You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్‌లో ముగిసిన సూర్య గ్రహణం: ఈసారి అగ్నివలయంలా ఎందుకు కనిపించింది?
భారతదేశంలో ఆదివారం సూర్యగ్రహణం జరిగింది.
దేశంలోని కొన్ని భాగాల్లో ఇది ‘వలయాకారం’లో కనిపించింది. అక్కడ ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఈ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ లేదా ‘ఆగ్ని వలయాన్ని’ చూశారు.
అయితే, దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణం మాత్రమే కనిపించింది.
సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది?
“దేశంలో సూర్య గ్రహణం మొదట రాజస్థాన్ ఘర్సాణా దగ్గర ఉదయం 10.12 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది. అది 11.49 నిమిషాలకు వలయాకారంలో కనిపించడం మొదలవుతుంది. తర్వాత 11.50కి ముగుస్తుంది” అని కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ దేబీ ప్రసాద్ దువారీ చెప్పారని పీటీఐ తెలిపింది.
“రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలోని సిర్సా, రతియా, కురుక్షేత్ర, ఉత్తరాఖండ్‌లోని దెహ్రాడూన్, చంబా, చమేలీ, జోషీమఠ్ ప్రాంతాల్లో ఈ ‘అగ్ని వలయం’ ఒక నిమిషం పాటు కనిపిస్తుందని” ఆయన చెప్పారు.
అయితే, “గత ఏడాది డిసెంబర్ 26న కనిపించినట్లు ఈ అగ్ని వలయం అంత స్పష్టంగా ఉండదు. ఈసారీ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ కాస్త సన్నగా కనిపిస్తుంది” ఆని దేబీ ప్రసాద్ చెప్పారు.
“సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో ఉన్నప్పుడే వలయాకార సూర్య గ్రహణం ఏర్పడుతుంది” అని ఆయన తెలిపారు.
నిజానికి ఈ ఖగోళ అద్భుతం సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల ఏర్పడుతుంది. కొంత సమయం పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా చీకటి కమ్మేస్తుంది.
ఆ సమయంలో సూర్యుడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’లా కనిపిస్తాడు కాబట్టే ఆదివారం సూర్య గ్రహణం ప్రత్యేకం కాబోతోంది.
ప్రపంచంలో మొట్ట మొదట ఎక్కడ కనిపిస్తుంది?
దేశంలో ఎక్కువ భాగాల్లో ప్రజలు పాక్షిక సూర్యగ్రహణమే చూడగలరు. హైదరాబాద్‌లో పాక్షిక సూర్యగ్రహణం ఉదయం 10.14కు మొదలై, మధ్యాహ్నం 1.44కు ముగుస్తుంది.
దిల్లీలో ఉదయం 10.20కి ప్రారంభమయ్యే సూర్య గ్రహణం 1.48కి ముగుస్తుంది. ముంబయిలో అది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.27 వరకూ, చెన్నైలో ఉదయం 10.22 నుంచి మధ్యాహ్నం 1.41 వరకూ, బెంగళూరులో 10.13 నుంచి 1.31 వరకూ, కోల్‌కతాలో పాక్షిక సూర్యగ్రహణం ఉదయం 10.46కు ప్రారంభమై, 2.17కు ముగుస్తుంది.
ఆఫ్రికా ఖండంలోని కాంగో ప్రజలు ప్రపంచంలో మొట్టమొదట ఈ వలయాకార సూర్య గ్రహణాన్ని చూడబోతున్నారు. ఇది భారత్‌లో రాజస్థాన్ చేరడానికి ముందు దక్షిణ సూడాన్, ఇథియోపియా, యెమెన్, ఒమన్, సౌదీ అరేబియా, హిందూ మహాసముద్రం, పాకిస్తాన్ మీదుగా కనిపిస్తుంది.
భారత్ తర్వాత టిబెట్, చైనా, తైవాన్ ప్రజలు దీన్ని చూడగలరు. పసిఫిక్ మహాసముద్రం మధ్యకు చేరుకోగానే అది ముగుస్తుంది.
గ్రహణం గురించి ఇప్పటికీ భయాలు
యుగాంతం లేదా భయంకర అల్లకల్లోలానికి గ్రహణం ఒక హెచ్చరిక అని, అది ప్రమాదానికి సంకేతం అని ప్రపంచంలో చాలా మంది భావిస్తారు.
అమృతం కోసం ‘క్షీరసాగర మథనం’ జరిగిన తర్వాత రాహు-కేతు అనే రాక్షసులే ఈ గ్రహణాలకు కారణమయ్యారని హిందూ పురాణాలు చెబుతాయి. దీనికి సంబంధించి ఎన్నో మూఢనమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. గ్రహణం మనిషిని ఎప్పుడూ ఎంత ఆశ్చర్యపరుస్తుందో, అంతే భయపెడుతోంది.
నిజానికి గ్రహణం గురించి మానవులకు సరైన సమాచారం లభించేవరకూ, అప్పట్లో సూర్యుడు కనిపించక చీకట్లు కమ్మేయడం గురించి జనం ఎన్నో ఊహించుకున్నారు. ఎన్నో కథలు సృష్టించారు.
గ్రహణం ఎందుకు ఏర్పడుతుందో మనకు వైజ్ఞానిక కారణాలు తెలుసినప్పటికీ, మనలో చాలా మంది ఇప్పటికీ గ్రహణానికి సంబంధించిన కథలు, విశ్వాసాలు నమ్ముతుంటారు.
