You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తొలి కంచి పీఠాధిపతి ఆది శంకరుడేనా?
- రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫిబ్రవరి 28న జయేంద్ర సరస్వతి మరణం తర్వాత విజయేంద్ర సరస్వతి కంచి శంకర మఠానికి నూతన పీఠాధిపతి కాబోతున్నారు.
కంచి శంకర మఠానికి తనదైన చరిత్ర ఉంది. ఆది శంకరుడిని ఈ మఠానికి తొలి గురువుగా భావిస్తారు.
ఆయన 2500 ఏళ్ల క్రితం, అంటే క్రీ.పూ. 509లో జన్మించినట్టు మఠానికి చెందిన వెబ్‌సైట్ తెలుపుతుంది.
ఆయన తన చివరి రోజులను కంచిలో గడిపి 'ముక్తి'ని పొందారని అందులో ఉంది. ఈ మఠాన్ని క్రీ.పూ. 482లో స్థాపించినట్టు వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది.
ఆది శంకరుడి తర్వాత ఆయన వారసులు ఈ మఠాన్ని 62వ పీఠాధిపతి వరకు అక్కడే కొనసాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత, కాంచీపురంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా 62వ పీఠాధిపతి (1746-1783) ఈ మఠాన్ని తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు.
1760వ దశకంలో తంజావూరు రాజు పిరతాబ సింగన్ విజ్ఞప్తిపై మఠాన్ని తంజావూరులో నెలకొల్పారు.
తంజావూరులో నెలకొల్పడానికి ముందు మఠం తంజావూరు జిల్లాలోని కుంబకోణంలో ఉండేది. 62వ, 63వ, 64వ పీఠాధిపతులు అక్కడే 'ముక్తి'ని పొందారు.
1907లో చంద్రశేఖేంద్ర స్వామి పీఠాధిపతిగా నియుక్తులయ్యారు. 1954లో జయేంద్ర సరస్వతిని ఆయన తన వారసుడిగా ప్రకటించారు. ఆ తర్వాత 1983లో విజయేంద్ర సరస్వతిని తన వారసుడిగా జయేంద్ర సరస్వతి ప్రకటించారు.
విజయేంద్ర సరస్వతి తమిళనాడులోని కాంచీపురం జిల్లా తాండళం గ్రామానికి చెందిన వాడు.
వెబ్‌సైట్‌లో మొత్తం 70 మంది పీఠాధిపతుల నియామకానికి సంబంధించిన వివరాలున్నాయి. అయితే భారతదేశంలోని ఇతర నాలుగు మఠాల గురించీ, వాటితో ఈ మఠానికి ఉన్న సంబంధాల గురించి మాత్రం ఏ సమాచారం లేదు.
ఉదాహరణకు, ఆది శంకరుడు క్రీ.పూ. 788లో కేరళలోని కలాడిలో జన్మించారని కర్ణాటకలోని శృంగేరి మఠం చెబుతుంది.
ఈ మఠం అందించే సమాచారం ప్రకారం, ఆదిశంకరుడు నాలుగు దిశల్లో నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు - తూర్పు (ఒడిషా) ప్రాంతంలో పూరీలో గోవర్ధన మఠం, దక్షిణాన (కర్ణాటక) శృంగేరీ మఠం, పశ్చిమాన (ద్వారక) కాళికా మఠం, ఉత్తరాన (బద్రికాశ్రమం) జోతిర్ మఠం.
ఈ మఠాలు నాలుగు వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ మఠాల చరిత్రలో ఎక్కడా కంచి మఠం గురించిన ప్రస్తావన లేదు.
1821లో తంజావూరు జిల్లాలోని కుంబకోణంలో శృంగేరీ మఠమే కంచి మఠాన్ని ఏర్పాటు చేసినట్టు కొందరు విమర్శకులు అభిప్రాయపడతారు.
అయితే ఈ శాఖ 1839లో స్వతంత్ర మఠంగా పని చేయడం ప్రారంభించి కుంబకోణం నుంచి కాంచీపురానికి తరలి వెళ్లింది. ఆ తర్వాత కాంచీపురాన్నే తన ప్రధాన కేంద్రంగా ప్రకటించుకుంది.
వారసుల నియామకాలకు సంబంధించి కంచి మఠానికి ఒక స్పష్టమైన విధానం అంటూ ఏదీ లేనట్టుగా కనిపిస్తుంది.
1987లో జయేంద్ర సరస్వతి కంచి మఠాన్ని వదిలేసి వెళ్లారు. అలా ఆయన వెళ్లిపోవడంతో మఠానికి తదుపరి పీఠాధిపతి ఎవరన్న ప్రశ్న తలెత్తింది.
అయితే, "విజయేంద్ర సరస్వతిని తన వారసుడిగా 1984లోనే జయేంద్ర సరస్వతి ప్రకటించారు" అని తమిళనాడు హిందూ మత, చారిటబుల్ ఎండోమెట్స్ (హెచ్ఆర్‌సీఈ) ప్రకటించింది.
"కంచి కామాక్షి మందిరంలో ఆయన నియామకానికి సంబంధించిన తంతు కూడా పూర్తయింది. కాబట్టి ఆయనను వారసుడిగా నియమించడం కోసం మరో కార్యక్రమం ఏదీ అవసరం లేదు" అని అది అప్పుడే తెలిపింది.
అలా, విజయేంద్ర సరస్వతికే ఇప్పుడు కంచి పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)