You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పుణే పోలీసులు అరెస్ట్ చేసిన హక్కుల ఉద్యమకారులు ఎవరు? ఏం చేస్తుంటారు?
పుణే పోలీసులు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సోదాలు జరిపి అయిదుగురు ఉద్యమకారులను వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లాఖాల, వెర్నన్ గొంజాల్వెజ్, వరవరరావులను అరెస్ట్ చేశారు.
భీమాకోరెగావ్ అల్లర్ల కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేస్తున్న పుణే పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని భీమాకోరెగావ్‌లో చోటుచేసుకున్న హింసతో వారికి సంబంధం ఉందన్నది పోలీసుల ఆరోపణ.
సుధా భరద్వాజ్
పోలీసులు ఈ రోజు ఉదయం హరియాణాలోని సూరజ్‌కుండ్ సమీపంలో సుధా భరద్వాజ్‌ను అరెస్ట్ చేయడంతో ఈ అరెస్టుల పరంపర మొదలుపెట్టారు. న్యాయవాది, హక్కుల కార్యకర్త అయిన సుధా భరద్వాజ్ దిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీగానూ పనిచేస్తున్నారు. కార్మిక నేత కూడా అయిన ఆమె న్యాయవాదిగా తరచూ కార్మికులకు సంబంధించిన కేసులను వాదిస్తుంటారు.
నకిలీ ఎన్‌కౌంటర్లలో మరణించిన గిరిజనుల తరఫున ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో పలుమార్లు హెబియస్ కార్పస్ పిటిషన్లు వేశారు. మానవ హక్కుల ఉల్లంఘనల బాధితుల సమస్యలను ఆమె జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తుంటారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ కేంద్రంగా పనిచేసే ఆమె 'పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్' సంస్థతో కలిసి పనిచేస్తున్నారని ఆమె కుమార్తె అనూష 'బీబీసీ'కి తెలిపారు.
గౌతమ్ నవ్‌లాఖా
ప్రజాస్వామ్య, మానవ, పౌర హక్కుల కోసం పనిచేసే సీనియర్ కార్యకర్త గౌతమ్ నవ్‌లాఖా. ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ(ఈపీడబ్ల్యూ)లో ఆయన సంపాదక సలహాదారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడే 'పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్' సంస్థతో ఆయనకు సంబంధాలున్నాయి. ఆ సంస్థకు గతంలో కార్యదర్శిగా ఉన్న ఆయన కశ్మీర్‌లో మానవ హక్కులు, న్యాయానికి సంబంధించిన ఇంటర్నేషనల్ పీపుల్స్ ట్రిబ్యునల్ సమన్వయకర్తగానూ పనిచేశారు.
కశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగే ఘటనల్లో నిజనిర్ధారణ చేపట్టే కార్యక్రమాల్లో ఆయన ఎక్కువగా పాలుపంచుకుంటుంటారు. కశ్మీర్‌లో రిఫరెండం డిమాండ్‌కు మద్దతు పలకడంతో 2011 మేలో ఆయన్ను శ్రీనగర్‌లో ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకుంది.
పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్ సంస్థతో ఆయనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ఆ సంస్థకు చెందిన హరీష్ ధావన్ 'బీబీసీ'కి చెప్పారు.
కశ్మీర్‌లో పౌరులపై సైనిక చర్యలు జరిగినప్పుడంతా ఆయన ఆ రాష్ట్రంలో పర్యటిస్తారని, కశ్మీర్ సమస్యపై ఆయనకు విస్తృత అవగాహన ఉందని హరీష్ తెలిపారు.
నవ్‌లాఖా ఇంటిపై దాడిని ''ప్రశ్నించే బలమైన గొంతులను నొక్కేయడం''గా అభివర్ణించారు హరీష్.
పుణె పోలీసులు మరికొందరు హక్కుల ఉద్యమకారుల ఇళ్లపైనా దాడులు చేశారు. వారిలో అరుణ్ ఫెరీరా, వరుణ్ గొంజాల్వెజ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
అరుణ్ ఫెరీరా
బాంద్రాకు చెందిన అరుణ్ ఫెరీరా ముంబయి హైకోర్ట్, సెషన్స్ కోర్ట్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఆయన నాలుగేళ్లు జైలులో గడిపి 2012లో నిర్దోషిగా బయటపడ్డారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్(ఐఏపీఎల్) సంస్థకు ఆయన కోశాధికారిగా పనిచేస్తున్నారు.
