కరోనావైరస్ వ్యాక్సీన్ తయారైతే మీ వరకు ఎలా వస్తుంది... ముందుగా ఎవరికి ఇస్తారు?

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇది ఎప్పుడు ముగుస్తుందా? అని ప్రజలు ఎదురుచూసేవారు. 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ప్రజలు అలానే నిరీక్షిస్తున్నారు. ఈ కరోనావైరస్ మహమ్మారి నుంచి ఎప్పుడు బయటపడతామా? అని వారు ఎదురుచూస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ సోకినవారి సంఖ్య 15 మిలియన్లు దాటిపోయింది. మరణాలు ఆరు లక్షలను దాటిపోయాయి. భారత్‌లోనూ కేసుల సంఖ్య 12 లక్షలను దాటిపోయింది.

అందుకే అందరూ కరోనా వ్యాక్సీన్ వైపు చూస్తున్నారు. భారత్ సహా చాలా దేశాలు దీన్ని తయారు చేయడానికి కష్టపడుతున్నాయి.

డజన్ల కొద్దీ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో పరీక్షలు రెండో దశలోకీ అడుగుపెట్టాయి.

ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సీన్ వస్తుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వ్యాక్సీన్ తయారైతే, అది ప్రపంచ నలుమూలలకూ ఎలా చేరుతుంది?

వ్యాక్సీన్ జాతీయవాదం

కరోనా మహమ్మారి ధనిక-పేద, బలవంతుడు-బలహీనుడు... ఇలా అందరిలోనూ భయాన్ని నింపింది. దీంతో వ్యాక్సీన్ జాతీయవాదంతో ఈ ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి.

కోవిడ్-19 వ్యాప్తి మొదలైన వెంటనే.. చాలా దేశాలు వ్యాక్సీన్ కోసం పరిశోధనలను మొదలుపెట్టాయి. అమెరికాలో వ్యాక్సీన్ తయారైతే.. తొలి ప్రాధాన్యం అమెరికన్లకే ఇస్తామని అమెరికా ఇప్పటికే రెండుసార్లు స్పష్టం చేసింది.

రష్యా లాంటి దేశాలు కూడా ఇలాంటి సంకేతాలనే పరోక్షంగా ఇచ్చాయి. తమ దేశంలోని ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని వ్యాక్సీన్ జాతీయవాదం లేదా వ్యాక్సీన్ నేషనలిజంగా పిలుస్తున్నారు.

2009లో హెచ్1ఎన్1 సంక్షోభం ఏర్పడినప్పుడు వ్యాక్సీన్ జాతీయవాదం ఆస్ట్రేలియాలో కనిపించింది. తమకు పూర్తిగా సరఫరా చేసిన తర్వాతే అమెరికాకు వ్యాక్సీన్లు ఇవ్వాలని బయోటెక్ సంస్థ సీఎస్‌ఎల్‌కు ఆస్ట్రేలియా ఆదేశాలు జారీచేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో వెనుకపడిన, పేద దేశాలతోపాటు వ్యాక్సీన్ పరీక్షలు జరుగుతున్న దేశాల్లోనూ ఆందోళనలు ఎక్కువవుతున్నాయి.

వ్యాక్సీన్ విషయంలో భారత్ నిశ్చింతగా కూర్చోకూడదని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ డైరెక్టర్ జనరల్ ఎన్‌కే గంగూలీ అన్నారు.

మనకు ఇక్కడ అంత మంచి వ్యాక్సీన్ తయారు కాకపోవచ్చు. ఇక్కడ హోల్‌సేల్ వ్యాక్సీన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మనకు ఇంకా చాలా విషయాలు తెలియకపోవచ్చు. వ్యాక్సీన్ సరిగా తయారు కాకపోతే.. మనం వేరే దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీని కోసం మనం ముందే సిద్ధపడి ఉండాలి. ఏ దేశంలో వ్యాక్సీన్ తయారవుతుందో వారు ఇతరులకు ఇవ్వడానికీ సుముఖత వ్యక్తం చేయకపోవచ్చని ఆయన వివరించారు.

ఈ విషయంపై ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రస్ అఢోనమ్ ఆందోళన వ్యక్తంచేశారు.

"వ్యాక్సీన్ తయారు చేయడం నిజంగా గొప్ప విషయం. దీని కోసం చాలా కృషి జరగడం చాలా మంచిది. అయితే కొన్ని దేశాలు పరిశోధనలు చేయలేకపోతున్నాయి. వ్యాక్సీన్‌పై సరైన అవగాహనా ఒప్పందాలే లేకపోతే.. డబ్బులులేని, పేద దేశాలు చాలా నష్టపోవాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు.

వ్యాక్సీన్ తయారుచేసిన వారికి సరఫరాపై హక్కులు ఎంత వరకూ ఉంటాయనేది అతి పెద్ద ప్రశ్న.

గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రకారం.. తయారీదారులకు డిజైన్‌పై 14 సంవత్సరాలు, పేటెంట్‌పై 20 సంవత్సరాలు హక్కులుంటాయి.

