వందే భారత్ మిషన్ విమానాల కొరత.. విదేశాల్లోని కార్మికులు ఇంటికి రావాలంటే చార్టర్డ్ విమానాలు ఎక్కాల్సిందేనా? - ప్రెస్ రివ్యూ

కరోనావైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభంతో కంపెనీలు మూతపడి నెలల తరబడి వేతనాలు లేక అవస్థలు పడుతున్న కార్మికులు ఇంటికి చేరుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. షెడ్యూల్ ప్రకారం నడిచే పౌర విమానాలకు అనుమతి లేకపోవడంతో చార్టర్డ్ విమానాలే దిక్కవుతున్నాయి. లాక్ డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే. ప్రస్తుత పరిస్థితుల్లో కువైట్ లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో తమను స్వదేశానికి పంపించాలని వేలాది మంది కార్మికులు కువైట్ లోని భారత విదేశాంగ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వందే భారత్ మిషన్ కు సంబంధించిన విమానాలు ఆశించిన సంఖ్యలో లేవు. సాధారణ విమానాలకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలు చార్టర్డ్ విమానాలను నడపడానికి సిద్ధమయ్యాయి. సాధారణ విమానాల్లో ప్రయాణించడానికి ఒక్కో ప్రయాణికుడికి రూ. 12 వేల నుంచి రూ. 15 వేల చార్జీ అవుతుంది. చార్టర్డ్ విమానాల్లో టికెట్ ధర ఐదు రెట్లు ఎక్కువ. ఒక్కో కార్మికుడు టికెట్ కోసం రూ. 60 వేల నుంచి రూ. 70 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇంత భారీ మొత్తంలో చార్జీలు భరించి ఇంటికి రావడానికి కార్మికులు వెనకడుగు వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు.

''కువైట్ నుంచి శంషాబాద్ కు చార్టర్డ్ విమానాలు నడుపుతామని విమానయాన సంస్థలు ప్రకటించాయి. కానీ, టికెట్ ధర ఎక్కువగా ఉండటంతో ప్రయాణించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. షెడ్యూల్ ప్రకారం నడిచే విమానాలకు అనుమతి ఇవ్వాలి'' అని కువైట్ లో ఉంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి రవీందర్ రెడ్డి చెప్పారని సాక్షి పేర్కొంది.

తెలంగాణలో ప్రభుత్వ ఆఫీసుల్లో 50 శాతం ఉద్యోగులతోనే పని

జూన్ 22వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వ ఆఫీసుల్లో 50 శాతం ఉద్యోగులతోనే కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది. 50 శాతం ఉద్యోగులు ఒక రోజు ఆఫీసుకు వ‌స్తే, మిగ‌తా 50 శాతం ఉద్యోగులు మ‌రో రోజు వ‌చ్చే వెసులుబాటు క‌ల్పించింది అని వెలుగు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను శ‌నివారం జారీ చేసింది.

నాల్గో తరగతి సిబ్బంది, క్లర్క్స్‌, సర్క్యులేట్‌ ఆఫీసర్స్‌కు రోజు విడిచి రోజు డ్యూటీలు, అధికారులు ప్రత్యేక చాంబర్‌లో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్‌ అధికారులు, అసిస్టెంట్ సెక్షన్‌ అధికారులు సహా..ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలంది. అధికారులు, సిబ్బందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఇంటే వద్దే ఉండాలని, ప్రతిరోజు ఆఫీసు పరిసరాల్లో శానిటైజ్‌ చేయాల‌ని సూచించింది. అలాగే ఆఫీసుల్లో ఉద్యోగులు ఏసీలు వాడ‌కుండా ఉంటే మంచిద‌ని వెల్ల‌డించిందని వెలుగు దినపత్రిక పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ.. 'లాక్‌డౌన్‌'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు 10, 20 కేసులు వచ్చేస్థాయి నుంచి ఇప్పుడు 500 వరకూ నమోదయ్యే పరిస్థితికి చేరింది. పాజిటివ్‌ కేసులతో పాటు పెరుగుతున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి అని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. జిల్లాల్లో కలెక్టర్లు లాక్‌డౌన్‌ అనకుండానే కట్టడి ప్రాంతాల పేరుతో పట్టణాలు మూసివేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో 47వార్డులు కట్టడిలోకి వెళ్లిపోయాయి. జిల్లాల్లోనూ అనధికార లాక్‌డౌన్‌ అమలవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని చూసీచూడనట్లుగా వదిలేయడంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. ఇలాంటి వారంతా, స్పందన వెబ్‌సైట్‌లో కచ్చితంగా నమోదు చేసుకోవాలి. ఈ-పాస్‌ ఉన్నవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి వచ్చినవారిలో ఎక్కువమందికి పాజిటివ్‌లు వస్తున్నాయి.

