You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎం.జె. అక్బర్: 'వేధింపుల ఆరోపణలన్నీ అబద్ధాలే... చట్టపరంగా ఎదుర్కొంటా'
లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనపై కొంతమంది మహిళలు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని అన్నారు భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం.జె. అక్బర్. ఆ మహిళలు తనపై చేసిన ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటానని ఆయన చెప్పారు.
మహిళలను వేధించినట్లు వచ్చిన ఆరోపణలను కల్పితమైనవని, రాజకీయ దురుద్దేశంతో చేసినవని ఎం.జె. ఆక్బర్ ఒక ప్రకటన చేశారని న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది.
అధికారిక పర్యటనలో స్వదేశానికి దూరంగా ఉండడం వల్లే తనపై వచ్చిన ఆరోపణలపై వెంటనే స్పందించలేకపోయానని కూడా అక్బర్ చెప్పుకొచ్చారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఇటీవలి కాలంలో మామూలైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
"గత సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఆరోపణలు ఎవరూ ఎందుకు చేయలేదు? దీని వెనుక ఏదైనా అజెండా ఉన్నదా? ఇవన్నీ అబద్ధాలు, నిరాధార ఆరోపణలు. నా ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలా చేశారు" అని అక్బర్ అన్నారు.
అబద్ధానికి కాళ్ళుండవు, కానీ అందులో విషం ఉంటుంది, అది ఉన్మాదాన్ని పుట్టించగలదు, ఆందోళనకు గురి చేయగలదని ఆయన అన్నారు.
'ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు?'
ఆరోపణలు చేసిన మహిళలు ఇప్పటి వరకూ ఎందుకు మౌనంగా ఉన్నారని అక్బర్ ప్రశ్నించారు. తాను వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన వారిలో కొందరు మహిళలు తనతో పాటు ఆ తరువాత కూడా కలిసి పని చేశారన్న సంగతిని ఆయన గుర్తు చేశారు.
నైజీరియా పర్యటన ముగించుకుని ఆదివారం దిల్లీకి చేరుకున్న అక్బర్‌ను విలేఖరులు విమానాశ్రయంలోనే చుట్టుముట్టారు. ఈ ఆరోపణల గురించి తరువాత వివరంగా మాట్లాడతానని అక్బర్ వారికి బదులిచ్చారు.
10 మందికి పైగా మహిళలు ఆరోపణలు చేశారు
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సాగుతున్న #MeToo ఉద్యమంలో భాగంగా 10 మంది కన్నా ఎక్కువ మహిళలు ఎం.జె. అక్బర్ మీద ఆరోపణలు చేశారు. వీళ్ళంతా అక్బర్‌తో పాటుగా వివిధ మీడియా సంస్థలలో పని చేసిన మహిళలు.
విదేశ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అక్బర్ మీద 'ప్రిడేటర్ బిహేవియర్' ఉన్న వ్యక్తి అనే ఆరోపణలు వచ్చాయి. మీటింగుల పేరుతో ఆయన యువతులను హోటల్ గదులకు రమ్మనే వారని కొందరు ఆరోపించారు.
దేశంలోని ప్రముఖ సంపాదకులలో ఒకరుగా పేరు తెచ్చుకున్న అక్బర్ గతంలో ది టెలిగ్రాఫ్, ది ఏషియన్ ఏజ్ పత్రికలకు ఎడిటర్‌గా పని చేశారు. ఇండియా టుడే సంస్థలో ఎడిటోరియల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
- #MeToo: మహిళా జర్నలిస్టులు మౌనం వీడేదెప్పుడు?
- #MeToo: ‘బాలీవుడ్లో మరెందరో నాలాగే గళం విప్పుతారు ’
- వివాదంలో ట్రంప్ కుటుంబం: వారికి అంత సంపద ఎలా వచ్చింది? ట్రంప్ తండ్రి ఏం చేసేవారు?
- పాకిస్తాన్: ఐఎస్ఐకి కొత్త చీఫ్.. ఎలాంటి మార్పులు రానున్నాయి?
- జమాల్ ఖషోగి అదృశ్యం: సౌదీ పెట్టుబడుల సదస్సును బహిష్కరించే ఆలోచనలో అమెరికా, బ్రిటన్
- రఫేల్ ఒప్పందం: HAL ఉద్యోగులు వేల సంఖ్యలో రోడ్డున పడతారా?