You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోధ్రా రైలు దహనం కేసులో 11 మందికి మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చిన హైకోర్టు
గోధ్రా రైలు దహనం కేసులో మరణ శిక్ష పడ్డ మొత్తం 11 మంది దోషులకూ గుజరాత్ హైకోర్టు సోమవారం శిక్షను తగ్గిస్తూ ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చింది.
మరో 20 మందికి కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు సమర్థించింది.
మొత్తమ్మీద 31 మంది దోషులకు జీవిత ఖైదు పడింది.
ఈ కేసులో మొత్తం 94 మందిపై హత్య, కుట్ర అభియోగాలు నమోదయ్యాయి.
2011 మార్చిలో 63 మంది నిందితులను ఎస్ఐటీ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ప్రత్యేక కోర్టు నిర్ణయాన్నిఇప్పుడు హైకోర్టు సమర్థించింది.
నిర్దోషులుగా ప్రకటించినవారిలో రైలు దహనం సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న మౌల్వీ ఉమర్జీ ఒకరు.
2002 ఫిబ్రవరి 27న శాంతిభద్రతల నిర్వహణలో గుజరాత్ ప్రభుత్వం, రైల్వే శాఖ విఫలమయ్యాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. బాధితుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
కొందరు నిందితుల విషయంలో నేర నిర్ధరణను, మరికొందరి విషయంలో నిర్దోషులుగా ప్రకటించడాన్నిసవాలు చేస్తూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. వాటిపై ఇప్పుడు తీర్పు వెలువడింది.
నాటి ఘటనలో 59 మంది మృతి
2002 ఫిబ్రవరి 27న గోధ్రా రైల్వే స్టేషన్ సమీపాన జరిగిన ఘటనలో సాబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్-6 బోగీ దహనం అయ్యింది. 59 మంది యాత్రికులు చనిపోయారు.
వీరు ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
రైలు దహనం తర్వాత గుజరాత్ వ్యాప్తంగా మతపరమైన అల్లర్లు జరిగాయి. వీటిలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది ముస్లింలు.
మా వెబ్‌సైట్‌పై మరి కొన్ని తాజా కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)