You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నిసర్గ: పెను తుపాను నుంచి తప్పించుకున్న ముంబయి నగరం.. రాయగడ జిల్లాలో తీవ్ర నష్టం
నిసర్గ పెను తుపాను ధాటి నుంచి ముంబయి తప్పించుకున్నప్పటికీ భారతదేశ పశ్చిమతీరంలోని మరికొన్ని ప్రాంతాలు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈదురుగాలులు, భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.
మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో తుపాను తీరం దాటడంతో ముంబయికి ముప్పు తప్పింది. ఇప్పటివరకు ప్రాణ నష్టం ఏమీ లేనప్పటికీ మహారాష్ట్రలోని తీరప్రాంతం పొడవునా భారీ ఆస్తినష్టం మాత్రం వాటిల్లింది.
రాయగడ జిల్లా అలీబాగ్, మురుద్, శ్రీవర్థన్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయాయి.
తుపాను తీరాన్ని తాకిన తరువాత ఈశాన్య దిశగా కదులుతూ నాసిక్, మధ్యప్రదేశ్ వైపు సాగింది. నాసిక్‌లో ఒక ఘాట్ రోడ్ ప్రాంతంలో మట్టిపెల్లలు విరిగిపడ్డాయి.. భారీవర్షం, గాలుల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ముంబయి తుపాను ముప్పు నుంచి తప్పించుకున్నప్పటికీ వర్షాల తప్పవు. తుపాను అప్రమత్తత చర్యల్లో భాగంగా వెయ్యి మంది కోవిడ్ రోగులను ఆసుపత్రుల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
దివే ఆగర్ వద్ద తీరం దాటిన తుపాను
అరేబియా సముద్రంలో పెను తుపానుగా మారిన ‘నిసర్గ’ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబయికి దక్షిణంగా 120 కిలోమీటర్ల దూరంలో రాయగఢ జిల్లాలో ఉన్న దివేఆగర్ వద్ద తీరం దాటింది.
తుపాను తీరం దాటిన సమయంలో సుమారు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి."గాలులు గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో వీస్తున్నాయి. కాసేపట్లో పరిస్థితి సర్దుకుంటుంది. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి. గాలులు మళ్లీ వీస్తున్నాయి. రాత్రి 9 వరకూ బయటకు రాకండి. మేం విద్యుత్ తీగలు, చెట్లు తొలగిస్తున్నాం" అని రాయ్‌గడ్ జిల్లా కలెక్టర్ నిధి చౌధరి స్థానిక చానళ్లతో చెప్పారు.తుపాను తీరం దాటే ప్రక్రియ మొదలైందని, అది మరో మూడు గంటల్లో పూర్తవుతుందని వాతావరణ శాఖ చెప్పింది.
తుపాను ధాటికి చాలా ప్రాంతాల్లో ఇళ్లపై కప్పిన రేకులు ఎగిరిపోయాయి, బోర్డులు, చెట్లు కుప్పకూలాయి.
తీరం అంతటా, ముంబయిలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.
అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. రహదారులకు అడ్డంగా కూలిన చెట్లను ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు.
గోవా, గుజరాత్‌లోనూ
మహారాష్ట్రతో పాటు గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో హై-అలర్ట్ ప్రకటించారు. ముంబయి నగరంతో పాటు కొంకణ తీరంలో వర్షాలతో పాటు, ఈదురు గాలులు వీస్తున్నాయి.
తీరం దాటే ప్రక్రియ మూడు గంటల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం చెప్పింది.
ముంబయి నగరంతో పాటు, థానే, రాయగడ జిల్లాల్లో గంటలకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతా పెను గాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది.
తుపాను కేంద్రం 65 కిలోమీటర్లు వ్యాసంలో ఉందని తెలిపారు. కొన్ని గంటల వ్యవధిలోనే దాని వెడల్పు పెరిగినట్లు రాడార్ చిత్రాల ద్వారా తెలుస్తోందని అధికారులు వెల్లడించారు.
