You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రశాంత్ కిశోర్ జేడీయూలోకి : లాభం ఎవరికి? పీకేకా లేక నితీశ్‌కా?
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వారం క్రితం ప్రశాంత్ కిశోర్ ఇండియన్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు. ఎప్పుడూ జీన్స్, టీషర్ట్ వేసుకునే ఆయన అక్కడ తెల్ల కుర్తా-పైజామాలో కనిపించారు.
రాజకీయ నాయకుడి వేషంలో విద్యార్థుల మధ్య ఉన్న ఆయన 2019లో ఏ రాజకీయ పార్టీకి ఎన్నికల నిర్వాహకుడిగా పనిచేయనని, దానికి బదులు నేరుగా ప్రజల మధ్యకు వెళ్లే పనిచేయబోతున్నానని అన్నారు. గుజరాత్ లేదా బిహార్‌లో ఆ పని చేయబోతున్నానని కూడా పీకే అప్పుడు చెప్పారు.
జనతాదళ్ యునైటెడ్ పార్టీలో చేరిన ప్రశాంత్ కిశోర్, తన పాత్రను అంతకు ముందు నుంచే పోషిస్తున్నారనే విషయం ఈ మాటలతో స్పష్టమవుతుంది.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశాంత్ కిశోర్‌ను తమ పార్టీ భవిష్యత్తుగా వర్ణించారు. ఒక విధంగా ముందు ముందు పార్టీకి నేతృత్వం వహించే సత్తాను ప్రశాంత్ కిశోర్‌లో చూస్తున్నట్టు నితీశ్ సంకేతాలు ఇచ్చారని రాజకీయ పండితులు చెబుతున్నారు,
కానీ ప్రశాంత్ కిశోర్ రూపంలో దొరికిన ఈ 'మంత్రాల తాయెత్తు' నితీశ్ కుమార్ రాజకీయ సమస్యలకు పరిష్కారం అవుతుందా?
నితీశ్ కుమార్ ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండచ్చు, కానీ బిహార్‌లో రాజకీయ సమీకరణాల్లో ఆయన మిగతా పార్టీలతో పోలిస్తే చాలా బలహీనంగా కనిపిస్తున్నారు.
20 నెలల వరకూ మహాకూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహించిన తర్వాత మనసు మార్చుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన, అంతకు ముందులా రాష్ట్ర రాజకీయాల్లో నైతికతతో వ్యవహరించలేకపోయారు.
రాజకీయాల్లో నితీశ్ నైతికతకు ఆయన ఓటు బ్యాంకు కంటే చాలా ప్రాధాన్యం ఉంది. రాజకీయ మార్పుల తర్వాత మహాదళితుల భారీ ఓటు బ్యాంకు కూడా ఆయనవైపు సందేహంగా చూస్తోంది. అయినా అది అర్థం చేసుకోవడం నితీశ్ లాంటి వారికి అంత కష్టమేం కాదు. అలాంటప్పుడు పీకేను నమ్ముకోవడం వల్ల రాజకీయంగా ఆయనకు కలిసొస్తుందా?
ప్రశాంత్ కిశోర్‌తో లాభమేంటి?
దీనిపై బాగా ఆలోచించే ముందు, అసలు ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలో చేర్చుకోవడం వల్ల నితీశ్‌కు కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
మొదటి లాభం, బిహార్ రాజకీయాల్లో వేగంగా దూసుకెళ్తున్న యువ నేత తేజస్వికి ప్రత్యామ్నాయంగా ప్రశాంత్ కిశోర్‌ను నితీశ్ ప్రజల ముందుకు తీసుకెళ్తారు. ఆ సమయంలో పీకే తన ఇమేజ్ పెంచుకోడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోసం తను చేసిన పనులను ప్రచారం చేసుకోవచ్చు. సమర్థుడిని అని చెప్పుకోడానికి తన ఎన్నికల మేనేజ్‌మెంట్ గుర్తు చేయవచ్చు. ఈ ప్రయత్నంలో ఆయనకు 'అగ్రవర్ణాల మీడియా' అండ కూడా లభించవచ్చు.
నరేంద్ర మోదీతో సన్నిహితంగా మెలిగే పీకే, నితీశ్ కుమార్ మాటను మోదీ క్యాంప్ వరకూ సులభంగా చేర్చగలరు. అలా చేయడం వల్ల బిహార్‌లో సీట్ల పంపకం సమయంలో జేడీయూ గౌరవప్రదంగా బేరసారాలు చేయచ్చు.
ఇవన్నీ జరిగేవే, కానీ నితీశ్ కుమార్ అసలు రాజకీయం ఇది కాదు. ఆయన బిహార్ రాజకీయాల్లో ఒక పవర్ ఫ్యాక్టర్‌లా ఎక్కువ కాలంపాటు అధికారం చెలాయించడంలో విజయవంతం కాగలిగారంటే, నితీశ్ రాజకీయంగా ఎలా బలంగా మారారో, దాని వెనక పునాది ఏంటో కూడా తెలుసుకోవాలి.
