You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: కోట్లాది మంది ప్రాణాలు తీసిన స్పానిష్ ఫ్లూ నుంచి మనం నేర్చుకోగల పాఠాలేమిటి?
వంద సంవత్సరాల కిందట.. దాదాపు రెండు కోట్ల మంది ప్రాణాలను హరించిన ఒక ప్రపంచ యుద్ధం నుంచి కోలుకుంటున్న భూగోళం.. అకస్మాత్తుగా అంతకంటే ప్రాణాంతకమైన ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది: ఒక ఫ్లూ విజృంభణ.
'స్పానిష్ ఫ్లూ'గా వ్యవహరించే ఆ మహమ్మారి.. పశ్చిమ యుద్ధరంగంలో.. కిక్కిరిసిన, ఇరుకైన సైనిక శిక్షణ శిబిరంలో మొదలైందని భావిస్తారు.
ప్రత్యేకించి ఫ్రాన్స్ సరిహద్దు వెంట ఉన్న అపరిశుభ్ర పరిస్థితులు.. ఆ వైరస్ పెరగటానికి, అక్కడి నుంచి విస్తరించటానికి దోహదపడ్డాయి. యుద్ధం 1918లో ముగిసింది. సైనికులు తమ ఇళ్లకు తిరిగివెళుతూ తమతో పాటు వైరస్‌ను కూడా తీసుకెళ్లటంతో.. యుద్ధం కన్నా అత్యధిక ప్రాణనష్టం సంభవించింది. ఆ వైరస్ వ్యాప్తి వల్ల ఐదు కోట్ల మంది నుంచి 10 కోట్ల మంది చనిపోయి ఉంటారని అంచనా.
అప్పటి నుంచి ప్రపంచం చాలా మహమ్మారులను ఎదుర్కొంది. వాటిలో మూడు ఫ్లూ విజృంభణలూ ఉన్నాయి. కానీ వందేళ్ల కిందటి 'స్పానిష్ ఫ్లూ' అంత ప్రాణాంతకమైన, విస్తారమైన మహమ్మారి మరొకటి ఎదురుకాలేదు.
ఇప్పుడు దానికన్నా ఎంతో తక్కువ ప్రాణాంతకమైన మరో కరోనావైరస్ కారణంగా కోవిడ్-19 విజృంభిస్తోంది. పతాక శీర్షికలతో వస్తున్న వార్తలకు ప్రపంచం భయంభయంగా స్పందిస్తోంది.
ఈ నేపథ్యంలో.. ఇటీవలి చరిత్రలో ప్రాణాంతక వ్యాధుల నుంచి మనం నేర్చుకున్న పాఠాలేమిటనేది చూడటానికి.. స్పానిష్ ఫ్లూ మహమ్మారికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2018లో బీబీసీ ఫ్యూచర్ అందించిన ప్రత్యేక కథనాల మీద దృష్టి సారించింది.
ఎక్కువగా సంహరించేది.. న్యుమోనియా
కోవిడ్-19 వల్ల చనిపోతున్న వారిలో ఎక్కువ మంది.. ఒక తరహా న్యుమోనియాకు బలవుతున్నారు. వైరస్‌తో పోరాడటం వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనపడటంతో వారిలో న్యుమోనియా బలపడుతోంది.
స్పానిష్ ఫ్లూతో పోలిస్తే కోవిడ్-19 వల్ల మరణాలు చాలా రెట్లు తక్కువ అయినప్పటికీ.. స్పానిష్ ఫ్లూతో కోవిడ్-19కు ఉన్న సారూప్యం ఇది.
వృద్ధులు, వ్యాధినిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి.. న్యుమోనియా కలిగించే ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకూ కోవిడ్-19 వ్యాధి వల్ల చనిపోయిన వారిలో ఇటువంటి వారే అధిక సంఖ్యలో ఉన్నారు.
తప్పించుకున్న ప్రాంతాలు
స్పానిష్ ఫ్లూ దాడిచేసినపుడు విమానయానం ఇంకా శైశవ దశలోనే ఉంది. కానీ.. భూమి మీద ఆ మహమ్మారి భయంకర కోరల నుంచి తప్పించుకున్న ప్రాంతాలు చాలా తక్కువ. అది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించటం చాలా నెమ్మదిగా జరిగింది. విమానాల ద్వారా కాకుండా.. రైళ్లు, నౌకల ద్వారా వ్యాపించింది. కొన్ని ప్రాంతాలు కొన్ని నెలలు, సంవత్సరాల వరకూ కూడా ఆ వైరస్‌ను తప్పించుకున్నా.. చివరికి ఆ ఫ్లూ దాడి చేసి వినాశనం సృష్టించింది.
అయినప్పటికీ.. ఆ ఫ్లూను తమ గడ్డ మీద అడుగుపెట్టనివ్వకుండా కొన్ని ప్రాంతాలు అడ్డుకోగలిగాయి. అందుకోసం చాలా ప్రాధమిక కిటుకులు ఉపయోగించాయి. వందేళ్ల తర్వాత ఇప్పుడు కూడా వాటిని పాటిస్తున్నారు.
అలాస్కాలోని బ్రిస్టల్ బేలో ఒక సమాజం.. ఆ నాటి ఫ్లూ బారిన పడకుండా తప్పించుకుంది. వాళ్లు స్కూళ్లు మూసేశారు. బహిరంగ సమావేశాలు రద్దు చేశారు. గ్రామాలకు వెళ్లకుండా ప్రధాన రహదారులను మూసేశారు.
