బంగారం రుణాలు: కరోనావైరస్ ఆర్థిక సంక్షోభంలో ఆశాకిరణాలు

    • రచయిత, నిధి రాయ్
    • హోదా, బీబీసీ బిజినెస్ రిపోర్టర్, ముంబై

బంగారం పట్ల భారతీయులు చాలా మందికి భావోద్వేగపరమైన విలువ ఉంటుంది. బంగారం అమ్మటానికి ఇష్టపడరు. డబ్బులు అవసరమైనపుడు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవటానికే ఎప్పుడూ ప్రాధాన్యం చూపుతారు.

మన దేశంలో జనం కష్ట సమయాల్లో బంగారాన్ని ఒక ఆస్తిగా వాడుకోవటానికే మొగ్గు చూపుతారు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా బంగారాన్ని మంచి తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు.

కరోనావైరస్ సంక్షోభ సమయంలో బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తోంటే.. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత ఎక్కువగా రుణాలు ఇస్తూ వాటిపై వడ్డీలు ఆర్జిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా చాలా మంది చిన్న వ్యాపారాల యజమానులు, రైతులు, వ్యాపారస్తులు.. మార్చి చివరి వారంలో మొదలైన కోవిడ్-19 లాక్‌డౌన్ దెబ్బతో భారీగా నష్టాల పాలవటంతో.. కష్టాలను గట్టెక్కటానికి బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్నారు.

దక్షిణ ముంబైలోని వర్లీ ప్రాంతంలో అమితా ప్రశాంత్ ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. ఆమె తన రెండు బంగారు నెక్లెస్‌లు, నాలుగు బంగారు గాజులు తాకట్టు పెట్టి మూడు లక్షల రూపాయలు అప్పుతీసుకున్నారు.

''నా పార్లర్ మార్చి నుంచి మూడు నెలల పాటు మూతపడింది. అందులోని సిబ్బందికి జీతాలు చెల్లించాలి. ఇల్లు గడపాలి. అందుకు డబ్బులు కావాలి. బంగారం తాకట్టు పెట్టి అప్పు తేవటమే నాకున్న ఉత్తమ మార్గం'' అని ఆమె చెప్పారు.

అమితకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆమె 2005 నుంచి బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. ఇద్దరు మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు.

''వాళ్లిద్దరికీ ఒక్కొక్కరికి నెలకు పది వేల రూపాయలు జీం ఇస్తాను. పార్లర్ మూతపడినా వారి జీతాలు ఆపలేదు. నేను దాచుకున్న డబ్బుల నుంచి వారి జీతాలు చెల్లిస్తున్నాను'' అని ఆమె తెలిపారు.

ఆమె ఏడుగురు సభ్యులున్న ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నారు. తన అత్తగారి వైద్య ఖర్చులు కూడా చూసుకుంటున్నారు.

''మామూలు సమయంలో నెలకు రూ. లక్ష వరకూ ఆదాయం వచ్చేది. వ్యాపారం నిజంగా చాలా బాగా సాగేది. కానీ ఈ వైరస్‌తో అంతా తలకిందులైంది'' అంటారామె.

ఆమెకు సొంతంగా ఒక ఇల్లు, షాపు ఉంది. అది తన అదృష్టంగా భావిస్తారు. అమిత భర్త ముంబైలోని విమానాశ్రయంలో పనిచేస్తారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా విధులు లేవు. నెలకు సగం జీతమే ఇస్తున్నారు. విమానయానం వ్యాపారం మీద లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం చూపుతుండటంతో.. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు.

''దేవుడి దయవల్ల నా భర్తకు సగం జీతమైనా వస్తోంది. అంతవరకూ కొంత వెసులుబాటు ఉంది'' అని చెప్పారు అమిత.

ముంబై సమీపంలోని పుణె నగరంలో నివసించే దిశా దినేష్ పారబ్‌దీ ఇదే కథ.

''నేను గత పదేళ్లుగా టిఫిన్ బిజినెస్ చేస్తున్నాను. రోజుకు 40-50 టిఫిన్లు ఇచ్చేదాన్ని. ఒక్కో టిఫిన్ ధర రూ. 80. ఇప్పుడు టిఫిన్ ధరను 60 రూపాయలకు తగ్గించాను. రోజుకు 10-15 టిఫిన్లు మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. ఇది సముద్రమంత నా ఆదాయంలో ఒక చుక్క మాత్రమే'' అని ఆమె వివరించారు.

''భవన నిర్మాణాల్లో పనిచేసే కార్మికులకు కూడా నేను టిఫన్ అమ్మేదాన్ని. ఇప్పుడు వాళ్లందరూ వెళ్లిపోయారు. నా టిఫిన్ వ్యాపారానికి డిమాండ్ లేదు'' అని తెలిపారు.

