You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తన్నీరు హరీశ్‌రావు: కేసీఆర్ మేనల్లుడిగా వచ్చినా.. సొంత గుర్తింపు సాధించుకున్న నాయకుడు
తన్నీరు హరీశ్‌రావు.. తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నాయకుల్లో ఒకరు. కేసీఆర్ మేనల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చిన హరీశ్.. తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తూ, పదునైన ప్రసంగాలతో తనకంటూ ఒక ఇమేజ్‌ని తయారు చేసుకున్నారు.
జననం: 1972 జూన్ 3, కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం
చదువు: బి.ఎ., కాకతీయ విశ్వవిద్యాలయం
వివాహం: శ్రీనితారావుతో వివాహం
రాజకీయ ప్రవేశం...
తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేనల్లుడు హరీశ్‌రావు.
విద్యార్థిగా ఉండగానే టీఆర్ఎస్‌లో యువనాయకుడిగా ఉన్న హరీశ్‌రావు 2004లో సిద్ధిపేట శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలతో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.
2004లో సిద్ధిపేట అసెంబ్లీ స్థానం నుంచి, కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కేసీఆర్ రెండు చోట్లా గెలిచారు. సిద్ధిపేట అసెంబ్లీ సీటుకు కేసీఆర్ రాజీనామా చేయగా.. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో హరీశ్‌రావు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.
వైఎస్ కేబినెట్‌లో మంత్రి...
అప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ కూడా ప్రభుత్వంలో చేరింది. అలా వైఎస్ మొదటి ప్రభుత్వంలో హరీశ్‌రావు యువజనశాఖ మంత్రిగా పనిచేశారు. ఏడాది తర్వాత వైఎస్ ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ వైదొలగినపుడు హరీశ్ కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు.
మళ్లీ ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తో టీఆర్ఎస్ శాసనసభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన నేపథ్యంలో.. 2008లో ఉపఎన్నికలు జరిగాయి. సిద్ధిపేట నుంచి హరీశ్ మళ్లీ గెలిచారు. 2009 సాధారణ ఎన్నికల్లోను, 2010 ఉప ఎన్నికల్లోను 2014 సాధారణ ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ వచ్చారు.
తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి...
తెలంగాణ తొలి నీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆపద్ధర్మ మంత్రిగా ఉన్నారు.
పార్టీలోకి వచ్చాక అనతికాలంలోనే ప్రభావవంతమైన నాయకుడిగా ఎదిగారు. పార్టీలో ట్రబుల్ షూటర్ అనే పేరును సంపాదించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా దూకుడుగా వ్యవహరించటం వల్ల ప్రజల్లోనూ మంచి పట్టు సాధించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)