అది 2004లో మొదలైంది, షైనింగ్ ఇండియా పేరుతో జరిగిన సాధారణ ఎన్నికలను నితీశ్ మర్చిపోరు. అప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ఎన్నికల్లో ఓడిపోయింది. బిహార్‌లో లాలూ నేతృత్వంలో ఆర్జేడీ-కాంగ్రెస్-ఎల్జేపీ కూటమి 29 ఎంపీ సీట్లు గెలుచుకోగలిగింది. అప్పుడు బిహార్ రాజకీయాల్లో తనకు చోటు లేకుండా పోయిందని నితీశ్ తన సన్నిహితులతో అన్నట్టు చెబుతారు.
కానీ, కొందరు కార్యకర్తల సలహాతో 2005లో ఆయన భయపడుతూనే మహా దళితుల(దళితుల్లో అత్యంత వెనకబడ్డవారు) మద్దతు కోసం ప్రయత్నించారు. ఆయన ప్రయోగం ఫలించింది. మహాదళితులు, లవ్-కుశ్‌ను (కోహ్రీ, కుర్మీ కలవడాన్ని లవ్-కుశ్ జంటగా చెబుతారు) వారి సమాజంలో కలపడంతో నితీశ్ రాజకీయ కెరియర్ కొత్త ఎత్తులకు చేరింది.
ప్రశాంత్ కిశోర్‌కు ప్రజాకర్షణ ఉందా?
ఆ సమయంలో ఆయనతో ఉన్న జేడీయూ మాజీ నేత ప్రేమ్ కుమార్ మణి దాని గురించి చెప్పారు. "వెనుకబడినవారు, మైనారిటీలు లాలూతో ఉన్నారు, అగ్రవర్ణాలు బీజేపీతో ఉన్నాయి, ఇక నా రాజకీయాలు ముగిసినట్టే అని అప్పట్లో నితీశ్ అన్నారు. కానీ మహాదళిత ఓటు బ్యాంకు ఆయనకు సంజీవనిగా నిలిచింది. అయితే ఆ సలహా ఇచ్చిన వారిని నితీష్ ఎప్పుడో మర్చిపోయారు" అన్నారు.
ఆ సమయంలో బీజేపీ కూడా లాలూను అధికారం నుంచి తప్పించి నితీశ్ కుమార్‌ను గద్దెనెక్కించాలని చాలా పట్టుదలతో ఉంది. కానీ 2013లో ఆ రెండూ విడిపోవడంతో 2014లో నితీశ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. కేవలం రెండు సీట్లకే పరిమితం అయ్యారు.
ఆ ఫలితాలతో నితీశ్.. ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేసేంత డిస్టర్బ్ అయ్యారు. లాలూ యాదవ్‌ను విమర్శిస్తూ రాజకీయాల్లో మెరిసిన ఆయన, చివరికి ఆయన ఇంటికే వెళ్లారు. సరిగ్గా అప్పుడే లాలూను కూడా రాజకీయ కష్టాలు వెంటాడుతున్నాయి. దాంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఎన్నికల్లో మహా కూటమికి భారీ మెజార్టీ లభించింది.
బిహార్‌లో చిన్న పిల్లాడిని అడిగినా నితీశ్, లాలూ యాదవ్ ఒక్కటైతే ఎంత బలమైన రాజకీయ శక్తిగా మారొచ్చో మనకు బాగా అర్థమయ్యేలా చెబుతారు. కానీ నితీశ్ మాత్రం ఆ విజయం క్రెడిట్ అంతా ప్రశాంత్ కిశోర్‌కే ఇస్తూ వచ్చారు.
2015 ఎన్నికల్లో గెలుపు ప్రశాంత్ కిశోర్ వల్లే సాధ్యమైందనే మాట నితీశ్ మనసులో ఆయనకు తెలీకుండానే చొరబడింది అంటారు రాజకీయ విశ్లేషకులు.
కులాలతో ఎంత ప్రభావం ఉంటుంది?
ప్రశాంత్ కిశోర్ వెనుకబడ్డ, దళిత సమాజానికి చెందిన వారయ్యుంటే, బిహార్‌లో నితీశ్‌కు కచ్చితంగా ట్రంప్‌కార్డ్ అయ్యేవారు. కానీ బక్సర్‌లోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ప్రశాంత్ కిశోర్ మహాదళితులకు రాజకీయ ముఖచిత్రం కాగలరా అనేది కచ్చితంగా చెప్పలేం. ముఖ్యంగా కులరాజకీయ సమీకరణలు దారుణంగా ఉండే బిహార్ లాంటి రాష్ట్రంలో అది ఊహించడం చాలా కష్టం.
పరిస్థితులు అనుకూలంగా లేనపుడు ప్రశాంత్ కిశోర్ ఆకర్షణ పనిచేస్తుందా? ఆయన వ్యూహాలు యూపీ ఓటర్లకు రుచించకపోవడంతో, అక్కడ విఫలం అయ్యారు. అయితే ఎన్నికల మేనేజ్‌మెంట్ కోసం ఆయన బీజేపీ, కాంగ్రెస్, జేడీయు, ఆర్జేడీ, వైసీపీ లాంటి పార్టీలకు పనిచేశారు. కానీ 2014లో బీజేపీని గెలిపించడమైనా, 2015లో బిహార్ ఎన్నికల్లో మహాకూటమికి విజయం అందించడమైనా అది కేవలం మేనేజ్‌మెంట్ వల్లే సాద్యం కాదు.