దిశకు ఇద్దరు కొడుకులు. చదువుకుంటున్నారు. ఆమె భర్త నిర్మాణ రంగ వ్యాపారంలో ఉన్నారు.

లాక్‌డౌన్ కారణంగా ఆమె భర్తకు ఇప్పుడు ఉద్యోగం లేదు. వీరికి రోడ్డు పక్కన ఒక షాపు ఉంది. దానిని నెలకు రూ. 1500 అద్దెకు ఇచ్చేవాళ్లు. ఆ ఆదాయం కూడా ఆగిపోయింది. లాక్‌డౌన్ కారణంగా ఆ షాపును అద్దెకు తీసుకునేవాళ్లెవరూ లేరు.

ఆదాయ వనరులన్నీ అడుగంటటంతో.. స్థానిక కోఆపరేటివ్ బ్యాంకులో బంగారం మీద రుణం తీసుకోవాలని దిశ నిర్ణయించుకున్నారు.

నాలుగు బంగారు గాజులు, ఒక ముక్కుపుడక, ఇంకో చిన్న ఆభరణం తాకట్టు పెట్టి రెండున్నర లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు.

''మధ్య తరగతి తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రభుత్వం పేదలకు సాయం చేస్తుంది. సంపన్నుల దగ్గర డబ్బులకు కొదవ ఉండదు. మేం సాయం కోసం అడుక్కోవటం కూడా చేయలేం. మాకు మరో దారేదీ లేదు. సత్వరమే డబ్బులు అందే మార్గం బంగారం మీద అప్పు'' అని దిశ పేర్కొన్నారు.

రుతుపవనాలు మొదలవటంతో కొందరు రైతులు కూడా వ్యవసాయం మొదలుపెట్టటానికి రుణాలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన హోసీలాల్ మాళవీయ అటువంటి రైతుల్లో ఒకరు.

పొలాల్లో నాట్లు వేయటం కోసం మాళవీయ బంగారం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు.

ఆయన వాతావరణ పరిస్థితులను బట్టి సోయాబీన్, శనగలు, పత్తి సాగుచేస్తారు. ఆయన నలుగురు సభ్యుల కుటుంబాన్ని పోషించాలి.

ఈ వైరస్ వ్యాప్తితో లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచీ మండి (హోల్‌సేల్ మార్కెట్) మూతపడిందని ఆయన చెప్పారు. దానివల్ల.. పండించిన పంటను ఏది అమ్మాలన్నా కష్టమేనని.. నిల్వచేయటానికి గోదాములూ లేవని తెలిపారు.

''పొలంలో కనీస పనులు సాగాలన్నా డబ్బులు కావాలి. అందుకు బంగారం మీద అప్పు తీసుకోవటమే మంచిదని అనిపించింది'' అని చెప్పారాయన.

''బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలని ప్రయత్నించాం. కానీ వాళ్లు లెక్కలేనని ప్రశ్నలు అడిగారు. అప్పు ఇవ్వటానికి సుముఖంగా లేరు. కానీ స్థానిక కోఆపరేటివ్ బ్యాంకులు సాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాయి'' అని చెప్పారు.

బ్యాంకు రుణాలు పొందటం ఇప్పుడు కష్టం...

ఆర్థికవ్యవస్థలో మాంద్యం, వైరస్ విజృంభణ కారణంగా.. అప్పులు ఇవ్వటంలో బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

బ్యాంకులు అప్పులు ఇచ్చే వేగం గత ఆర్థిక సంవత్సరంలో 6.14 శాతంగా ఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో అమాంతంగా 1 శాతానికి పడిపోతుందని దేశీయ రేటింగ్ సంస్థ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది.

అదే సమయంలో, ఈ ఏడాది బంగారం మీద రుణాలు 10-15 శాతం పెరుగుతాయని తాము భావిస్తున్నట్లు మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ వి.పి.నందకుమార్ చెప్పారు.

''బంగారం ధరలు ఇంకా ఎక్కువ కాలం పాటు అధికంగా ఉంటాయని జనం భావించినపుడు.. ఉన్న బంగారాన్ని మొత్తంగా అమ్మటానికి బదులుగా మరింత ఎక్కువగా రుణాలు తీసుకుంటారని మేం భావిస్తున్నాం'' అని ఆయన పేర్కొన్నారు.

మరో ప్రైవేటు రుణ సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్.. 2020 మే నెలలో రూ. 700 కోట్లకు పైగా బంగారం రుణాలు ఇచ్చింది. ఇది ప్రస్తుతమున్న బంగారం రుణాలకన్నా 15 శాతం అధికం.

