న్యూజీలాండ్ కాల్పులు: మృతుల్లో ఇద్దరు తెలంగాణకు చెందినవారు

    • రచయిత, బందెల రాజేంద్రప్రసాద్
    • హోదా, బీబీసీ కోసం

న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చి నగరంలో ఇటీవల మసీదులను లక్ష్యంగా చేసుకుని ఓ సాయుధుడు జరిపిన కాల్పుల మృతుల్లో తెలంగాణకు చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నట్లు వెల్లడైంది.

కరీంనగర్‌కు చెందిన ఇమ్రాన్‌ఖాన్‌(38) ఈ కాల్పుల్లో మరణించారని అక్కడి అధికారులు గుర్తించారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

శుక్రవారం కాల్పుల అనంతరం మొదట హైదరాబాద్‌కు చెందిన ఫరాజ్ అషన్ చనిపోయినట్టు గుర్తించారు. ఆయన మృతదేహం శనివారం లభించింది.

మరో రెండు రోజుల తర్వాత కరీంనగర్‌కు చెందిన ప్రవాసి ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా చనిపోయినట్లు వెల్లడైంది.

ఇమ్రాన్ ఖాన్ కుటుంబం కరీంనగర్‌లోని శ్రీనిధి కళాశాల సమీపంలో ఉండేది.

తండ్రి అహ్మద్ ఖాన్‌‌తో పాటు నలుగురు అక్కలు 2002లో అమెరికా వెళ్లి స్థిరపడగా, ఇమ్రాన్ మాత్రం కరీంనగర్‌లోనే ఉండి చదువుకున్నారు.

ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లారు.

అక్కడ కొన్ని రోజులున్న తరువాత స్నేహితుల సలహాతో కొన్నేళ్ల కిందట న్యూజీలాండ్‌కు వెళ్లి ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

ఇమ్రాన్‌ఖాన్‌‌కు భార్య, పదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు.

కుమారుడు అక్కడే ఏడో తరగతి చదువుతున్నాడు.

ఇమ్రాన్ న్యూజీలాండ్‌కు వెళ్లిన తరువాత ఆరేడేళ్ల కిందట కరీంనగర్‌కు వచ్చి వెళ్లాడని, అప్పటి నుంచి మళ్లీ రాలేదని కరీంనగర్‌లో ఉంటున్న అతడి పెద్దనాన్న మహబూబ్‌ఖాన్ తెలిపారు.

కాల్పుల ఘటన జరిగిన రోజు ఇమ్రాన్‌ చనిపోయారని ఆయన బావ ద్వారా తనకు తెలిసిందని మహబూబ్‌ఖాన్ వివరించారు.

నవంబర్ 2018లో ఇమ్రాన్‌ఖాన్‌ తండ్రి కూడా మరణించినట్లు ఆయన తెలిపారు.

తండ్రి తరువాత ఇప్పుడు అతడి ఒక్కగానొక్క కొడుకు కూడా మరణించడం చాల బాధాకరమని కరీంనగర్‌లో ఉన్న బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు.

ఇక్కడి నుంచి కొందరు ఇమ్రాన్ అంత్యక్రియలకు కోసం న్యూజీలాండ్‌ వెళ్లారని మృతుడి పెద్దనాన్న మహబూబ్ ఖాన్ తెలిపారు.

ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తాను వెళ్లలేదన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)