You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎంజే అక్బర్ రాజీనామా: ఆరోపణలను వ్యక్తిగత హోదాలో ఎదుర్కొంటానని ప్రకటన
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన తరుణంలో రాజీనామా చేసి పోరాడటమే మేలని భావించినట్లు అక్బర్ తెలిపారని ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ పేర్కొంది.
వ్యక్తిగతంగానే తనపైన ఎదురైన అసత్య ఆరోపణలను సవాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అందుకే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు అక్బర్ చెప్పారు.
ఆయనపైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన పాత్రికేయురాలు ప్రియా రమణి కూడా అక్బర్ రాజీనామాపై స్పందించారు. కోర్టులో కూడా తనకు న్యాయం జరిగే రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె చెప్పారు.
అక్బర్ నైజీరియా పర్యటనలో ఉన్న సమయంలో ఆయనపైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
పాత్రికేయురాలు ప్రియా రమణి 2017లో వోగ్ పత్రికకు 'టు ది హర్వే వైన్‌స్టీన్స్ ఆఫ్ ది వరల్డ్' శీర్షికతో రాసిన కథనంలో పని చేసే చోట వేధింపులు ఎలా ఉంటాయో వివరించారు. ఆ కథనాన్ని రమణి అక్టోబర్ 8న రీట్వీట్ చేస్తూ, అందులో వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ప్రస్తావించిన వ్యక్తి ఎంజే అక్బర్ అని వెల్లడించారు.
ఆ తరువాత, మరి కొంత మంది మహిళలు కూడా తమను అక్బర్ వేధించారని ఆరోపణలు చేశారు.
‘అక్బర్ వైదొలగడానికి రెండు వారాల సమయం, దాదాపు 20మంది మహిళల సాహసం అవసరమయ్యాయి’ అని పాత్రికేయురాలు బర్ఖా దత్ ట్వీట్ చేశారు.
భారతదేశంలోని ప్రముఖ సంపాదకులలో ఒకరుగా పేరు పొందిన అక్బర్ ది టెలిగ్రాఫ్, ది ఏషియన్ ఏజ్ వంటి పత్రికలకు సారథ్యం వహించారు.
ఆ ఆరోపణలన్నీ అసత్యమని చెప్పిన అక్బర్, ప్రియా రమణిపై క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. కేసు కోర్టులో ఉండటంతో, తాను మంత్రి పదవికి రాజీనామా చేయడమే సబబని భావించినట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)