కరోనావైరస్: భారతదేశం కోవిడ్‌-19 సామాజిక వ్యాప్తిని ఎందుకు ఒప్పుకోలేకపోతోంది?

    • రచయిత, వికాస్‌ పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీకి చెందిన 45 ఏళ్ల రాజేశ్‌ కుమార్‌కు జూన్‌ ప్రారంభంలో దగ్గు ప్రారంభమైంది. కొద్దిరోజులకు విపరీతమైన జ్వరం మొదలైంది. కానీ ఆయన కరోనా టెస్టుకు వెళ్లలేదు. దానికి బదులుగా ఐదు రోజులపాటు జ్వరం మాత్రలు వాడారు. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి.

కరోనా టెస్ట్‌ చేయించుకోవాలని కుటుంబ సభ్యులు రాజేశ్‌కుమార్‌పై ఒత్తిడి చేశారు. కానీ ఆయన ససేమిరా అన్నారు. తనకు కరోనా వచ్చే అవకాశమే లేదన్నది ఆయన వాదన. ఒకట్రెండుసార్లే ఇల్లు దాటి బయటకు వెళ్లానని, ఎవరినీ కలవలేదని, అనుమానితుల సమీపానికి కూడా వెళ్లలేదని, అలాంటప్పుడు కరోనా ఎలా వస్తుందన్నది ఆయన ప్రశ్న.

కరోనా లక్షణాలు కనిపించిన 8 రోజుల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దెబ్బతింది. ఆసుపత్రికి వెళ్లగా టెస్టుల్లో ఆయనకు పాజిటివ్‌ అని తేలింది. "నేను అదృష్టవశాత్తు బతికి బైటపడ్డాను. ఆసుపత్రికి వెళ్లడం ఇంకాస్త ఆలస్యమైతే నా ప్రాణాలు పోయేవి'' అన్నారాయన. కానీ తనకు వైరస్‌ ఎలా సోకిందో రాజేశ్‌ కుమార్‌ చెప్పలేక పోయారు.

భారత్‌లో ఇలాంటి కేసులు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ (సామాజిక వ్యాప్తి) జరుగుతోందనడానికి నిదర్శమని నిపుణులు అంటున్నారు.

కానీ సామాజిక వ్యాప్తి జరుగుతోందంటే ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీనికి నిర్వచనం సరిగా లేదని, ప్రతి దేశం స్థానికంగా నెలకొన్న పరిస్థితులనుబట్టి దీన్ని నిర్వచిస్తోందని వాదిస్తోంది. కేవలం కేరళ, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలు మాత్రమే తాము ఈ స్టేజ్‌లోకి ప్రవేశించామని అంగీకరించాయి.

చాలా కేసులకు మూలం కనుక్కోలేని పరిస్థితి ఉంటే దాన్ని కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌గా భావించాలని పలు దేశాలు ఒప్పుకుంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలు కూడా ఇదే మాట చెబుతున్నాయి.

ఇప్పుడు ఇండియాలో ఇదే జరుగుతోందని దిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రిలో గుండె శస్త్ర చికిత్సల విభాగానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ అంటున్నారు. దేశంలో అనేక ఆసుపత్రులకు ఇలాంటి కేసులు విపరీతంగా వస్తున్నాయని, వాటి మూలాలు కనుక్కోలేకపోతున్నారని ఆయన అంటున్నారు.

ప్రస్తుతం ఇండియాలో 12 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 29,000 మంది మరణించారు." ఈ గణాంకాలు అబద్ధాలు చెప్పవు'' అన్నారు డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌."ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం కేసుల సంఖ్యలో దూసుకుపోతోంది. మన కళ్ల ముందు కనిపిస్తున్నదాన్ని కాదని ఎలా అంటాం'' అన్నారాయన.

కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. భారతదేశం సామాజికవ్యాప్తి దశలోకి వెళ్లి పోయిందని ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన ఓ సీనియర్‌ డాక్టర్‌ ఈ మధ్య ప్రకటించారు. అయితే రెండు రోజుల తర్వాత ఐఎంఏ దాన్ని ఖండించింది. అది ఆ డాక్టర్‌ వ్యక్తిగత అభిప్రాయమని చెప్పింది. ఈ వ్యవహారం అందరిలో అనుమానాలు పెంచింది. వైద్యులు, నిపుణుల వాదనలను ప్రభుత్వం వినాలని, ఆధారాలను పరిశీలించి నిజాలు తేల్చుకోవాలని ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ షాహిద్ జమీల్‌ అన్నారు.

ఒక నెల కిందటితో పోలిస్తే ఇప్పుడు వైరస్‌ వ్యాప్తి చాలా పెరిగిందన్నది మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌వంటి రాష్ట్రాలతోపాటు పట్ణణ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగాయన్నది వాస్తవం.

చాలాచోట్ల వీటిని ఎదుర్కోడానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు. చాలాచోట్ల క్వారంటైన్‌ మీదే ఆధారపడుతున్నారు. వ్యాప్తిని అడ్డుకోవడానికి బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి మాత్రమే టెస్టులు నిర్వహిస్తున్నారు. కానీ స్థానికంగా జరుగుతున్న వ్యాప్తిని మాత్రం అడ్డుకోలేక పోతున్నారు.

అప్పటి వరకు అనుసరిస్తున్న విధానాలలో కూడా కొన్ని లోపాలున్నాయి. సరిహద్దులలో కాపలా కాయడం కూడా కష్టమే. చాలా రాష్ట్రాలలో కేసులను గుర్తించడానికి, లేదంటే టెస్టులు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు లేవు.