కరోనావైరస్ లాంటి అనుకోని ఉపద్రవం వచ్చి పడినప్పుడు కంపల్సరీ లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అంటే ఇతర సంస్థలు కూడా ఈ వ్యాక్సీన్‌ను తయారు చేసేందుకు అనుమతులు ఇవ్వడం.

అంటే, కరోనాతో సతమతం అవుతున్న దేశం తమ దేశంలోని కొన్ని ఫార్మా సంస్థలకు వ్యాక్సీన్ తయారీ అనుమతులు జారీ చేయగలవన్న మాట.

అన్ని దేశాలకూ వ్యాక్సీన్ అందేలా చూసేందుకు ఒక పేటెంట్ లైసెన్సింగ్ బ్యాంకు ఏర్పాటుచేసే అంశాన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరోపా సమాఖ్య పరిశీలిస్తున్నాయి.

అయితే ఇప్పటివరకూ అలాంటి ఒప్పందమేమీ కుదరలేదు. అయితే ఇది అతిపెద్ద సవాల్‌గా మారే అవకాశముంది.

శక్తిమంతమైన వ్యాక్సీన్ తయారైతే...2021నాటికి రెండు బిలియన్ల మందికి దాన్ని అందించాల్సి ఉంటుంది. వీటిలో 50 శాతం వ్యాక్సీన్లు.. అల్ప, మధ్య ఆదాయ దేశాలకు ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే, దీని కోసం దేశాలు ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రజలకు సమర్థంగా టీకాలు చేర్చే మార్గం లభిస్తుంది. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేతర్‌పాల్ సింగ్ అన్నారు.

ఒకవేళ వ్యాక్సీన్ తయారైనా ప్రజల కష్టాలు రాత్రికి రాత్రే తీరవని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది.

వ్యాక్సీన్ తయారైన తర్వాత చాలా దశలు దాటుకు రావాల్సి ఉంటుంది. వీటిలో అన్నింటికంటే కీలకమైనది సాధారణ పౌరులకు దీన్ని చేర్చడం.

శక్తిమంతమైన వ్యాక్సీన్‌ను తయారుచేసేందుకు ఫార్మా సంస్థలు, ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రజల్లో ఎవరికి ముందు వ్యాక్సీన్‌ను ఇస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది.

కరోనా రోగుల తర్వాత తొలి ప్రాధాన్యం ఆరోగ్య సిబ్బంది, పిల్లలు, పెద్దలు, గర్భిణులకు ఉంటుంది.

ఆరోగ్య వ్యవస్థ ఎంత బలంగా ఉందో లేదా బలహీనంగా ఉందో.. వ్యాక్సీన్ చేరవేసే ప్రక్రియలో తెలుస్తుందని ఎంఎస్‌ఎఫ్ యాక్సెస్ అభియాన్ దక్షిణాసియా అధిపతి, ఔషధ నిపుణురాలు లీనా మేంఘానీ చెప్పారు.

"న్యుమోనియా వ్యాక్సీన్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. భారత్‌లో ఇప్పటికీ ఇది కేవలం 20 శాతం పిల్లలకే చేరుతోంది. దీనికి కారణం ధర అధికంగా ఉండటమే. ప్రతి చిన్నారి కోసం పది డాలర్లు వెచ్చించి గ్లోబల్ వ్యాక్సీన్ అలయన్స్ నుంచి భారత్ ఈ వ్యాక్సీన్ కొంటోంది. ఆరోగ్య వ్యవస్థతోపాటు వ్యాక్సీన్‌ల ఖర్చుకూ సిద్ధంగా ఉండాలి" అని ఆమె వివరించారు.

కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పుడు.. అన్ని దేశాలు కలిసి పోరాడదామని అంగీకరించాయి. అయితే వ్యాక్సీన్ పరిశోధనలు ముందుకు వెళ్లేకొద్దీ.. విభేదాలు పెరుగుతున్నాయి.

ప్రభుత్వాల మధ్య విభేదాలను అంతర్జాతీయంగా పరిష్కరించుకోవాలి. అయితే 125 కోట్ల జనాభా గల భారత్ లాంటి దేశానికి ఇది మరింత కష్టమైన పని.

''ఇప్పుడు నా దగ్గర వ్యాక్సీన్ ఉంటే, చాలా భయపడాల్సి వస్తుంది. నిద్ర కూడా పట్టదు. భారత్‌లో అందరికీ వ్యాక్సీన్ చేరవేయడం ఎప్పుడూ కష్టమైన పనే. మన దగ్గర ఫెడరల్ వ్యవస్థ ఉంది. అన్ని రాష్ట్రాలకూ వ్యాక్సీన్ కావాలి. ఏ రాష్ట్రాలకు ఆలస్యంగా చేరుతుందో, వారు సామాజిక బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటారు అని ప్రొఫెసర్ గంగూలీ అన్నారు.

వ్యాక్సీన్ అందరికీ ఎలా చేరవేయాలనే అంశంపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వివరించారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)