You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎం.జె. అక్బర్: ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్ట్ మీద కేసు వేసిన కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు మీద పరువునష్టం కేసు వేశారు. దేశాన్ని అట్టుడికిస్తున్న #మీటూ ఉద్యమంలో భాగంగా జర్నలిస్ట్ ప్రియా రమణి ఆయనపై ఆరోపణలు చేశారు.
అక్బర్ మీద ఆమె ఆరోపణలు చేసిన తరువాత మరింత మంది మహిళలు కూడా ముందుకు వచ్చి తాము కూడా ఆయన వల్ల వేధింపులకు గురైనట్లు ఆరోపించారు. 'వేటగాడిలా ప్రవర్తించే' అక్బర్ తమను లైంగికంగా వేధించారని ఆరోపించారు.
రమణి మీద కోర్టులో కేసు వేసిన అక్బర్, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఇతరుల మీద కూడా త్వరలోనే కేసులు వేస్తానని హెచ్చరించారు.
ఈ ఆరోపణల మూలంగా తాను మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
#మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అత్యంత ప్రముఖుడైన ఈ కేంద్ర మంత్రి విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని, నిరాధారమైనవని అన్నారు.
అయితే, అక్బర్ తన మీద కేసు పెట్టడం మీద ప్రియారమణి స్పందిస్తూ, ''అక్బర్ మీద ఆరోపణలు చేసిన మహిళలందరూ ఒకప్పుడు ఆయనతో కలిసి పని చేసినప్పుడు ఎదుర్కొన్న అనుభవాల గురించే మాట్లాడారు. ఆ మహిళలు నిజానికి తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితాలు ఇబ్బందుల్లో పడతాయని తెలిసీ ధైర్యంగా ఈ ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించడం చాలా బాధాకరం. ఈ దేశంలో లైంగిక నేరాలకు గురైన మహిళలు సామాజికంగా ఎంతటి క్షోభకు గురవుతారో, అవి వారిని ఎలా వెంటాడుతాయో అందరికీ తెలుసు. ఆ మహిళలు చేసిన ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణించడం మరీ దారుణం. ఆయన బెదరింపులతో, వేధింపులతో వారి నోరు మూయించాలని చూస్తున్నారు" అని అన్నారు.
అంతేకాదు, తన మీద అక్బర్ వేసిన పరువు నష్టం దావాను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, నిఖార్సయిన సత్యమే తన రక్షణ కవచమని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
రమణి 2017లో వోగ్ పత్రికకు 'టు ది హర్వే వైన్‌స్టీన్స్ ఆఫ్ ది వరల్డ్' శీర్షికతో రాసిన కథనంలో పని చేసే చోట వేధింపులు ఎలా ఉంటాయో వివరించారు. ఆ కథనాన్ని రమణి అక్టోబర్ 8న రీట్వీట్ చేస్తూ, అందులో వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ప్రస్తావించిన వ్యక్తి ఎం.జె. అక్బర్ అని వెల్లడించారు.
ఆ తరువాత, మరి కొంత మంది మహిళలు కూడా తమను అక్బర్ వేధించారని ఆరోపణలు చేశారు.
భారతదేశంలోని ప్రముఖ సంపాదకులలో ఒకరుగా పేరు పొందిన అక్బర్ ది టెలిగ్రాఫ్, ది ఏసియన్ ఏజ్ వంటి పత్రికలకు సారథ్యం వహించారు.
ఇప్పుడు ఆయన మీద 'వేటాడే ప్రవర్తన కలిగిన వ్యక్తి' అని, లైంగికంగా దాడులకు కూడా పాల్పడుతారనే ఆరోపణలు వచ్చాయి.
ఆదివారం నాడు ఆయన ట్విటర్‌లో తన ప్రకటనను పోస్ట్ చేశారు. అందులో ఆయన, వచ్చే ఏడాది దేశంలో ఎన్నికలు జరుగనున్నందున రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేశారని అన్నారు.
"ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఎందుకు ఈ తుపాను వచ్చింది? దీని వెనుక అజెండా ఏమిటి? మీరే ఆలోచించండి" అని ఆయన ఆ ప్రకటనలో రాశారు.
అయితే, అక్బర్ వల్ల వేధింపులు ఎదుర్కొన్నామని సామాజిక మాధ్యమాలలో ఆరోపణలు చేసిన మహిళలకు చాలా మంది జర్నలిస్టులు మద్దతుగా నిలిచారు.
గత వారం రోజుల్లో జర్నలిస్టులు, రచయితలు, నటులు, హాస్య నటులు, నిర్మాతల మీద సోషల్ మీడియాలో #మీటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
సీనియర్ నటుడు అలోక్ నాథ్, సినీ దర్శకులు వికాస్ బహల్, సుభాష్ ఘాయ్, సాజిద్ ఖాన్ వంటి ప్రముఖుల మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వాళ్ళందరూ, తమ మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని తోసిపుచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ఎం.జె. అక్బర్: 'వేధింపుల ఆరోపణలన్నీ అబద్ధాలే... చట్టపరంగా ఎదుర్కొంటా'
- #MeToo: మహిళా జర్నలిస్టులు మౌనం వీడేదెప్పుడు?
- మరణ శిక్ష 170 దేశాల్లో లేదా? ఐరాస మాటలో నిజమెంత?
- జమాల్ ఖషోగి అదృశ్యం: 'శిక్షలు' విధిస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామన్న సౌదీ అరేబియా
- భారత్: పదేళ్లలో రెట్టింపైన సిజేరియన్ జననాల శాతం
- 'ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2018': పన్నెండు అత్యద్భుత ఫొటోలు
- భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)