ఆయా పరిణామాల్లో ప్రశాంత్ కిశోర్ గ్రౌండ్ బేస్ అయ్యారు. ఆరేళ్ల అస్థిర మేనేజ్‌మెంట్ ప్రయాణం నుంచి బయటపడి ఇప్పుడు స్థిరమైన మేనేజ్‌మెంట్ మార్గంలోకి వచ్చారు.
ఎక్కడనుంచి పోటీ చేస్తారు?
ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ బస్తర్ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం ఈ సీటు బీజేపీ దగ్గర ఉంది. అక్కడ అశ్వినీకుమార్ చౌబే ఎంపీగా ఉన్నారు. నితీశ్ పట్టుపట్టి బీజేపీ ఈ సీటు వదులుకునేలా చేసినా.. అశ్వినీ కుమార్ చౌబే భాగల్పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసినా బస్తర్ నుంచి ప్రశాంత్ కిశోర్ సులభంగా ఎన్నికల్లో గెలవగలరా అనేది ఆయన మద్దతుదారులే చెప్పలేకపోతున్నారు.
అలాంటప్పుడు ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి తీసుకొచ్చిన నితీశ్ కుమార్‌కు ఆయనవల్ల ఏం ప్రయోజనం దక్కుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి ప్రేమ్ కుమార్ మణి "ప్రశాంత్ కిశోర్ మునిగిపోయే తన పడవను కాపాడుతారని నితీశ్ నమ్మకంతో ఉన్నారు. ఎప్పుడు కష్టం వచ్చినా ఆయనకు దేవతలపై నమ్మకం పెరిగిపోతుంది" అన్నారు.
"నితీశ్ లాంటి పొలిటికల్ లీడర్ తీసుకున్న నాన్ పొలిటికల్ నిర్ణయంగా ఇది నిరూపితం కాబోతోంది" అని కూడా ఆయన చెప్పారు.
బహుశా ఈ కారణం వల్లే ప్రశాంత్ కిశోర్ జేడీయూలో చేరడాన్ని బిహార్ రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
ప్రశాంత్ కిశోర్ జేడీయూతో చేరడం వల్ల ఆ పార్టీ-బీజేపీ బంధంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే ప్రశ్నకు సమాధానంగా బీజేపీ ప్రతినిధి నిఖిల్ ఆనంద్ "ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా రాజకీయం చేయవచ్చు, ఏ పార్టీలో అయినా చేరవచ్చు. అది ఆయా పార్టీల అంతర్గత విషయం" అన్నారు.
ఇటు ఒక ప్రైవేట్ చానల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రశాంత్ కిశోర్‌కు సంబంధించిన ప్రశ్నకు "ఎవరెవరో రాజకీయాల్లోకి వస్తుంటారు, దానివల్ల తేడా ఏం ఉండదు" అని సమాధానం ఇచ్చారు.
అయినా ఒకటి మాత్రం కచ్చితం. పొలిటికల్, పొలిటికల్ మేనేజ్‌మెంట్ రెండూ వేరువేరుగా ఉంటాయి. ఈ విషయం నితీశ్ కుమార్‌కు తెలీకపోవచ్చు. కానీ దాని గురించి ప్రశాంత్ కిశోర్‌కు తెలిసినంత బాగా వేరే ఎవరికీ తెలిసుండకపోవచ్చు.
ఇవికూడా చదవండి:
- పీఎస్ఎల్వీ-సీ42: అనుమానాస్పద నౌకాసంచారాన్ని గుర్తించే ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
- శ్రీహరి కోటలో ‘రాకెట్’ రహస్యం
- సోషల్ మీడియా ఎడిక్షన్: బయటపడండి ఇలా..
- "బికినీల వల్లే చాలామంది అమ్మాయిలు బాడీ బిల్డింగ్‌ను ఎంచుకోవట్లేదు"- బినల్ రాణా
- ‘రాజకీయ నాయకుల వివాహేతర సంబంధాలపై సంబంధాలపై ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడరు. ఎందుకు?’
- ‘బాయ్స్ హాస్టల్స్‌లో లేని రూల్స్ మాకెందుకు?’
- ‘బాయ్స్ హాస్టల్స్‌లో లేని రూల్స్ మాకెందుకు?’
- 'డబ్బు పరిహారంతో గాయం మానదు' - నంబి నారాయణన్
- లబ్.. డబ్బు: షేర్ మార్కెట్లు ఎందుకిలా పడిపోతున్నాయి?
- మిర్యాలగూడలో 'పరువు' హత్య: ‘మా నాన్నను ఒప్పిస్తాను, ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటాం’
- అభిప్రాయం: 2019 ఎన్నికల దిశగా బీజేపీ కుల సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి?
- భారతదేశంలో మహిళల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి?
- ఉమ్మడి పౌర స్మృతి: ‘ఇలా చేస్తే కర్రా విరగదు, పామూ చస్తుంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)