ఫెడరల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకుల్లో సైతం కూడా బంగారం రుణాలకు పది రెట్లు డిమాండ్ పెరిగింది. ఇది కూడా ప్రధానంగా చిన్న నగరాలు, పట్టణాల్లోనే ఎక్కువగా ఉంది.

పెరుగుతున్న బంగారం ధరలతో ఇరువురికీ లాభం

బంగారం ధరలు ఎక్కువగా ఉండటం వల్ల అప్పు తీసుకునే వారికి ఎక్కువ మొత్తంలో రుణాలు లభిస్తున్నాయి.

అసోసియేషన్ ఆఫ్ గోల్డ్ లోన్ కంపెనీస్ సమాచారం ప్రకారం.. బంగారం మీద ఇచ్చే రుణం విలువ (లోన్ టు వాల్యూ - ఎల్‌టీవీ) మార్చి నుంచి 11.3 శాతం పెరిగింది.

ఈ ఏడాది మార్చి 24న ఈ ఎల్‌టీవీ ఒక గ్రాము బంగారానికి రూ. 2,875గా ఉంటే.. జూన్ 10వ తేదీన అది రూ. 3,197గా ఉంది.

స్థూలంగా చెప్తే.. ప్రస్తుత బంగారం ధరలో 75 శాతం విలువను అప్పుగా పొందవచ్చు.

ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 50,000 దాకా పలుకుతోంది.

బంగారం ధరలు పెరుగుతుండటంతో, రుణగ్రహీతలు అప్పటికే తాకట్టు పెట్టిన బంగారం మీద టాప్-అప్‌గా ఎక్కువ మొత్తం అప్పు తీసుకుంటున్నారు.

''బంగారం ధరలు ఎక్కువగా ఉండటం రుణగ్రహీతలు, రుణాలు ఇచ్చేవారు ఇద్దరినీ సంతోషపరుస్తాయి. రుణగ్రహీతకు తాకట్టు విలువ 20 శాతం పెరుగుతుంది. అప్పులు ఇచ్చేవాళ్లు బంగారం మీద ఇవ్వటానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాటిమీద నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి'' అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారతదేశ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పి.ఆర్. బీబీసీతో పేర్కొన్నారు.

ఆర్థిక కష్టాల్లో కాంతిరేఖ...

కరోనా మహమ్మారి కారణంగా పలు ప్రపంచ ఆర్థికవ్యవస్థలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) భారీగా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.

అదేసమయంలో.. మార్కెట్ ధర పెరుగుతున్న ఏకైక లోహం బంగారం. దీనికి ఆర్థికవ్యవస్థతో సంబంధం లేదు.

బ్యాంకులు పర్సనల్, బిజినెస్, హోం లోన్లు ఇవ్వటంలో అనేక జాగ్రత్తలు పాటిస్తున్నాయి. ఎందుకంటే వాటిమీద ఇప్పటికే చెల్లింపులు సక్రమంగా లేని రుణాల భారం వాటిమీద పెరిగిపోతోంది.

ఈ విషయంలో ఎన్‌బీఎఫ్‌సీల పరిస్థితి మెరుగుగా ఉంది. ఇందుకు కారణం అవి బంగారం రుణాల మీద ఎక్కువగా ఆధారపడ్డాయి. బ్యాంకులకు ఉండే సవాళ్లు వీటికి ఉండవు.

పెరుగుతున్న బంగారం ధరలు.. అప్పులు ఇచ్చే వారికి అసవరమైన వెసులుబాటును అందిస్తున్నాయి. బంగారం మంచి తాకట్టు సెక్యూరిటీ కావటమే దీనికి కారణం. ఒకవేళ ఎవరైనా అప్పు తిరిగి చెల్లించకపోతే.. ఆ నష్టం భర్తీ చేసుకోవటానికి తగిన సెక్యూరిటీ ఈ సంస్థలకు ఉంటుంది.

గత చరిత్రను చూస్తే.. బంగారం రుణాలు తిరిగి చెల్లించకపోవటం చాలా తక్కువగానే ఉంది. అందుకు.. రుణగ్రహీతకు తన బంగారానికి ఇచ్చే భావేద్వేగ విలువ ప్రధాన కారణం. ఎక్కువమంది అప్పులు చెల్లించి తమ బంగారాన్ని తాను తీసుకోవటానికే ప్రాధాన్యం ఇస్తారు.

అలాగే, తాకట్టు పెట్టిన బంగారం విలువ.. దాని మీద ఇచ్చిన అప్పుకన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పులు ఇచ్చేవారు కూడా సంతోషంగానే ఇస్తారు.

మొత్తంమీద ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బంగారం రుణాలు అప్పులు ఇచ్చేవారికీ, తీసుకునేవారికీ కాంతిరేఖలుగా కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)