You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#MeToo: మహిళా జర్నలిస్టులు మౌనం వీడేదెప్పుడు?
- రచయిత, సింధువాసిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేను జర్నలిజం చదువుతున్నప్పుడే ఒక రేడియోలో ఉద్యోగం కోసం అప్లై చేశాను. అక్కడ ఒక సీనియర్‌తో మాట్లాడాను. "నాకిక్కడ ఉద్యోగం దొరుకుతుందా" అని అడిగాను. దానికి ఆయన "ఆ, దొరకచ్చు. కానీ కాస్త ఫీజవుతుంది" అన్నారు.
"అప్పటికి నేను జర్నలిజం అయితే పూర్తి చేశాను, కానీ నా మనసు ఒక పల్లెటూరి అమ్మాయిలా అమాయకంగా ఉండేది. చెప్పాలంటే, నేనంత 'స్మార్ట్' కాదు. అందుకే 'ఫీజ్' అంటే అప్పుడు డబ్బే అనుకున్నాను".
నేను ఆరోజు "సర్, నా దగ్గర ఇప్పుడు ఎక్కువ డబ్బు లేదు. 5 వేలు మాత్రమే ఇచ్చుకోగలను" అన్నా
తర్వాత ఆయన "డబ్బులు కాదు.. ఊరికే అలా......" అన్నారు.
అసలు ఏం చెప్పాలనుకున్నారో నాకు ఆ తర్వాత అర్థమైంది. అలాంటిది కుదరదని నేను ఆయన ముఖాన్నే చెప్పేశాను.
తర్వాత ఆయన నాతో "నువ్వు మీడియాలో ఎప్పటికీ సక్సెస్ కాలేవు. ఎందుకంటే మీడియాలో ఒక అమ్మాయి తనను తానుగా చొరవ చూపించకుంటే, వాళ్లెప్పటికీ డెవలప్ కాలేరు" అన్నారు.
దానికి నేను "పల్లెటూరి నుంచి వచ్చాను. ఏదీ దొరక్కపోతే మా ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటా" అన్నా. ఆయన "అయితే నువ్వు జీవితాంతం వ్యవసాయమే చేసుకుంటావ్. మీడియాలో సక్సెస్ కాలేవు" అన్నారు
ఆయన మాటలు నా మనసులో ఎంత ఘోరంగా నాటుకు పోయాయంటే, కొంతకాలం పాటు నేను మా ఇంటికి తిరిగి వెళ్లిపోయాను. కానీ తను అన్నది తప్పని నిరూపించాలని గట్టిగా అనుకున్నా. చివరకు సాధించా.
ఇది 'గావ్ కనెక్షన్' పత్రికలో పనిచేసే రిపోర్టర్ నీతూ సింగ్ కథ. నీతూ కెరీర్ ప్రారంభంలో ఇదంతా జరిగింది.
కానీ, కానీ, కానీ....
ఇప్పుడు మహిళలు గ్రౌండ్ జీరో నుంచి నేరాలు ఎలా జరిగాయో జనం కళ్లకు కడుతున్నారు. అత్యాచారం, లైంగిక వేధింపుల బాధితులకు న్యాయం చేయడానికి వారి గొంతుగా మారి బ్రేకింగ్ న్యూస్, పత్రికల పతాక శీర్షికలు అయ్యారు.
కానీ అదే మహిళలు న్యూస్‌రూమ్‌లో తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి మౌనంగా ఉండిపోతున్నారు.
గత కొన్ని వారాలుగా న్యూస్‌రూమ్ లోంచి ఒక్కొక్కటిగా #MeToo అంటే మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల కథలు వెలుగులోకి వస్తున్నాయి. చదువుతున్న వారిలో ఆలోచనలు రగిలేలా చేస్తున్నాయి.
న్యూస్ రూమ్ లోపల నుంచి బయటికొచ్చే ఈ #MeToo కథల్లో గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఇప్పటివరకూ వెలుగుచూసిన వాటిలో ఎక్కువ కథలు ఇంగ్లిష్ మీడియా నుంచే ఉన్నాయి.
అలాంటప్పుడు మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇంగ్లిష్ మీడియా కంటే ఎక్కువగా ఉన్న ఎన్నో హిందీ, స్థానిక మీడియాలో పనిచేస్తున్న మహిళల గొంతు బయటికి ఎందుకు వినిపించడం లేదు? అక్కడ వారిపై లైంగిక వేధింపులు లాంటివి జరగలేదా?
అలా అని, అక్కడ అమ్మాయిలు అసలు నోరు తెరవడం లేదని చెప్పలేం. పైకి చెప్పుకోలేకపోతున్నా, వారి గొంతు కూడా వినిపిస్తోంది. కానీ అవి బయటకు రాకుండా ఎవరు నొక్కేస్తున్నారు?
