Exit Polls: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు వచ్చే సీట్లెన్ని?

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హరియాణాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 21న ఓటింగ్ జరిగింది.

రెండు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తవడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కూడా తెర పడింది. న్యూస్ చానళ్లలో ఎగ్జిట్ పోల్స్ హడావిడి మొదలైంది.

మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్

ఇండియా టుడే-యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీకి 109-124 స్థానాలు లభించవచ్చు. అటు శివసేనకు 57-60 సీట్లు రావచ్చు. రెండు పార్టీలకు మొత్తం 166-194 స్థానాలు లభించవచ్చు.

కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఎన్సీపీకి 72 నుంచి 90 స్థానాలు రావచ్చని, మిగతా పార్టీలకు 22 నుంచి 34 సీట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ-శివసేనకు 230 స్థానాలు, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి 48, మిగతా పార్టీలకు 10 స్థానాలు లభించవచ్చు.

సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ-శివసేనకు 243 స్థానాలు లభించవచ్చు. కాంగ్రెస్-ఎన్సీపీ 41, మిగతా పార్టీలకు 4 సీట్లతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది.

ఏబీపీ-సీఓటర్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ-శివసేన కూటమి 288లో 204 స్థానాలు సాధించవచ్చు. కాంగ్రెస్-ఎన్సీపీకి 69, మిగతా పార్టీలకు 15 స్థానాలు లభించవచ్చు.

టీవీ9 మరాఠీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ కూటమికి 197 స్థానాలు, కాంగ్రెస్-ఎన్సీపీకి 75, మిగతా పార్టీలకు 16 స్థానాలు లభించవచ్చు.

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ-శివసేనకు 223, కాంగ్రెస్-ఎన్సీపీకి 54, మిగతా పార్టీలకు 14 స్థానాలు లభించవచ్చని చెబుతున్నారు.

హరియాణా ఎగ్జిట్ పోల్స్

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ప్రకారం హరియాణాలో బీజేపీకి 90లో 71 స్థానాలు రావచ్చు. అటు కాంగ్రెస్‌కు 11, మిగతా పార్టీలకు 8 సీట్లు వస్తాయని చెప్పారు.

రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ పోల్స్ ప్రకారం బీజేపీకి 57, కాంగ్రెస్‌కు 17, మిగతా పార్టీలకు 16 స్థానాలు దక్కవచ్చు.

న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి 77, కాంగ్రెస్‌కు 11, మిగతా పార్టీలకు 2 స్థానాలు లభిస్తాయని చెప్పారు.

టీవీ9-భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హరియాణాలో బీజేపీ 47, కాంగ్రెస్ 23, మిగతా పార్టీలు 20 సీట్లు గెలుచుకుంటాయి.

సీఎన్ఎన్-న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 75, కాంగ్రెస్‌కు 10, మిగతా పార్టీలకు 5 స్థానాలు లభిస్తాయి.

రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్ 21న ఒక దశలో పోలింగ్ జరిగింది. అక్టోబర్ 24న రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)