You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘బాబ్రీ మసీదు కూల్చివేత’ కేసు: అడ్వాణీ వాంగ్మూలంపైనే అందరి దృష్టి
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి వాంగ్మూలం సమర్పించారు.
లఖ్‌నవూ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. మురళీ మనోహార్ జోషికి ఇప్పుడు 86 ఏళ్లు.
మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీ కూడా శుక్రవారం ఈ కేసులో కోర్టుకు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అడ్వాణీకి ఇప్పుడు 92 ఏళ్లు.
1992, డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసు ఇది. ఆగస్టు 31లోగా ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇవ్వాల్సి ఉంది.
సుప్రీం కోర్టు సూచన మేరకు ఈ కేసులో రోజువారీగా విచారణ జరుగుతోంది.
భూమి పూజపై రాజకీయాలు
మరోవైపు ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
రామమందిర ఉద్యమంతో సంబంధమున్న నాయకులు, సాధువులను ఈ కార్యక్రమం కోసం పిలుస్తారని... ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతోపాటు అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, రాజ్‌నాథ్ సింగ్, ఉమా భారతి, కల్యాణ్ సింగ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లను కార్యక్రమానికి ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే, రామమందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం చుట్టూ రాజకీయాలూ మొదలయ్యాయి.
కరోనావైరస్ మహమ్మారిని అంతం చేసేందుకు మందిర నిర్మాణం ఉపయోగపడుతుందని కొందరు భ్రమపడుతున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
పరోక్షంగా ప్రధాని మోదీని ఆయన ఎద్దేవా చేశారు.
అయితే శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని, శ్రీరాముడికి వ్యతిరేకమని కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి స్పందించారు.
బాబ్రీ కూల్చివేత కేసులో ఉమా భారతి కూడా జులై 2న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.
ఈ కేసులో కోర్టుకు వాంగ్మూలం ఇచ్చినవారిలో ఆమె 19వ వ్యక్తి.
బాబ్రీ కూల్చివేత సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్... ప్రతీకార రాజకీయాల్లో భాగంగా తనపై తప్పుడు ఆరోపణలు మోపిందని ఉమా భారతి కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో కోర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది వాంగ్మూలాలు సేకరించింది.
బాబ్రీ కూల్చివేత విషయంలో రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గుర్తు తెలియని కరసేవకులపై ఓ కేసు, అడ్వాణీ సహా ఎనిమిది మంది పెద్ద నేతలకు వ్యతిరేకంగా మరో కేసు నమోదయ్యాయి.
అడ్వాణీ సహా ఇతర నేతలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు మోపారు.
ఈ రెండు కేసులు కాకుండా.. జర్నలిస్టులపై దాడులు, దోపిడీ లాంటి ఘటనలకు సంబంధించి మరో 47 కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించారు.
సీబీఐ రెండు కేసులకు సంయుక్తంగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
వీటిపై విచారణ కోసం హైకోర్టు సూచన మేరకు లఖ్‌నవూలో ఓ ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది.
మిగతా కేసుల విచారణ మాత్రం రాయ్‌బరేలీలో సాగుతూ వచ్చింది.
అభియోగాల నమోదు కోసం ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఇస్తూ... కేసులన్నీ ఒకే ఘటనకు సంబంధించినవి కాబట్టి కేసులను సంయుక్తంగా చేపట్టేందుకు అవసరమైన పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించింది. కానీ, అడ్వానీ, ఇతర నిందితులు ఈ ఆదేశాన్ని హైకోర్టులో సవాలు చేశారు.
కేసులపై సంయుక్త చార్జ్ షీట్ దాఖలు చేయడం సబబేనని, కానీ ఎనిమిది మంది నేతలను నిందితులుగా పేర్కొన్న రెండో కేసును విచారించే అధికారం లఖ్‌నవూ ప్రత్యేక న్యాయస్థానానికి లేదని 2001, ఫిబ్రవరి 12న హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటుకు జారీ చేసిన నోటిఫికేషన్‌లో సదరు కేసు నంబర్ లేదని పేర్కొంది.
న్యాయపరమైన సవాళ్లు, సాంకేతిక కారణాలతో ఈ వ్యవహారం సాగుతూ వచ్చింది.
‘‘అడ్వాణీ, ఇతర సీనియర్ నాయకులు హైకోర్టులో అప్పీలు చేశారు. కోర్టు సాంకేతిక కారణాలను ప్రస్తావిస్తూ నేరపూరిత కుట్ర కేసును రాయ్‌బరేలీ కోర్టుకు బదిలీ చేసింది.
కానీ, ఆ తర్వాత సుప్రీం కోర్టు రాయ్‌బరేలీలో నడుస్తున్న కేసును బాబ్రీ కూల్చివేత కేసుతో కలిపింది. ఇప్పుడు మళ్లీ సంయుక్త విచారణ లఖ్‌నవూలోని ప్రత్యేక న్యాయస్థానంలోనే నడుస్తోంది. ఈ కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి పదవీకాలాన్ని సుప్రీం కోర్టు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుల్లో తీర్పు వెల్లడించాకే, ఆ న్యాయమూర్తి పదవీవిరమణ చేస్తారని స్పష్టం చేసింది’’ అని సీనియర్ జర్నలిస్ట్ రామదత్త్ త్రిపాఠి అన్నారు.
బాబ్రీ కూల్చివేతకు సంబంధించిన కేసుల్లో విచారణలు పూర్తి చేసి, ఆగస్టు 31లోగా తీర్పు వెల్లడించాలని ప్రత్యేక కోర్టుకు సుప్రీం కోర్టు గడువు నిర్దేశించింది.
విచారణలు నిర్ణీత సమయంలో పూర్తయ్యేందుకు వీలుగా చట్ట ప్రకారం కోర్టు కార్యకలాపాలను నియంత్రించాలని ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎస్‌కే యాదవ్‌కు సూచించింది.
ఇవి కూడా చదవండి:
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- ‘చైనా నుంచి అమెరికాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది’: ఎఫ్‌బీఐ డైరెక్టర్
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- వికాస్ దుబే ఎన్కౌంటర్, దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్.. రెండిటి మధ్య తేడా ఏమిటి?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు... అంతా సినిమా స్క్రిప్టులా ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)