గాలుల వేగం పెరుగుతుండటంతో ప్రభుత్వం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. ఇవాళ ఉదయం నుంచి ముంబయి నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. బీచ్‌లను ఇప్పటికే మూసేశారు. ఎవరూ ఇళ్లలోంచి బైటికి రావద్దని మైకుల్లో ప్రకటనలు చేస్తున్నారు అధికారులు. ఇటు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తుపాను నగరంవైపు కదులుతుందని తెలియడంతో గురువారం మధ్యాహ్నం వరకు ముంబయిలో 144 సెక్షన్ విధించారు. రోడ్ల మీద జనం కనిపించడం లేదు. ముంబయిపై తుపాను ప్రభావం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పలు రైళ్ల సమయాలను కూడా అధికారులు మార్చారు. బుధవారం నాడు ముంబయికి రావాల్సిన అనేక రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.
ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 8 బృందాలు ముంబయిలో, 5 బృందాలు రాయగఢ్‌లో ఉన్నాయని, రెండు టీమ్‌లను థానే, పాల్ఘర్, రత్నగిరికి పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఐదు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను విజయవాడ నుంచి ముంబయికి విమానంలో తరలించారు.
మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్ తీరప్రాంతాలలో సుమారు లక్షమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు ఏఎన్‌ఐ వార్తా సంస్థకు తెలిపారు. సహాయక శిబిరాలలో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
129 ఏళ్ల తర్వాత ముంబయికి మళ్లీ పెను తుఫాను...
సౌతిక్ బిశ్వాస్, బీబీసీ ప్రతినిధి
“గాలి సముద్రాన్ని నగరంలోకి తీసుకొచ్చింది. అలలు భయంకరంగా గర్జించాయి. చర్చిల గోపురాలు ఎగిరిపోయాయి. భారీ రాళ్లు సుదూర ప్రాంతాలకు ఎగిరి పడ్డాయి. రెండు వేల మంది మరణించారు”.
1618 మే నెలలో వచ్చిన ఒక భయంకరమైన, శక్తివంతమైన పెను తుపానును వర్ణిస్తూ ఒక పోర్చుగీసు చరిత్రకారుడు చెప్పిన మాటలివి. 17వ శతాబ్దంలో భారతదేశ పశ్చిమ నగరాన్ని భయంకరమైన తుపానులు కమ్మేశాయి.
2005లో, ఇటీవల 2017, 2019లో కూడా ముంబయి నగరం ఎన్నో తీవ్రమైన వరదలు చూసింది. కానీ అవేవీ తుపానుల వల్ల వచ్చినవి కావు.
“2 కోట్ల జనాభాతో కిక్కిరిసిన భారత ఆర్థిక, వినోద రాజధాని అయిన నగరం ఆధునిక చరిత్ర తుపానుల నుంచి తప్పించుకుంది. 1891 నుంచి ముంబయి పెను తుపానులను చూళ్లేదు” అని కొలంబియా యూనివర్సిటీలో వాతావరణ శాస్త్ర ప్రొఫెసర్ ఆడం సోబెల్ నాకు చెప్పారు.
100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో తీవ్రమైన నిసర్గ తుపాను బుధవారం భారత పశ్చిమ తీరాన్ని తాకినపుడు ఆ చరిత్ర మొత్తం మారిపోవచ్చు.
పదిహేను రోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌లో చాలా ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించి, 90 మందిని బలి తీసుకున్న ఆంఫన్ తుపాను లాగే నిసర్గ తుపాను కూడా తీవ్రంగా ఉంటుందా అనేది గమనిస్తోంది.
నిసర్గ తుపాను గురించి పరిశోధన చేసిన ప్రొఫెసర్ సోబెల్ సోమవారం నాతో మాట్లాడుతూ.. అమెరికా పద్ధతిలో చెప్పాలంటే ఇది ‘ఒక బలమైన ఉష్ణమండల తుపాను’, ‘హరికేన్’ లాంటిది కాదు అయన తెలిపారు. (ఉత్తర అట్లాంటిక్, ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రాల్లో వచ్చే వాటిని హరికేన్లు అంటారు.)
“తీవ్ర నష్టం జరిగే అవకాశం ఇప్పుడు చాలా తగ్గింది. అయినప్పటికీ, పెను తుపాను ప్రమాదకరంగానే ఉంటుంది. అందుకే ప్రజలు సన్నద్ధంగా ఉండాలి. పరిస్థితులు మారడానికి ఇంకా సమయం ఉంది. అందుకే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వాతావరణ సూచనలు గమనిస్తుండాలి”. అని ఆయన చెప్పారు.