భీమా కోరెగావ్ హింసకు సంబంధించి జూన్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన దళిత యాక్టివిస్ట్ సుధీర్ ధావలె విడుదల కోసం ఆయన పోరాడుతున్నారు.
1990ల ప్రాంతంలో ఆయన రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు గాను రక్తదాత చిత్రాలను గీసేవారు. 1993లో అల్లర్లు జరిగిన గోరెగావ్, జోగేశ్వరి ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు ఆయనలోని మార్క్సిస్ట్ భావజాలం మరింత బలపడింది.
అనంతరంలో ఆయనలోని కార్టూనిస్ట్ మరుగునపడిపోయి పూర్తిస్థాయి ఉద్యమకారుడిగా మారారు. మహారాష్ట్ర ప్రభుత్వం మావోయిస్ట్ సంస్థగా చెప్పే దేశ్‌భక్తి యువ మోర్చాలో ఆయన పనిచేసేవారు.
జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన అక్కడ తన ఏకాంతవాసం, తాను అనుభవించిన యాతనను 'కలర్స్ ఆఫ్ ది కేజ్: ఏ ప్రిజన్ మెమొయిర్' పేరుతో పుస్తకంగా వెలువరించారు. ఇది తెలుగు, బెంగాలీ, మరాఠీ, పంజాబీ సహా అనేక భాషల్లో అనువాదమైంది.
వెర్నన్ గొంజాల్వెజ్
ముంబయికి చెందిన ఈ రచయిత, ఉద్యమకారుడు ముంబయి విశ్వవిద్యాలయంలో చదువుకున్నప్పుడు గోల్డ్ మెడలిస్ట్. ముంబయిలోని పలు కళాశాలల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా కామర్స్ బోధిస్తుంటారు.
యూఏపీఏ చట్టం కింద 2007లో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆరేళ్లు జైలులో గడిపారు. నాగపూర్ జిల్లా, అదనపు సెషన్స్ కోర్ట్ ఆయన్ను ఆయుధ చట్టం కింద నమోదైన కేసుల్లో శిక్ష వేసింది.
అయితే, అప్పటికే ఆరేళ్లు జైలులో ఉండడంతో 2013లో విడుదలయ్యారు. ఆయన భార్య సుసాన్ అబ్రహం మానవ హక్కుల న్యాయవాది.
వరవరరావు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరవరరావు వామపక్ష సానుభూతిపరుడు. రచయిత, కవి అయిన వరవరరావు విప్లవ రచయిత సంఘం(విరసం) వ్యవస్థాపకుల్లో ఒకరు.
వరంగల్ జిల్లా చినపెండ్యాలకు చెందిన ఆయన అత్యయిక పరిస్థితి సమయంలో, ఆ తరువాత పలుమార్లు అరెస్టై జైలులో గడిపారు.
రాంనగర్ కుట్రకేసు, సికింద్రాబాద్ కుట్ర కేసు సహా 20కి పైగా కేసుల్లో విచారణ ఎదుర్కొన్నప్పటికీ ఆయనపై వచ్చిన ఆరోపణల్లో ఏదీ రుజువు కాలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీపుల్స్‌వార్ నక్సలైట్లు, మావోయిస్టులతో ప్రభుత్వాలు చర్చలు జరిపిన సందర్భంలో వరవరరావు మధ్యవర్తిగా వ్యవహరించారు.
వరవరరావు కుమార్తెల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు జరిపినట్లు ఆయన బంధువు వేణుగోపాల్ తెలిపారు.
మా ఇతర కథనాలు:
- ఆ రాజ్యానికీ రాజుకూ ఈ అందమైన, బలమైన మహిళా సైనికులే రక్ష
- భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?
- బీబీసీ స్పెషల్: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ఎడారీకరణ ముప్పు
- ‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్‌లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా బతుకుతున్నారు’
- జలియాన్‌వాలా బాగ్ నరమేధం: ‘వందేళ్ల ఆ గాయాలు క్షమాపణలతో మానవు’
- ఆపరేషన్ బ్లూ స్టార్: ‘కాల్పుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది’
- వెయ్యేళ్ల పాత్ర.. వెల రూ.248 కోట్లు
- జీసస్: నిజంగా నల్లగా ఉండేవాడా?
- తొలి కంచి పీఠాధిపతి ఆది శంకరుడేనా?
- నిజాం నవాబూ కాదు, బిల్ గేట్సూ కాదు.. చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- చరిత్ర: ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ ఎలా సాధించుకున్నారు?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)