You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మమతా బెనర్జీ వర్సెస్ సీబీఐ: కమిషనర్ రాజీవ్ కుమార్ సీబీఐ విచారణకు హాజరవ్వాలన్న సుప్రీం కోర్టు
సీబీఐ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మధ్య ముదిరిన వివాదంపై మంగళవారం వాదనలు విన్న సుప్రీంకోర్టు సీబీఐకి కొంత ఊరట కలిగించింది. కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సీబీఐ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
అయితే, తటస్థ ప్రాంతంగా మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్‌లో సీబీఐ ఎదుట ఆయన హాజరుకావాలని సుప్రీం సూచించింది.
ఈ వ్యవహారంలో రాజీవ్ కుమార్, పశ్చిమ బెంగాల్ డీజీపీ, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.
కాగా, సుప్రీం తాజా తీర్పుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ''సీబీఐకి సహకరించబోమని మేం ఎప్పుడూ చెప్పలేదు. కోర్టు ఆదేశాలు పాటిస్తాం'' అన్నారు.
కేంద్రం ప్రోటోకాల ప్రకారం వ్యవహరించలేదని కూడా మమత అన్నారు.
శారద పొంజి స్కీం కుంభకోణంపై విచారణ నేపథ్యంలో కేంద్రం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొనడం... కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ధర్నా కొనసాగిస్తుండడం తెలిసిందే.
శారద కుంభకోణం విచారణలో భాగంగా కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు ఆదివారం సీబీఐ అధికారులు వెళ్లగా వారిని పశ్చిమబెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐని అడ్డంపెట్టుకుని కేంద్రం తమపై జులుం చూపుతోందని ఆరోపిస్తూ మమత ఆ రోజు రాత్రి నుంచే సత్యాగ్రహ దీక్ష ప్రారంభించారు.
దీంతో... శారద కుంభకోణంలో విచారణకు సహకరించాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను ఆదేశించాలని కోరుతూ సీబీఐ సోమవారం సుప్రీంను ఆశ్రయించింది.
సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేయడం, అక్రమంగా అదుపులో ఉంచడానికి సంబంధించిన ఆధారాలనూ సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించింది. సత్వరం విచారణ జరపాలని కోరింది.
సీబీఐ అభ్యర్థనలను విన్న అనంతరం సీజేఐ రంజన్ గొగోయి మంగళవారం విచారణకు స్వీకరిస్తామని తెలిపారు. ఆ ప్రకారమే ఈ రోజు జరిగిన విచారణ అనంతరం సుప్రీం తన ఆదేశాలు వెలువరించింది.
వివాదం ఎలా మొదలైంది?
ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటి వద్దకు సుమారు 40 మంది సీబీఐ అధికారులు వెళ్లారు. దీంతో కోల్‌కతా పోలీసులు కూడా అక్కడకు హుటాహుటిన అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు.
కొందరు సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు షేక్‌స్పియర్ సరానీ పోలీస్ ఠాణాకు తీసుకెళ్లారు. ఇంతలో సీబీఐకి చెందిన మరింత మంది అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకోవడం, వారిలోనూ మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకెళ్లడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
కోల్‌కతా పోలీసులు అక్కడితో ఆగకుండా ఆ నగరంలోనే సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న సీబీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకుని సోదాలు చేశారు.
ఆ సమయంలో తనను అదుపులోకి తీసుకోవడంతో పాటు తన ఇంటి చుట్టూ కోల్‌కతా పోలీసులు మోహరించారని సీబీఐ జేడీ పంకజ్ శ్రీవాత్సవ వార్తాసంస్థలకు తెలిపారు.
అయితే, సీబీఐ అధికారులను ప్రశ్నించి వదిలేశామని కోల్‌కతా పోలీస్ జాయింట్ కమిషనర్ ప్రవీణ్ త్రిపాఠీ చెప్పారు.
ఈ పరిణామాల అనంతరం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ఏకంగా దీక్షకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్తతలు పెరగడంతో పాటు కేంద్రం, ఆ రాష్ట్రం మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి:
- రష్యా మంత్రి బంపర్ ప్రైజ్: సరైన సమాధానం చెబితే 2.5 ఎకరాల భూమి ఫ్రీ
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- #fallingstarschallenge: చైనా యువతీ, యువకులు ఎందుకిలా పడిపోతున్నారంటే..
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- అరటిపండు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందా
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులు సంపాదించడం ఎలా?
- ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల అమ్మకం
- సౌదీ: ‘నా చేత బలవంతంగా ప్రార్థనలు చేయించేవాళ్లు. రంజాన్‌లో ఉపవాసం ఉంచేవాళ్లు’
- ఇన్‌స్టాగ్రామ్ ఫొటోల్లో భారత రైలు ప్రయాణం
- ఇన్‌స్టాగ్రామ్: నకిలీ కామెంట్లు, నకిలీ లైక్‌లు ఇక కుదరవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)