అటు కరోనా, ఇటు తుపాను
ముంబయి అంత బలహీనంగా ఎందుకు మారింది? అనే ప్రశ్నకు… అక్కడ జనసాంద్రత ఎక్కువ, లోతట్టు నగరం పూర్తిగా సముద్రానికి బహిర్గతం అవుతోంది. భయంకరమైన తుపాను లేదా భారీ వర్షాలు పడినపుడు నగరంలోని లోతట్టు ప్రాంతాలు సులభంగా వరద ముంపునకు గురవుతాయి. ఈసారీ, నగరం కోవిడ్-19 మహమ్మారితో కూడా పోరాడుతోంది. భారతదేశంలో నమోదైన మొత్తం కేసుల్లో మూడోవంతు కేసులు మహారాష్ట్ర రాజధానిలోనే బయటపడ్డాయి.
గత కొన్ని దశాబ్దాలుగా అరేబియా సముద్రంలో తుపాను కార్యకలాపాలు పెరిగాయని వాతావరణ మార్పులపై విస్తృత కథనాలు రాసిన ప్రముఖ నవలా రచయిత అమితవ్ ఘోష్ చెప్పారు. అరేబియా సముద్రంలో శతాబ్దం చివరి నాటికి ఉష్ణమండల తుపానులు 46 శాతం పెరుగుతాయని 2012లో ఒక పత్రిక అంచనా వేసింది. 1998-2001 మధ్య మంబయికి ఉత్తరాన భారత ఉపఖండాన్ని మూడు తుపానులు తాకడంతో 17 వేల మంది చనిపోయారని ఆయన రాశారు.
తను రాసిన ‘ది గ్రేట్ డిరేంజ్‌మెంట్-క్లైమేట్ చేంజ్ అండ్ ది అన్ థింకబుల్’ అనే పుస్తకంలో ఆయన “కేటగిరీ 4 లేదా 5 తుపాను వస్తే, గంటకు 240 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తే ముంబయి ఏమయ్యేది” అని రాశారు.
“ముంబయి ఇంతకు ముందు పెను తుపానులను ఎదుర్కున్న సమయంలో, నగరంలో పది లక్షల లోపే నివసించేవారు. ఇప్పుడు 2 కోట్లకు పైగా జనాభాతో ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మునిసిపాలిటీ అయ్యింది” అని ఆయన అందులో చెప్పారు.
నగరంలో పెరగడంతోపాటూ, దాని నిర్మిత పర్యావరణం, వాతావరణం కూడా మారిపోయింది. అది అసాధారణం అనడంలో ఎలాంటి అర్థం లేదు. నగరంలో తరచూ తీవ్ర ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు వర్షాకాలంలో కుండపోత వర్షాలు, ఈ మధ్య తరచూ వరదలు లాంటివి సంభవిస్తూనే ఉన్నాయి.
“ఏదైనా అసాధారణ ఘటన జరిగితే, ఆ ఫలితాలు విధ్వంసకరంగా ఉండవచ్చు”. ఇది ఇప్పటికే ఒకసారి జరిగింది.
కానీ, ముంబయి నగర ప్రజలకు తుపాను అనుభవం ఎలా ఉంటుందో కూడా తెలీదు.
ప్రపంచంలో ఒక్క రోజులో ఎక్కడా, ఎప్పుడూ నమోదు కాని విధంగా ముంబయి 14 గంటల్లో 94.4 సెంటీమీటర్ల వర్షపాతాన్ని రుచిచూసింది.
అప్పటి జలప్రళయం రోడ్లను ముంచెత్తింది. కమ్యూనికేషన్ నెట్‌వర్క్, విద్యుత్ సరఫరా ఆగిపోయింది. లక్షలమంది చిక్కుకుపోయారు. ప్రజా రవాణా స్తంభించిపోయింది. వరదలో కొట్టుకుపోయి, శిథిలాల కింద చిక్కుకుపోయి, కరెంటు షాకులకు, మునిగిపోయిన కార్లలో ఊపిరాడక 500 మందికి పైగా మరణించారు.
అలాంటి ‘పీడకల’ మరోసారి రాకూడదని ముంబయి ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- సంక్షేమానికి, వివాదాలకూ రారాజు జగన్
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నరేంద్ర మోదీ వారసుడు అమిత్ షాయేనా?
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- పాకిస్తాన్: 'పది అడుగుల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను...' - కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)