You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అయోధ్యలో ఆకాశాన్నంటే రామాలయం.. నాలుగు నెలల్లో నిర్మాణం: అమిత్ షా - ప్రెస్ రివ్యూ
నాలుగు నెలల్లో అయోధ్యలో ఆకాశాన్ని తాకేంత ఎత్తయిన రామ మందిర నిర్మాణం జరుగుతుందని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపినట్లు 'ఈనాడు' ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం, సోమవారం జార్ఖండ్‌లోని పాకుర్‌లో జరిగిన ఎన్నికల సభలో అమిత్ షా మాట్లాడుతూ, రామజన్మభూమిలో బ్రహ్మాండమైన రామాలయ నిర్మాణం జరగాలన్నది భారతీయుల కోరిక అని అన్నారు.
దాదాపు వందేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా కోరుకుంటున్న ఆలయం అక్కడ వెలుస్తుందన్నారు.
''కాంగ్రెస్ ఏనాడూ దేశాన్ని అభివృద్ధి చేయలేదు, సరిహద్దులను కట్టుదిట్టం చేయలేదు, ప్రజల విశ్వాసాలను అసలు పట్టించుకోలేదు'' అని ఆయన విమర్శించారు.
లోక్‌సభ సీట్లు 1000కి పెంచాలి: ప్రణబ్ ముఖర్జీ
భారత్‌లోని జనాభాను పరిగణనలోకి తీసుకుంటే పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించినట్లు 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.
లోక్‌సభ సీట్లను ప్రస్తుతమున్న 543 నుంచి 1000కి, అదే శాతంలో రాజ్యసభ సీట్లను పెంచాలని ప్రణబ్ సూచించారు.
'భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతమైందా? ముందున్న సవాళ్లేంటి?' అనే అంశంపై ఇండియా ఫౌండేషన్ సోమవారం ప్రణబ్‌తో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసాన్ని ఏర్పాటు చేసింది.
చట్టసభలో ఒక్కో సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జనాభా సంఖ్యలోనూ ప్రస్తుతం చాలా తేడా ఉందని ఆయన అన్నారు. ఒక్కో లోక్‌సభ సభ్యుడు 16 నుంచి 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అంతమందికి ఒక్క సభ్యుడు ఎలా అందుబాటులో ఉండగలరని ప్రశ్నించారు.
''1971 జనాభా లెక్కల ఆధారంగా చివరగా 1977లో లోక్‌సభ సభ్యుల సంఖ్యను సవరించాం. అప్పటి జనాభా 55 కోట్లు. ప్రస్తుత జనాభా అందుకు రెండింతలు. అందువల్ల లోక్‌సభ సభ్యుల సంఖ్యను కూడా కనీసం 1000 చేయాలి'' అన్నారు.
జైల్లో పెట్టినా కేంద్రానికి లొంగను... ఎన్‌ఆర్‌సీ, సీఏఏలను బెంగాల్‌లో అమలు చేయను: మమతా బెనర్జీ
''నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఎన్‌ఆర్‌సీ, సీఏఏలను రాష్ట్రంలో అమలు చేయబోను. మీరు కావాలనుకుంటే మా ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవచ్చు. నన్ను జైల్లో పెట్టినా సరే కేంద్రానికి లొంగేది లేదు. ఈ చట్టాలను రద్దు చేసేంత వరకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కొనసాగిస్తా'' అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నట్లు 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా సోమవారం ఆమె నేతృతంలో కోల్‌కతాలో భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మమత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఎన్నార్సీపై గళమెత్తినప్పుడు తాము ఒంటరిగా ఉన్నామని, ఇప్పుడు దిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కేరళ వంటి ఇతర రాష్ర్టాల సీఎంలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని మమత చెప్పారు. దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై పోలీసుల దాడిని మమత ఖండించారు.
మరోవైపు, సీఎం మమతా బెనర్జీ ర్యాలీకి నేతృత్వం వహించి అందులో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని బెంగాల్ గవర్నర్ జగదీప ధనకర్ విమర్శించారు. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులను చక్కదిద్దాల్సిన సీఎం దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇక నుంచి నెఫ్ట్ ద్వారా 24×7 నగదు బదిలీ
ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ నుంచి ప్రయివేటు దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వరకు అన్ని బ్యాంకుల్లో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్‌ఈఎఫ్‌టీ) ట్రాన్సాక్షన్స్ డిసెంబర్ 16వ తేదీ నుంచి 24×7 అందుబాటులోకి వచ్చాయని 'వార్త' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ సహా అన్ని కమర్షియల్ బ్యాంకుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల.. ఏ సమయంలోనైనా నెఫ్ట్ ట్రాన్స్‌ఫర్ ఉపయోగించుకోవచ్చు. సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
కస్టమర్లకు ఏడాదిలో ప్రతి సమయంలోను అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెసులుబాటు కల్పించింది. ఎన్‌ఈఎఫ్‌టీ ట్రాన్సాక్షన్ టైమింగ్స్ ఇదివరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఉంది. ఇప్పుడు ఏ సమయంలోనైనా నెఫ్ట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అంటే కస్టమర్లు పేమెంట్ చేసుకోవడానికి ఎంతో వెసులుబాటు దొరికినట్లే.
అలాగే, ఇప్పటి వరకు కేవలం బ్యాంకులు పని చేసే రోజునే అందుబాటులో ఉండగా.. ఇప్పటి నుంచి ప్రతి రోజు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటుంది. సెలవు దినాల్లో, పండుగ సమయాల్లో బ్యాంకులు తెరిచే వరకు వేచి ఉండకుండా ఇప్పుడు అత్యవసర బదలీ సౌకర్యం ఉంది.
ఇవి కూడా చదవండి:
- భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం... ఈ లోయ లోతు 11,500 అడుగులు
- యూఎస్బీ కండోమ్ అంటే ఏమిటో తెలుసా?
- సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- అభిప్రాయం: భారతదేశం ఆర్థిక మాంద్యానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉందా?
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ: ‘అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి..’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)