You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోదావరిలో మునిగిన బోటు బయటకొస్తోంది... పైకప్పును ఒడ్డుకు లాగిన వెలికితీత బృందం
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో నెల రోజుల కిందట మునిగిపోయిన వశిష్ట రాయల్ బోటును బయటకు తీసే ప్రయత్నం కొంతవరకు ఫలించింది.
సోమవారం(21.10.2019) బోటుకు సంబంధించిన కొంత భాగాన్ని ఒడ్డుకు లాగారు. వెలికితీత ప్రయత్నంలో బోటు పైకప్పు విడిపోయి బయటకు వచ్చింది.
బోటు మిగతా భాగాన్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
వారం రోజులుగా గోదావరిలో నీటిమట్టం తగ్గుతుండడం వెలికితీత ప్రయత్నాలకు అనుకూలించింది.
ప్రస్తుతం బోటు ఉన్న చోట నీటి మట్టం సుమారు 40 అడుగులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
విశాఖపట్నం ఓం శివశక్తి అండర్‌వాటర్ సర్వీసెస్‌కు చెందిన ఇద్దరు డైవర్లు ఆదివారం ఉదయం నదిలో మునిగి బోటుకు భారీ తాళ్లు కట్టడంతో బోటు పైభాగం కొంత బయటకు లాగగలిగారు.
బోటులో ఇసుక, మట్టి పెద్దమొత్తంలో పేరుకుపోవడంతో ఒకేసారి రాలేదని, పైభాగం ఊడి వచ్చిందని ధర్మాడి సత్యం తెలిపారు.
సెప్టెంబర్ 15న పాపికొండల పర్యటనకు 77 మంది యాత్రికులతో బయలుదేరిన బోటు కచ్చులూరు మందం సమీపంలో ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో 26 మందిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. మిగిలిన వారు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇప్పటి వరకూ 12 మంది ఆచూకీ లభించలేదు. మృతదేహాలు బోటు అడుగున ఇరుక్కుని ఉంటాయని అంచనా వేశారు.
బోటును వెలికితీయడంతో పాటుగా మృతదేహాల కోసం సెప్టెంబర్ 28న ఆపరేషన్ ప్రారంభమైంది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్ సంస్థకు 22.7లక్షల కాంటాక్ట్ ఇచ్చారు. ధర్మాడి సత్యం బృందం ఈ పనులు చేపట్టింది. తొలుత ఐదు రోజుల పాటు సాగించిన ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో గోదావరికి వరద పోటెత్తడంతో అక్టోబర్ 3న ఆపరేషన్ నిలిపివేశారు.
గోదావరి శాంతించడంతో అక్టోబర్ 16 నుంచి మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. తొలుత ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాల ప్రకారం లంగరుకి బోటు తగలడంతో ఒడ్డుకి చేరుతుందని ఊహించినప్పటికీ అది నెరవేరలేదు.
దాంతో ప్లాన్ మార్చారు. విశాఖ నుంచి డైవర్లను రంగంలో దింపారు. ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో నది అడుగు భాగానికి వెళ్లాలని నిర్ణయించి రెండు రోజులుగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. గోదావరిలో నీటి మట్టం తగ్గడంతో అందుకు అవకాశమేర్పడింది. చివరకు సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బోటులో కొన్ని భాగాలు బయటకు వచ్చాయి.
బోటు మొత్తం బయటకు వస్తుందని ఆశించామని, కానీ ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదని ధర్మాడి సత్యం తెలిపారు. అయినా ఆపరేషన్ సాగిస్తామని, బోటుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒడ్డుకి చేరుస్తామని ఆయన అంటున్నారు.
వరదల కారణంగా ఒండ్రు మట్టి బాగా పేరుకుపోయింది. ఇసుక బోటుని కప్పేసింది. దాంతో చాలా భాగం బయటకు తీయడం సమస్య అవుతోంది. బలంగా ప్రయత్నం చేయడంతో చివరకు బోటు విడిపోతోంది. భాగాలుగా వస్తోంది. అయినా పూర్తిగా వెలికితీస్తాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
గత వారం చేసిన ప్రయత్నాల్లో రెయిలింగ్ బయటకు వచ్చింది. ఇప్పుడు బోటు పై భాగంలోని కొంత వచ్చింది. దాంతో మరోసారి డైవర్స్ నీటిలో దిగారు. ఈసారి మరింత బలమైన తాళ్లు కట్టి లాగాలని భావిస్తున్నట్టు ఆపరేషన్ లో పాల్గొంటున్న వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- గోదావరిలో వరుస పడవ ప్రమాదాలు... ఎందుకిలా జరుగుతోంది? ఎవరు బాధ్యులు?
- #గ్రౌండ్‌రిపోర్ట్: ‘బోటు తలుపులు వేయడంతో ఈత వచ్చినా మునిగిపోయారు’
- కృష్ణా విషాదం: అక్కడికి రాగానే ఆగిపోతున్నారు!
- దేవీపట్నం ప్రమాదం: ఆధార్ జిరాక్స్ కోసం వెళ్లిన వారు ఒకరైతే... వైద్యం కోసం వెళ్లిన వారు మరికొందరు!
- చావును చూసొచ్చారు!
- దేవీపట్నం: బోటు ప్రమాదాలు ఆపాలంటే ఎవరెవరు ఏమేం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)