నేడు కరోనావైరస్ వ్యాపించకుండా నిరోధించటానికి చైనాలోని హూబే ప్రావిన్స్, ఉత్తర ఇటలీ వంటి కొన్ని ప్రాంతాల్లో విధిస్తున్న ప్రయాణ ఆంక్షలకు.. అంతగా సాంకేతిక అభివృద్ధి లేని రూపం నాటి దిగ్బంధనం.
వేర్వేరు ప్రజాసమూహాల మీద వేర్వేరు వైరస్‌ల దాడి
''చరిత్రలో వైద్యపరంగా అత్యంత ఘోరమైన మానవ హననం'' అని స్పానిష్ ఫ్లూను అభివర్ణిస్తారు డాక్టర్లు. అందుకు కారణం ఆ ఫ్లూ చాలా మందిని చంపటం ఒక్కటే కాదు.. చనిపోయిన వారిలో అత్యధికులు యువకులు, ఆరోగ్యవంతులు. సాధారణంగా.. ఆరోగ్యవంతమైన వ్యాధినిరోధక వ్యవస్థ ఫ్లూను చక్కగానే ఎదుర్కోగలదు. కానీ.. ఈ వైరస్ మాత్రం.. రోగనిరోధక వ్యవస్థను ముంచెత్తేంత వేగంగా దాడి చేసింది. ఫలితంగా ఆ వ్యవస్థ భారీ ఎత్తున అతిగా ప్రతిస్పందిస్తుంది. ఈ ఓవర్-రియాక్షన్‌ను సైటోకైన్ తుపానుగా పిలుస్తారు. ఊపిరితత్తుల్లోకి ద్రవాలు వరదెత్తుతాయి. ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లకు అది సరిగ్గా సరిపోయే రిజర్వాయర్‌లాగా పనిచేస్తుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వృద్ధులు అంతగా దీని బారిన పడలేదు. బహుశా వారు.. 1830లలో మనవాళిలో వ్యాపించిన దీనికి దగ్గరగా ఉండే ఫ్లూ రకాన్ని తట్టుకోగలగటం ఇందుకు కారణం కావచ్చు.
ఇప్పుడు కొత్త కరోనావైరస్ వల్ల.. వృద్ధులకు, ఇంతకుముందే అనారోగ్యాలు ఉన్న వాళ్లకు ఎక్కువ ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు.
మరణాల సంఖ్య చాలా తక్కువే అయినప్పటికీ.. 80 ఏళ్లకు మించిన వయసు వారిలో మరణాలు అత్యధికంగా ఉన్నాయి.
ఉత్తమ రక్షణ.. ప్రజారోగ్యం
అప్పుడే ప్రపంచ యుద్ధం నుంచి బయటకు వచ్చిన.. కీలకమైన ప్రజా వనరులను సైనిక కార్యకలాపాలకు మళ్లించేసిన ప్రపంచ దేశాల్లో స్పానిష్ ఫ్లూ విజృంభించింది. చాలా ప్రాంతాల్లో మధ్య తరగతి, సంపన్నులు మాత్రమే వైద్యుడి దగ్గరకు వెళ్లగలిగేవారు. ప్రజారోగ్య వ్యవస్థ అనే ఆలోచన ఇంకా బాల్యంలోనే ఉంది. ఆ ఫ్లూ.. మురికివాడలు, పట్టణ ప్రాంతాల్లోని ఇతర పేదల వాడల్లో చాలా మందిని బలితీసుకుంది. పోషకాహారం, పారిశుధ్యం సరిగా లేని, ఇతరత్రా అనారోగ్యాలు ఉన్న ప్రజా సమూహాల్లో మరణాలు అధికంగా ఉన్నాయి.
మహమ్మారి వ్యాధులు గతంలో కన్నా మరింత వేగంగా విస్తరిస్తాయని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు తెలుసుకోవటంతో.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ ఫ్లూ కారణంగా ప్రజారోగ్య వ్యవస్థల అభివృద్ధి వేగవంతమయింది.
పట్టణ ప్రాంతాల్లో మహమ్మారులను నియంత్రించటానికి ప్రజలకు ఒక్కో కేసును చూస్తూ చికిత్స చేయటం సరిపోదు. ప్రభుత్వాలు ఏదో యుద్ధం చేస్తున్నట్లుగా వనరులను మోహరించాల్సి ఉంటుంది. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని విడిగా ఏకాంతంలో ఉంచటం, అధిక తీవ్రమైన వ్యాధి ఉన్న వారిని, తక్కువ తీవ్రత ఉన్న వారిని వేరు చేయటం, ప్రజల కదలికలను పరిమితం చేయటం వంటి చర్యలు చేపట్టాలి.
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి ఇప్పుడు ప్రపంచమంతటా అమలుచేస్తున్న ప్రజారోగ్య చర్యలు.. స్పానిష్ ఫ్లూ ప్రభావం ఫలితమే.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: చైనాలో ఇళ్లకే పరిమితమైన కోట్లాది మంది ప్రజలు ఏం చేస్తున్నారు?
- కరోనావైరస్ ఎఫెక్ట్: పడిపోతున్న బీర్ల అమ్మకాలు... డెటాల్‌కు పెరుగుతున్న గిరాకీ
- దిల్లీలో అలర్లు చేయించేందుకు ముస్లింలకు డబ్బులు పంచారా? : Fact Check
- ఇవాంకా ట్రంప్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషాప్ ఎడిట్ ఫొటోలు..
- ఇంటర్ విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దీనికి పరిష్కారం ఏంటి?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- అమరావతిలో భూముల ధరలు: ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఎలా మారాయి?
- 'నా బిడ్డను చంపేశారని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాను' -అంకిత్ శర్మ తల్లి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)