నీతూ కాన్పూర్ దగ్గరే ఉన్న ఒక గ్రామంలో ఉంటారు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్లడానికి ఆమెకు వాహనాలు కూడా దొరకవు.
"హిందీ మీడియాలో పనిచేసే అమ్మాయిల నేపథ్యం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్లు చిన్న పట్టణాల్లో ఉంటారు. అక్కడ మనకు ఏదైనా జరగరానిది జరిగిందంటే అది మన తప్పు వల్లే అని అందరూ చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు. అందుకే ఆఫీసులో మాకు ఏదైనా జరిగిందంటే, అది మా తప్పేనేమో అని మేం మౌనంగా ఉండిపోతాం" అని నీతూ చెప్పారు.
అంతే కాదు, హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఉండే అమ్మాయిలు జర్నలిజంను కెరీర్ ఎంచుకోవడం అనేదే ఒక పెద్ద సవాలు అవుతుందని నీతూ చెప్పారు. తన ఇంట్లో వాళ్లకు కూడా తను జర్నలిస్టు కావడం ఇష్టం లేదన్నారు. బీఎడ్ చేసి టీచర్ అయితే బాగుంటుందని సలహా ఇచ్చేవారని తెలిపారు.
"అంత సంఘర్షణకు గురైన ఏ అమ్మాయైనా, చిటికెలో తన కెరీర్‌ను పణంగా ఎలా పెట్టగలదు చెప్పండి" అంటారు నీతూ.
వర్తికా తోమర్‌కు హిందీ మీడియాలో పదేళ్ల అనుభవం ఉంది. హిందీ మీడియా నుంచి చాలా తక్కువ మంది #MeToo అంటున్నారంటే అది సామాజిక, ఆర్థిక కారణాల వల్లేనని ఆమె అన్నారు.
"హిందీ మీడియాలో పనిచేసే వాళ్లకు అవకాశాలు, ఆప్షన్లు ఇంగ్లీషుతో చూస్తే చాలా తక్కువగా ఉంటాయి. ఇంగ్లీషు కంటే హిందీ జర్నలిస్టులకు జీతం కూడా తక్కువ. అలాంటప్పుడు మహిళలు ఒక ఉద్యోగం వదిలేస్తే, వాళ్లకు ఇంకో మీడియా హౌస్‌లో పని దొరకడం చాలా కష్టం అవుతుంది" అని తోమర్ చెప్పారు.
హిందీ మీడియాలో ఓపెన్‌గా ఉండరు
"మరో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి హిందీ మీడియాలో అమ్మాయిలు ఇంగ్లిష్ మీడియాతో పోలిస్తే తక్కువ. రెండోది హిందీ న్యూస్‌రూమ్ వాతావరణం అంత ఓపెన్‌గా ఉండదు" అని 'నవభారత్ టైమ్స్' ఆన్‌లైన్ మాజీ ఎడిటర్ నీరేంద్ర నాగర్ చెప్పారు.
"అక్కడ ఎవరైనా ఒక అమ్మాయి, తన బాస్ లేదా వేరే మగాళ్లతో కలిసి ఫ్రెండ్లీగా బయటకెళ్లి కాఫీ తాగడం లాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నారు.
వీటన్నిటి వల్ల ఆఫీసులో పనిచేసే మగాళ్లు, మహిళలకు అంత దగ్గరగా వెళ్లడానికి సాహసం చేయరు.
మరాఠీ పత్రిక 'లోక్‌సత్తా' ఎడిటర్ నిరీష్ కుబేర్ మరాఠీ, ఇంగ్లిష్ మీడియా రెండిట్లో పనిచేశారు.
మరాఠీ, స్థానిక మీడియాలో ఎడిటర్లు, రిపోర్టర్ల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. అందుకే వాళ్లు క్లోజ్‌గా ఉండడానికి మొదటి నుంచీ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు.
రెండో కారణం చాలా ముఖ్యమైనదని నిరీష్ కుబేర్ చెప్పారు. "స్థానిక మీడియాలో వాతావరణం చాలావరకూ సంప్రదాయబద్ధంగా ఉంటుంది. అక్కడ పాశ్చాత్య సంస్తృతి ప్రభావం తక్కువ. మరాఠీ లేదా హిందీ మీడియాలో బయటికి వెళ్లి పార్టీ చేసుకునే అవకాశాలు కూడా తక్కువే. జనాలు కలిసి తిరిగడం కూడా పెద్దగా ఉండదు" అన్నారు.
అయితే అలా ఉండడం వల్ల వేధింపులు ఆగిపోతాయి అని నిరీష్, నీరేంద్ర ఇద్దరూ చెప్పారు. అలా చెప్పడం పొరపాటే అవుతుంది.