వైరస్‌ పెద్ద పెద్ద నగరాలకు, రాష్ట్రాలలోని కొన్ని హాట్‌స్పాట్‌లకే పరిమితమైందని, ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదని డాక్టర్‌ జమీల్‌ అన్నారు. "ఇది నిజంగా జరగడం లేదు. కోవిడ్‌-19వ్యాప్తిని చాలాచోట్ల పట్టించుకోవడం లేదు. వదిలేశారు'' అని ఆయన అన్నారు.

వైరస్‌ చాలావేగంగా వ్యాపిస్తోంది, అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వం సొంతంగా నిర్వహించిన సర్వేలో 40శాతంమందికి శ్వాస సంబంధమైన సమస్యలు ఏర్పడ్డాయని తేలింది. అయితే వైరస్‌ తమకు ఎలా సోకిందన్నది వారు చెప్పలేకపోయారని డాక్టర్‌ జమీల్‌ అన్నారు. "సామాజికవ్యాప్తి మొదలైందనడానికి తగినన్ని ఆధారాలున్నాయి'' అని ఆయన అన్నారు.

ఇది రాత్రికి రాత్రే జరిగిపోలేదని నిపుణులు అంటున్నారు. కానీ కొన్నివారాలుగా ఇది కొనసాగుతోంది. కానీ ప్రభుత్వం దీన్ని ఒప్పుకోవడం లేదు. "సామాజిక వ్యాప్తి మొదట్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు దేశమంతటికీ పాకింది. ఇది అందరికీ కనిపిస్తోంది'' అని డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ అన్నారు.

ప్రభుత్వం సామాజికవ్యాప్తిని ఎందుకు ఒప్పుకోవడం లేదు? దీనికి సంబంధించిన అధికారిక నిర్వచనాన్ని ప్రకటించకపోవడం వల్ల ఈ వైఖరికి కారణమేంటో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. సామాజికవ్యాప్తిని అంగీకరిస్తే ప్రభుత్వం తన విధాన వైఫల్యాలను ఒప్పుకున్నట్లేనన్నది ఒక భావన. అయితే సామాజికవ్యాప్తికి ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరంలేదని డాక్టర్‌ జమీల్‌ అన్నారు.

ఇండియాలాంటి జనసాంద్రత ఉన్న దేశాలలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ సర్వసాధారణమైన విషమయని డాక్టర్‌ జమీల్‌ అన్నారు. ఒప్పుకోకపోవడం వల్లే ఇబ్బందులు పెరుగుతాయని, దీనిపై అనవసరమైన చర్చ జరుగుతుందని ఆయన అన్నారు.

దీనిపై చర్చ, వాదోపవాదాల వల్ల ఉపయోగం కూడా లేదని ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న ఎపిడెమాలజిస్ట్‌ డాక్టర్‌ లలిత్‌కాంత్‌ అన్నారు. "అది సామాజికవ్యాప్తి అయినా, మరొకటైన మనం వ్యూహంలో మార్పులు చేసుకుని ముందుకు సాగాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

"ఇండియా పెద్ద దేశం. ఒక రాష్ట్రంలో ఆపగలిగినా మరో రాష్ట్రంలో ఆపలేకపోవచ్చు. స్థానిక పరిస్థితులు తెలియకుండా దీనికి నిర్వచనాలు ఇవ్వడం కుదరదు'' అని లలిత్‌కాంత్ అన్నారు. " ఇది రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తుందన్నది మాత్రం నిజం'' అన్నారాయన.

అయితే విధానాలలో, వ్యూహాలలో మార్పులు చేయడానికి దీన్నిసామాజిక వ్యాప్తిగా గుర్తించక తప్పని పరిస్థితి ఉంది.

భారీ ఎత్తున పాజిటివ్‌ కేసులు బయటపడుతున్న సమయంలో కేవలం కేసులను గుర్తించడం, క్వారంటైన్‌ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. దీనికి బదులుగా అందుతున్న డేటా ఆధారంగా భౌగోళికవ్యాప్తి ప్రాంతాలను గుర్తించడం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే ప్రభుత్వం తన విధానాలను మార్చుకునే స్థితిలో కనిపించడంలేదని డాక్టర్‌ లలిత్‌కాంత్‌ అన్నారు.

ఇప్పుడు జరుగుతున్న టెస్టింగ్‌ విధానాలు, ట్రేసింగ్‌ ప్రోటోకాల్స్‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరికొన్ని నెలలపాటు కొనసాగించాల్సి ఉంది. దీనితోపాటు ఇంకొక సమస్య భారతదేశంలో కరోనావ్యాప్తి ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉండటం. మొత్తంగా పాలసీని మార్చుకోవడానికి ఇది కూడా ఒక ఇబ్బంది.

"అయితే సామాజిక వ్యాప్తి అని అంగీకరించకపోవడానికి గల కారణాలను ప్రభుత్వం సమర్ధించుకునే స్థితిలో లేదు. ప్రభుత్వం తన దీర్ఘకాలిక వ్యూహం ఏంటో ప్రకటించాలి, లేదంటే సామాజికవ్యాప్తికి నిర్వచనాన్ని ప్రకటించాలి'' అని లలిత్‌కాంత్‌ అన్నారు. "ఎందుకంటే ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు'' అని కాంత్‌ వ్యాఖ్యనించారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)