అంతర్వేదిలో అడుగడుగునా పోలీసులు.. రాజుకుంటున్న రథం వివాదం

    • రచయిత, శంకర్. వి
    • హోదా, బీబీసీ కోసం

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చెందిన రథం అగ్నికి ఆహుతి అయిన ఘటన కలకలం రేపుతోంది. రాజకీయంగానూ వివాదంగా మారింది.

దీనిపై ఇప్పటికే పలు సంస్థలు ఆందోళనలు చేపడుతున్నాయి. మంగళవారం అంతర్వేది ఆలయ ప్రాంగణంలో నిరసనల హోరు కనిపించింది.

బుధవారం మరోసారి ‘చలో అంతర్వేది’కి బీజేపీ, జనసేన సహా వివిధ ధార్మిక, మత సంస్థలు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొందరు నేతలను గృహ నిర్బంధం చేశారు.

మరోవైపు.. అంతర్వేదిలో ఆలయంలోని రథం ఎలా అగ్నికి ఆహుతైందన్న అంశంపై కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువాం నాడు రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.

ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోం శాఖకు లేఖ పంపింది. దీంతో.. దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ శుక్రవారం జీవో వెలువడనుంది.

కారణాలపై పలు ఊహాగానాలు

సెప్టెంబరు 5 అర్ధరాత్రి దాటిన తరువాత అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథం మంటల్లో కాలిపోయింది.

సుదీర్ఘకాలంగా ఏటా కల్యాణోత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ఈ రథాన్ని వినియోగించేవారు.

అంతర్వేది రథోత్సవం అత్యంత ఉత్సాహంగా సాగేది. భక్తులు పవిత్రంగా భావించే ఈ రథం మంటల్లో కాలిపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.

తొలుత షార్ట్ సర్య్యూట్ అని, ఆ తర్వాత తేనె సేకరణ ప్రయత్నంలో జరిగిన ప్రమాదం అని ప్రచారం జరిగింది.

ఏదీ నిర్ధరణ కాకపోవడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు డీఐజీ, విశాఖ రేంజ్ డీఐజీతో పాటు అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

క్లూస్ టీమ్, డాగ్ స్క్యాడ్ సహాయంతో విచారణ చేపట్టారు. అనుమానితులను ప్రశ్నించారు. వారిలో అంతర్వేది ఆలయ సిబ్బంది కూడా ఉన్నారనే ప్రచారం సాగింది. కానీ పోలీసులు నిర్ధరించలేదు.

ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఇప్పటికీ నిర్ధరణకు రాలేదు. పూర్తిస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉందని చెబుతున్నారు.

కానీ సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.

నిందితులను గుర్తించాలని కోరుతూ ఆందోళన తీవ్రతరం

మరోవైపు హిందూ సంస్థలు, ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. అంతర్వేది ఆలయం వద్ద ఆందోళన చేపట్టాయి.

అదే సమయంలో ఘటనా స్థలంలో ఉన్న మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు, పినిపే విశ్వరూప్ సహా పలువురిని ఆందోళనకారులు నిలదీశారు. ఆ సమయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారుపై రాళ్లు రువ్వడంతో మంత్రులను ఆలయం లోపలికి తీసుకెళ్లి పోలీసులు భద్రత కల్పించారు.

నిరసనకారులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆలయాలకు భద్రత కల్పించాలని, రథం కాలిపోయిన కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

భజరంగదళ్ ప్రతినిధి రవికుమార్ మాట్లాడుతూ ‘‘ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. అంతర్వేది ఆలయం రథం విషయం సీరియస్‌గా తీసుకోవాలి. కారకులను కఠినంగా శిక్షించాలి. హిందూమత ఆలయాలకు అవసరమైన భద్రత ఏర్పాటు చేయాలి. ఏదయినా జరిగిన తర్వాత స్పందించడం కాదు. ఆలయాల రక్షణ కోసమే మా ఆందోళన. వెంటనే స్పందించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం’’ అన్నారు.

అన్ని కోణాల్లోనూ దర్యాప్తు

అంతర్వేది ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు అంటున్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘అంతర్వేది అగ్ని ప్రమాద సంఘటన స్థలం వద్ద డీఐజీ క్యాంప్‌ను ఏర్పాటు చేశాం. పరిసరప్రాంతాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. తగిన చర్యలు తీసుకుంటున్నాం. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఫోరెన్సిక్ శాఖ కు చెందిన నిపుణులను కూడా తీసుకొచ్చాం. సంఘటన స్థలంలో అణువణువూ నిషితంగా గుర్తిస్తున్నాం. అయినప్పటికీ కొందరు శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రయత్నించారు. అంతర్వేది పరిసరాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఇతరులు ఎవ్వరు ఈ ప్రాంతానికి రావద్దు. అపోహలు విశ్వసించవద్దు. సామరస్యంగా ఉండాలని కోరుతున్నాం. విచారణ పూర్తికాగానే అన్ని వివరాలు వెల్లడిస్తా’’మని చెప్పారు.

‘చలో అంతర్వేది’కి పిలుపు.. నాయకుల గృహ నిర్బంధం

మంగళవారం నాటి ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ‘చలో అంతర్వేది’కి పిలుపునివ్వడంతో ముందస్తు చర్యలకు దిగారు.

పలువురు సీనియర్ బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే, అమలాపురం నియోజకవర్గ అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమా సహా రాజమండ్రిలో పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగానే గృహ నిర్బంధం చేస్తున్నట్టు రాజమహేంద్రవరం ఎస్పీ షీమోజీ బాజ్‌పాయ్ బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)