అక్కడ, బాస్-రిపోర్టర్ మధ్య సత్సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండడం వల్ల మహిళలు తమపై జరిగే వేధింపుల గురించి చెప్పుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది.
గోవాలో పనిచేసే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మనస్విని ప్రభుణే నాయక్ గత 25 ఏళ్ల నుంచి మీడియాలో ఉన్నారు.
జర్నలిజం చేస్తున్నప్పుడు, ఆమె క్లాసులో 38 మంది అబ్బాయిలు ఉండేవాళ్లు. ఆమె ఒక్కటే అమ్మాయి. ఆమె మొదటి ఉద్యోగంలో చేరినపుడు న్యూస్ రూమ్ అంతా మగాళ్లే కనిపించారు. అక్కడ నలుగురు మహిళలే ఉన్నారు.
"మరాఠీ మీడియాలో తమ పట్ల ఏదైనా తప్పు జరిగితే వాటి గురించి పైకి చెప్పుకోలేని అమ్మాయిలు చాలా మంది ఉంటారు. తమ ముందు అసభ్యంగా మాట్లాడతారని, తమతో సంబంధాలు పెట్టుకోవాలని ఒత్తిడి తెస్తారని వాళ్లు చెబుతారు" అని మనస్విని తెలిపారు.
స్థానిక మీడియా నుంచి #MeToo ఘటనలు తక్కువగా బయటికి రావడానికి ఒక పెద్ద కారణం ఉందని మనస్విని చెప్పారు. చాలా కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం పోతుందని, భర్త వదిలేస్తాడేమోనని లోలోపల వాళ్లు భయపడతారని అన్నారు.
తెలుగు టీవీ మీడియాలో 40 ఏళ్ల అనుభవం ఉన్న పద్మజా షా తెలుగు న్యూస్‌రూమ్ వాతావరణంలో ఇప్పటికీ చాలా పురుషాధిక్యత ఉంటుందన్నారు. అమ్మాయిలను జర్నలిజంలోకి రానివ్వరని, ఎలాగోలా మీడియాలోకి వచ్చినా ఉన్నత పదవుల వరకూ వాళ్లు వెళ్లలేకపోతున్నారని చెప్పారు.
తెలుగు, స్థానిక మీడియాలో పనిచేసే అమ్మాయిలు బహుశా ఇప్పుడు అంత పెద్ద రిస్క్ తీసుకోలేరని పద్మ చెబుతున్నారు. ఎందుకంటే ఉద్యోగం పోతుందనే భయం లేని వాళ్లే వాటి గురించి ధైర్యంగా మాట్లాడగలరని అంటారు.
ఆమె మౌనం వీడుతుంది
నీతూ, వర్తికా, మనస్విని, పద్మజ. మహిళా జర్నలిస్టులు మౌనంగా ఉండడానికి ఈ నలుగురూ చెబుతున్న కారణాలకు కాస్త దగ్గరగా అనిపిస్తాయి.
చివర్లో నీతూ మరో రెండు కారణాలు కూడా చెప్పారు. "మహిళలు ఎందుకు మాట్లాడరంటే తర్వాత ఫిర్యాదుపై ఎలాంటి విచారణా జరగదు. ఆ కేసును ఎలాగోలా తొక్కిపెట్టేస్తారు" అన్నారు.
ఇప్పుడు ఇంగ్లిష్ మీడియాలోని మహిళలు మాట్లాడుతున్నప్పుడు, స్థానిక మీడియాలో పనిచేసే మహిళలు కూడా ఏదో ఒక రోజు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెబుతారని పద్మజ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"ఆమె మాట్లాడుతుంది, పెదవి విప్పుతుంది. ఈరోజు కాకపోతే, మరో ఐదారేళ్ల తర్వాత... కానీ ఆమె కచ్చితంగా మౌనం వీడుతుంది" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- వివాదంలో ట్రంప్ కుటుంబం: వారికి అంత సంపద ఎలా వచ్చింది? ట్రంప్ తండ్రి ఏం చేసేవారు?
- రఫేల్ ఒప్పందం: HAL ఉద్యోగులు వేల సంఖ్యలో రోడ్డున పడతారా?
- తిత్లీ తుపాను: 2,25,000 కుటుంబాలపై తీవ్ర ప్రభావం
- జైపూర్‌లో జికా వైరస్... బాధితురాలికి పుట్టిన బిడ్డ పరిస్థితి ఏమిటి?
- 'తిత్లీ' తుపానుకు ఆ పేరు పెట్టింది పాకిస్తాన్
- జమాల్ ఖషోగి అదృశ్యం: సౌదీ పాత్ర ఉంటే తీవ్రంగా శిక్షిస్తామన్న డోనల్డ్ ట్రంప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)