చేస్తూండడంతో వారిని ట్రేస్ చేయడానికి వరంగల్, హైదరాబాద్ పోలీసులు మహబూబాబాద్ పోలీసులకు సహకరించారు. గురువారం మధ్యాహ్నానికే నిందితుణ్ణి గుర్తించారు పోలీసులు. అంతకు ముందు అనుమానించిన వారిని అందర్నీ వదలిపెట్టారు. గురువారమే దీక్షిత్ మృతదేహాన్ని గుర్తించారు, అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు.
మహబూబాబాద్ లో మెకానిక్ గా పనిచేసే సాగర్ అనే వ్యక్తి కేవలం డబ్బు కోసమే ఇదంతా చేసాడని పోలీసులు చెప్పారు. బాలుడిదీ, నిందితుడిదీ ఒకే గ్రామం. టౌన్లో కూడా దగ్గరదగ్గరగా ఉంటున్నారు. దీంతో కిడ్నాప్ సులువు అయింది.
దీక్షిత్ గొడవ చేయకుండా ముందే కొని పెట్టుకున్న మత్తు టాబ్లెట్ ఇచ్చాడు నిందితుడు. కానీ లేచిన తరువాత అయినా తనను గుర్తుపడతాడు అన్న ఆలోచనతో ఆ బాలుడు వేసుకున్న టీషర్టుతోనే మెడ చుట్టూ ఉరి బిగించి చంపేశాడు. తరువాత పెట్రోల్ పోసి శరీరాన్ని తగలబెట్టాడు. దాంతో బాలుడి మృతదేహం కనీసం చూడటానికీ, తాకడానికీ లేకుండా తయారయింది. ఆదివారం నుంచి గురువారం వరకూ ఆ శరీరం మహబూబాబాద్ దగ్గర్లోని గుట్టల దగ్గరే పడి ఉంది.
నిందితుడు తక్కువ చదువుకున్నా ఉచితంగా దొరికే యాప్స్ ద్వారా నెట్ కాల్స్ చేయగలిగాడు. ఫోన్లో గొంతు మార్చి మాట్లాడాడు. టౌన్లో సీసీ కెమెరాలు ఎక్కడుంటాయో తెలుసుకుని, వాటి నుంచి తప్పించుకుని వేరే రూట్లో వెళ్లాడు. బాబుకు తెలిసిన వాడే కావడంతో అడిగిన వెంటనే బండి ఎక్కాడు. ఆ బండి నంబర్ ప్లేట్ కూడా నకిలీది. దీక్షిత్ ను గుట్టల దగ్గరకు తీసుకెళ్లాక, ఆలస్యమవుతోందని తన తండ్రికి చెప్పమని బాబు ఒత్తిడి చేసే సరికి మత్తు ట్యాబ్లెట్లు వేశాడు. మత్తులో ఉండగా చంపి, ఆ తరువాత ఇంటికి వెళ్లి భోజనం చేసి, స్నానం చేసి అప్పుడు పెట్రోల్ కొనుక్కుని వెళ్లి కాల్చేశాడు. బెదిరింపుల కోసం తన మిత్రుల ఫోన్ వాడాడు. బయట మామూలుగా తిరుగతూ దీక్షిత్ తల్లితండ్రులు వేస్తోన్న ప్రతీ అడుగూ గమనించేవాడు.
చివరగా కిడ్నాపర్ చెప్పినంత సొమ్మూ, బంగారం సిద్ధం చేసిన బాలుడి తండ్రి అతను చెప్పినట్టు మహబూబాబాద్ పట్టణంలోనూ, పరిసరాల్లోని దాదాపు 10 గంటల పాటూ ఎదరు చూశారు. అక్కడ వారిని గమనించాడు నిందితుడు. అయితే భయపడి ఆ డబ్బు తీసుకోలేదు. దీంతో బాలుడి తండ్రి వెనక్కు వచ్చాడు. ఆ మరునాడే పోలీసులు నిందితుణ్ణి కనిపెట్టి, పట్టేసుకున్నారు.
ఇదంతా కేవలం ఒకరే చేశారని పోలీసులు చెబుతుండగా, తమకు కొందరిపై అనుమానాలు ఉన్నాయనీ, ఇది ఒక్కరి వల్ల కాదనీ బాలుడి తల్లితండ్రులు చెబుతున్నారు. తమ బంధువుల్లోని ఒకరిపై కూడా బాలుడి కుటుంబానికి అనుమానాలున్నాయి.
''మా అబ్బాయి చాలా తెలివైన వాడు. ముందు నుంచీ చురుగ్గా ఉండేవాడు. వాడెలా అయినా తప్పించుకు వస్తాడన్న ధైర్యం నాలో ఉండేది. కానీ చాలా ఘోరంగా చేశారు. ఏ తల్లికీ ఇలా జరగకూడదు'' అన్నారు బాలుని తల్లి వసంత.
గ్రౌండ్ రిపోర్ట్: బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి
షూట్ &ఎడిట్: నవీన్ కుమార్
ఇవి కూడా చదవండి:
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకొచ్చిన నౌకను మళ్లీ సముద్రంలోకి ఎలా పంపిస్తారంటే...
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)