తెలంగాణ బడ్జెట్ రూ. 1,82,914.42 కోట్లు, శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్ రావు

తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శాసనసభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు.

రానున్న ఏడాదిలో రూ. 1,82,914.42 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.

ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ.22,061.18 కోట్లు. రెవెన్యూ మిగులు రూ. 4,482.12 కోట్లు. ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లు.

2019-20వ సంవత్సరానికి గాను సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ రూ.1,42,152.28 కోట్లు.

అంటే, రాబోయే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ అంచనా సుమారు రూ.40 వేల కోట్ల మేరకు పెరిగింది.

అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా.. పూర్తి వాస్తవిక దృక్పథంతో ఈ బడ్జెట్ రూపొందించామని హరీశ్ రావు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా గతేడాది అంచనాల కంటే రూ. 3731 కోట్లు తక్కువగా వచ్చిందని ఆయన చెప్పారు. అలాగే, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు సకాలంలో ఇవ్వటం లేదని ఆరోపించారు.

కాగా, దేశం మొత్తం తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు (12.6 శాతం) సాధించిందని, దేశ వృద్ధి రేటు (7.5 శాతం) కంటే ఎక్కువని చెప్పారు.

అలాగే దేశ తలసరి ఆదాయం రూ. 1,35,050 కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,28,216 అని వెల్లడించారు.

ఇదిలా ఉంటే, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గానే ఉందని, సగటు వృద్ధి రేటు 21.5 శాతం కాగా.. ఫిబ్రవరి నెలలో అది 6.3 శాతానికి తగ్గిందని తెలిపారు.

రాజీవ్ స్వగృహ వంటి నిరర్థకంగా పడిఉన్న ఆస్తుల్ని పారదర్శకంగా విక్రయించడం, ఇసుక, ఇతర ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించామన్నారు.

ఆయా రంగాలు, పథకాల వారీగా బడ్జెట్ కేటాయింపులు:

రైతు బంధు - 14,000 కోట్లు

రైతు బీమా - 1,141 కోట్లు

రైతు రుణమాఫీ - 6,225 కోట్లు

సకాలంలో విత్తనాలు, ఎరువులు - 142 కోట్లు

మైక్రో ఇరిగేషన్ - 600 కోట్లు

రైతు వేదికలు - 350 కోట్లు

పాడి పరిశ్రమ - 100 కోట్లు

సాగునీటి రంగం - 11,054 కోట్లు

ఆసరా పెన్షన్లు - 11,758 కోట్లు

ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి - 16,534.97 కోట్లు

ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి - 9,771.27 కోట్లు

మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం - 1,518.06 కోట్లు

పశుపోషణ, మత్స్యశాఖ - 1,586.38 కోట్లు

కళ్యాణలక్ష్మి-బీసీల కోసం అదనపు నిధులు - 1,350 కోట్లు

ఎంబీసీ కార్పొరేషన్ - 100 కోట్లు

మొత్తంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం - 4,356.82 కోట్లు

మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీలేని రుణాలకు - 1,200 కోట్లు

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి - 23,005 కోట్లు

మున్సిపల్, పట్టణాభివృద్ధి - 14,809 కోట్లు

హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధి, మూసీనది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అమలు - 10,000 కోట్లు

ఫీజు రీయంబర్స్‌మెంట్ - 2,650 కోట్లు

పాఠశాల విద్య - 10,421 కోట్లు

ఉన్నత విద్య - 1,723.27 కోట్లు

వైద్యం - 6,186 కోట్లు

విద్యుత్ - 10,416 కోట్లు

పరిశ్రమల అభివృద్ధి - 1,998 కోట్లు

ఆర్టీసీ - 1,000 కోట్లు

గృహ నిర్మాణం - 11,917 కోట్లు

పర్యావరణం, అటవీ శాఖ - 791 కోట్లు

దేవాలయాల అభివృద్ధి - 500 కోట్లు

ధూపదీప నైవేద్యాలు, దేవాలయాల నిర్వహణ - 50 కోట్లు

మొత్తంగా రవాణా, రోడ్లు భవనాల శాఖ - 3,494 కోట్లు

పోలీస్ శాఖ - 5,852 కోట్లు

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఎస్‌డీపీ నిధులు - 480 కోట్లు

వ్యవసాయంపై ఫోకస్ తగ్గింది

కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అంటే ఎప్పుడూ వ్యవసాయంపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది, కానీ ఈసారి అది కనిపించలేదు అని ప్రముఖ విశ్లేషకులు డి.పాపారావు అభిప్రాయపడ్డారు.

"గత బడ్జెట్‌లో ఖర్చు అంచనాలను ప్రభుత్వం చేరుకోలేకపోయింది. కానీ, ఈసారి బడ్జెట్ అంచనా మొత్తం గత బడ్జెట్ కన్నా దాదాపు 36వేల కోట్ల రూపాయలు పెరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీపై ఈ బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్‌లో గత టీడీపీ ప్రభుత్వం చేసినట్లుగానే రైతు రుణ మాఫీని దఫాలుగా అమలుచేస్తున్నారు. రైతు బంధు పథకానికి కేటాయింపులు కొద్దిగా పెంచారు.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేశారు. కానీ, ఆ తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు.

దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తుంటే, హైదరాబాద్‌లో మాత్రం ఆ ప్రభావం అంతగా కనిపించడం లేదు" అని పాపారావు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)