కాలిఫోర్నియాలోని గ్రిఫిత్ అబ్జర్వేటరీ డైరెక్టర్ ఎడ్విన్ క్రప్ “17వ శతాబ్దం చివరి వరకూ చాలా మందికి గ్రహణం ఎందుకు ఏర్పడుతుందో, నక్షత్రాలు ఎందుకు రాలుతాయో తెలీలేదు. అయితే 8వ శతాబ్దం నుంచే ఖగోళ శాస్త్రవేత్తలకు వాటి వెనుక వైజ్ఞానిక కారణాల గురించి తెలిసుండేవి” అన్నారు.
“సమాచారం, తగిన అక్షరాస్యత లేకపోవడంతో ఈ విషయం ఎవరికీ తెలీకుండా పోయింది. తెలిసిన సమాచారాన్ని ప్రసారం చేయడం కూడా కష్టం కావడంతో మూఢనమ్మకాలు పెరుగుతూపోయాయి” అని క్రప్ చెప్పారు.
“ప్రాచీన కాలంలో మనిషి దినచర్య ప్రకృతి నియమాలకు తగినట్లు ఉండేది. ఆ నియమాలు తారుమారైతే చాలు మనిషి చికాకుపడిపోయేవాడు, వెలుతురు, సృష్టికి కారణమైన సూర్యుడు కనిపించకపోయేసరికి జనం భయపడిపోయేవారు” అన్నారు.
గ్రహణాన్ని ఎవరు ఎలా అనుకునేవారు?
సూర్యగ్రహణానికి సంబంధించి వివిధ నాగరికతల్లో రకరకాల కథలు ప్రచారం అయ్యాయి. ఎక్కువ మంది సూర్యుడిని ఒక ఏడ్చే ఒక రాక్షసుడుగా వర్ణించారు.
పశ్చిమ ఆసియాలో మరో నమ్మకం ఉంది. గ్రహణం సమయంలో ఒక డ్రాగన్ సూర్యుడిని మింగేయడానికి ప్రయత్నిస్తుందని భావిస్తారు. అందుకే, దాన్ని తరిమేయడానికి గ్రహణం రోజున ఢోలు, నగారాలు మెగిస్తారు.
ఇక చైనాలో స్వర్గానికి చెందిన ఒక కుక్క సూర్యుడిని మింగేసేందుకు ప్రయత్నిస్తుందని భావిస్తారు. పెరూ ప్రజలు గ్రహణాన్ని ఒక విశాల ప్యూమా అని చెబుతారు. ఇక సూర్య గ్రహణం సమయంలో ఆకాశంలో ఒక తోడేళ్ల జంట సూర్యుడిపై దాడి చేస్తుందని వైకింగ్స్ నమ్ముతారు.
ప్రకృతి పట్ల వివిధ నాగరికతలు ఎంత ఉదారంగా ఉంటాయి అనేదాన్ని బట్టి గ్రహణం గురించి వారి వైఖరి ఉంటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు, వెస్టర్న్ కాప్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ జరీటా హాల్‌బ్రుక్ చెప్పారు.
“అంటే, జీవనం కష్టంగా ఉన్నచోట స్థానికులు దేవతలను కూడా క్రూరంగా, భయంకరంగా ఉంటారని ఊహించుకున్నారు. అందుకే అక్కడ గ్రహణానికి సంబంధించిన కథలు భయంకరంగా ఉంటాయి. జీవితం సాఫీగా ఉన్న దగ్గర, తిండికి లోటు లేని ప్రాంతాల్లో దేవుళ్లు, దేవతలను మనిషి ఆరాధించాడు. వారి పురాణాలు కూడా అలాగే ఉంటాయి” అన్నారు.
మధ్యయుగంలో యూరప్ ప్రజలు ప్లేగు, యుద్ధాలతో బాధపడేవారు. ఆ సమయంలో సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం వారికి బైబిల్‌లోని ప్రళయాన్ని గుర్తు చేసేది.
“ఫ్రెంచ్ ప్రజలు గ్రహణాన్ని ప్రళయంగా ఎందుకు భావిస్తారో తెలుసుకోవడం చాలా సులభం” అని ప్రొఫెసర్ క్రిస్ అన్నారు.
యుగాంతం రోజున సూర్యుడు పూర్తిగా నల్లగా మారుతాడని, చంద్రుడు ఎర్ర రంగులో కనిపిస్తాడని బైబిల్లో ప్రస్తావన ఉంది.
సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజున అదే జరుగుతుంది. అప్పట్లో ప్రజల జీవితం కూడా చాలా చిన్నదిగా ఉండేది. వారు తమ జీవితంలో ఇలాంటి ఖగోళ ఘటనలు ఒక్కసారి చూడడమే కష్టం. అందుకే గ్రహణాలు వారిని భయపెట్టేవి.
ఇవి కూడా చదవండి:
- ఇస్రో: ఈ మరుగుజ్జు నక్షత్రవీధి ఓ భారీ నక్షత్రాల ఫ్యాక్టరీ
- అంతరిక్షంలో వ్యర్థాలను ఎలా తొలగించొచ్చు?
- భారత్ - చైనా విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.... సరిహద్దు ఉద్రిక్తతల నివారణకు చర్యలు
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- చైనా మీద భారత్ విరుచుకుపడిన 1967 నాథూలా యుద్ధం గురించి తెలుసా?
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- కరోనావైరస్ ఇటలీలో గత ఏడాది డిసెంబర్ నాటికే ఉందని తేల్చి చెబుతున్న మురుగు నీటి పరిశోధనలు
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- కరోనావైరస్ 'జీరో' అని ప్రకటించుకోవడానికి ఆ దేశాలకు ఎందుకంత తొందర?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)