ఒంగోలులో ఆదివారం నుంచి 14రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలుకు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చీరాలలో 17నుంచే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 9వరకు నిత్యావసర, అత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. మిగతా సమయంలో అన్నీ బంద్‌ చేయనున్నారు. ఆర్టీసీ బస్సులు నగరంలోకి రాకుండా శివారుల్లోనే నిలిపివేసే ఏర్పాటు చేశారు. కాగా, అనంతపురం జిల్లాలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. ఉదయం 6నుంచి 11 గంటల వరకు సడలింపులిచ్చారు. ఆ తరువాత పూర్తిస్థాయిలో ఆంక్షలు అమలు చేయనున్నట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ విద్యార్థులంతా పాస్, ఇంటర్మీడియట్ ఫెయిలైన వాళ్లూ పాస్

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పబ్లిక్‌, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారని విశాలాంధ్ర దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. హాల్‌ టికెట్‌ పొందిన పదో తరగతి విద్యార్థులను, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫైయిలైన విద్యార్థులందరినీ ఉత్తీర్ణు లను చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఉన్నత విద్యావకాశాలకు విద్యార్థుల మార్కులు, గ్రేడింగ్‌ అవసరం కాబట్టి..ఉత్తీర్ణతతో పాటు గ్రేడింగ్‌ ఇవ్వడానికి తగిన విధివిధానాలను అధికారులు రూపొందిస్తారని తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులు చెల్లించిన ఫీజును వెనక్కు ఇస్తామన్నారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, జూలై నాటికి మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వివిధ సర్వేలు సూచిస్తున్నాయని తెలిపారు. కంటైన్మెంట్‌ జోన్లు పెరుగుతుండటంతో పరీక్షల నిర్వహణ మరింత కష్టతరంగా ఉంటుందన్నారు. పాఠశాల పరిసరాల్లో శానిటైజేషన్‌, కరోనా నివారణ చర్యలు పూర్తిగా తమ అధీనంలో లేనందున నిర్వహణకు తాము సిద్ధంగా లేమన్నారు. మాస్కులు, శానిటైజర్లు, ఇతర నివారణ సామాగ్రి సమకూర్చు కోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే అనేక పాఠశాల లు క్వారంటైన్‌ కేంద్రాలుగా ఉన్నాయని తెలిపారు. అంతర్‌ జిల్లా, జిల్లాస్థాయి రవాణా సౌకర్యాలు పూర్తిగా పునరుద్ధరించలేదని, దూరప్రాంతానికి చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేరుకోవడం కష్టమని తెలిపారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పిల్లల ఆరోగ్యభద్రత ముఖ్యమని, ఏ ఒక్కతల్లి బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెందకుండా పరీక్షలతో నిమిత్తం లేకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులు చేయాలని సీఎం ఆదేశించినట్టు వివరించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ఉత్తీర్ణులను చేసేలా నిర్ణయం తీసుకున్నాయని వివరించారు. ఉమ్మడి ప్రవేశాల పరీక్ష(సెట్లు)లు, ఓపెన్‌ స్కూల్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు ఇప్పటివరకు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతున్నాయని తెలిపారు. కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ ఆగస్టు 3 నుంచి ప్రారంభమవుతుందని సీఎం ఇప్పటికే చెప్పారని గుర్తుచేశారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)